ETV Bharat / international

అమెరికా నిఘా వ్యవస్థకే ముప్పు- టీకానే కారణం!

author img

By

Published : Nov 5, 2021, 1:28 PM IST

Thousands of intel officers refusing vaccine risk dismissal
అమెరికా నిఘా వ్యవస్థకే ముప్పు- టీకానే కారణం!

కరోనా టీకా తీసుకోని కారణంగా అమెరికా నిఘా వ్యవస్థలో పనిచేసే వేలమంది సిబ్బంది ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ వీరందరినీ ఒకేసారి విధుల నుంచి తప్పిస్తే ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుందని ప్రశ్నించారు.

టీకా వేసుకోకపోతే ఉద్యోగులను తొలగించాలనే ప్రభుత్వ నిబంధన కారణంగా అమెరికా నిఘా వ్యవస్థకే ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది. అగ్రరాజ్యం నిఘా వ్యవస్థలోని వివిధ సంస్థల్లో పనిచేసే వేల మంది సిబ్బంది ఇంకా ఒక్క డోసు టీకా కూడా తీసుకోకపోవడమే ఇందుకు కారణం. దీనిపై రిపబ్లికన్ చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరందరికీ ఒకేసారి ఉద్యోగాల నుంచి తొలగిస్తే జాతీయ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. అక్టోబర్​ చివరి నాటికి పలు నిఘా సంస్థల్లో ఇంకా టీకా తీసుకోని సిబ్బంది 20శాతానికి పైనే ఉన్నారని రిపబ్లికన్ చట్టసభ్యుడు, ప్రతినిధుల సభ నిఘా కమిటీలోని సభ్యుడు క్రిస్ స్టివార్డ్​ వెల్లడించారు.

అమెరికా నిఘా వ్యవస్థలోని 18 సంస్థల్లో కొన్నింటిలో 40శాతం సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోలేదని స్టివర్ట్ తెలిపారు. వీటి పేర్లను మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. కమిటీకి వివరాలు అందినప్పటికీ పరిపాలనా యంత్రాంగం వీటిని ఇంకా బహిరంగంగా ప్రకటించలేదని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులందరూ నవంబర్ 22 నాటికి కచ్చితంగా టీకా తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. అప్పటిలోగా చాలా మంది టీకా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎవరైనా టీకా తీసుకోవడానికి నిరాకరిస్తే వారిని విధులనుంచి తొలగించాల్సి ఉంటుంది. నిఘా వ్యవస్థలో పనిచేసే సిబ్బందిని కూడా ఉద్యోగం నుంచి తప్పిస్తే వారిని భర్తీ చేయడం కష్టమవుతుందని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా భద్రతా తనిఖీల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారని చెప్పారు.

ఎంతమంది?

నిఘా వ్యవస్థలో ఎంతమంది టీకాలు తీసుకోలేదో కచ్చితమైన సంఖ్యను వెల్లడించడానికి జాతీయ నిఘా డైరెక్టర్ నిరాకరించారు. ఒకవేళ వేల మంది ఉద్యోగులను తప్పించాల్సి వస్తే ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది? అనే విషయాన్ని కూడా వివరించలేదు. అయితే వ్యాక్సినేషన్ మిషన్​లో ఇది సమస్య అవుతుందని తాము భావించడం లేదని పేర్కొన్నారు. వైద్య, మతపరమైన సహా ఇతర కారణాలతో ప్రజలకు ప్రభుత్వం మరిన్ని మినహాయింపులివ్వాలని స్టివర్ట్ సూచించారు. ఉద్యోగులను తొలగించాల్సి వస్తే ఆలస్యంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

అమెరికా నిఘా వ్యవస్థలో 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా. అమెరికాలోని సాధారణ పౌరులకంటే నిఘా వ్యవస్థ సిబ్బందిలో తక్కువ శాతం మంది టీకాలు తీసుకున్నట్లు స్టివర్ట్ తెలిపారు. అమెరికా ప్రజల్లో టీకాకు అర్హులైన వారిలో 70 శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. 80శాతం మంది కనీసం ఒక్క డోసు టీకా అయినా తీసుకున్నారు.

కరోనా కారణంగా ప్రపంచంలోనే అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది అమెరికా. ఈ ఒక్క దేశంలోనే 7.5లక్షల మంది వైరస్​కు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య 50లక్షలు దాటింది. వైరస్ ఉద్ధృతిని నియంత్రించేందుకు టీకా పంపిణీని యుద్ధప్రాతిపదికన చేపట్టింది బైడెన్ ప్రభుత్వం. నవంబర్ 22నాటికి కరోనా టీకా తీసుకొని ఉద్యోగులను 14 రోజుల పాటు విధుల నుంచి తొలగించాలని నిర్ణయించింది. అప్పటికీ తీరు మారకపోతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తప్పిస్తారు.

ఇదీ చదవండి: 'తైవాన్‌ ఒంటరి కాదు.. యూరప్‌ మీతోనే ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.