ETV Bharat / international

choksi: 'ఛోక్సీని కిడ్నాప్‌ చేయాల్సిన ఖర్మ మాకేంటి?'

author img

By

Published : Jul 3, 2021, 8:16 AM IST

వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని డొమినికా పోలీసులు కిడ్నాప్‌ చేశారనడాన్ని ఆ దేశ ప్రధాని రూజ్‌వెల్డ్‌ స్కిర్రిట్‌ కొట్టిపారేశారు. ఛోక్సీని కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం అటు భారత్‌కు గానీ, ఇటు ఆంటిగ్వా, డొమినికాకు కూడా లేదన్నారు.

Dominica pm
ఛోక్సీ

పంజాబ్‌ బ్యాంకు కుంభకోణం కేసు నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని డొమినికా పోలీసులు కిడ్నాప్‌ చేశారనడాన్ని ఆ దేశ ప్రధాని రూజ్‌వెల్డ్‌ స్కిర్రిట్‌ కొట్టిపారేశారు. ఇవన్నీ అర్థంలేని ఆరోపణలన్నారు. ఇటీవల ఆంటిగ్వా నుంచి కనిపించకుండా పోయిన ఛోక్సీ.. డొమినికా పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం ఆయన డొమినికా జైలులో ఉన్నారు. దీనిపై స్కిర్రిట్‌ మాట్లాడుతూ.. "ఛోక్సీ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరాం. అయితే ఆయన హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసుకుంటాం" అని అన్నారు.

భారత్‌, డొమినికా కలిసి ఛోక్సీని ఆంటిగ్వా నుంచి కిడ్నాప్‌ చేశారన్న వాదనలను స్కిర్రిట్‌ కొట్టి పారేశారు. ఛోక్సీని కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం అటు భారత్‌కు గానీ, ఇటు ఆంటిగ్వా, డొమినికాకు కూడా లేదన్నారు. దేశాభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో అసలు తల దూర్చబోమని స్పష్టం చేశారు. "ఈ దేశంలో ఎవర్నో హత్యచేసి పక్కదేశానికి పారిపోయి హాయిగా బతుకుంటే.. అలా వదిలేస్తామా? లేదా తిరిగి డొమినికాకు పట్టుకొచ్చి శిక్షిస్తామా?" అని ఆయన ప్రశ్నించారు.

డొమినికాకు చెందిన ఓ పౌరుడ్ని అమెరికాకు అప్పగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా స్కిర్రిట్‌ ఉటంకించారు. ఇలాంటి నిర్ణయాలే మెహుల్‌ ఛోక్సీపైనా తప్పవని ఆయన పరోక్షంగా చెప్పారు. డొమినికా.. డబ్బున్న వారిని, లేనివారిని వేర్వేరుగా చూడలేదని స్కిర్రిట్‌ వ్యాఖ్యానించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, దానికి పేద, ధనిక తారతమ్యాలు ఉండవని అన్నారు. ఛోక్సీ అంశం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉందని, న్యాయస్థానాలే నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.

ఇదీ చూడండి: Choksi: 'భారత్‌ పేరు వింటే బీపీ పెరుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.