ETV Bharat / international

తుది ఘట్టానికి అధ్యక్ష పోరు- ఫలితంపై ఉత్కంఠ

author img

By

Published : Nov 3, 2020, 1:27 PM IST

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్షుడిగా మళ్లీ ట్రంపే వస్తారా? లేదా బైడెన్​కు అధికారం దక్కుతుందా? ఎప్పటిలాగే మంగళవారం రాత్రే ఫలితాలు వస్తాయా? మెయిల్ ఓటింగ్ కారణంగా ఆలస్యం జరగుతుందా? అనే ప్రశ్నలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

US ELECTION OVERALL
ట్రంప్ వర్సెస్ బైడెన్

ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా కొనసాగుతోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పర్వం తుది దశకు చేరింది. దేశవ్యాప్తంగా మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్ సారథ్యాన్ని అగ్రరాజ్యం కొనసాగిస్తుందా? లేదా డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్​ చేతికి అప్పగిస్తుందా? అనేది అతి త్వరలో తేలనుంది.

ఓటింగ్ ప్రక్రియ కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి 7 గంటలకు(భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 4.30), మిగతా చోట్ల రాత్రి 9 గంటలకు(భారత్​లో బుధవారం ఉదయం 6.30) పూర్తవుతుంది.

రికార్డు స్థాయి ఓటింగ్!

కరోనా నేపథ్యంలో ముందస్తు ఓటింగ్​కు అపూర్వ ఆదరణ లభించింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 10 కోట్ల మంది ఓటేశారు. బ్యాలెట్ విధానంలో సుమారు 6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా. అంటే మొత్తం 67 శాతం పోలింగ్. 1900 ఏడాది తర్వాత ఇదే అత్యధికం కానుంది.

లెక్కింపు ఇలా..

ఓటింగ్ పూర్తి కాగానే లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. అమెరికా ఎన్నికల ప్రక్రియ ఎంత సంక్లిష్టమో.. లెక్కింపు కూడా అంతే కష్టమైన పని. ఇందుకు సహజంగా చాలా రోజుల సమయం పడుతుంది. అయితే, ఎన్నికలు జరిగిన తర్వాతి రోజే విజేత ఎవరనేది ఓ స్పష్టత వస్తుంది.

ఫలితాలు ఎప్పుడు?

ఫలితాలు రాత్రి వరకు తేలుతాయా? ఆలస్యం జరుగుతుందా? అనే సందేహాలు అందరి మదిలో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో మెయిల్ ఓటింగ్ భారీగా పెరగటం వల్ల లెక్కింపు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపులో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిబంధనలు అమల్లో ఉండటమూ జాప్యానికి అవకాశం ఇస్తోంది.

ఎన్నిక పరోక్షమే..

అమెరికా అధ్యక్షుడు ప్రజల ఓట్లతో నేరుగా కాకుండా పరోక్ష పద్ధతిలోనే ఎన్నికవుతారు. ఈ సంక్లిష్ట ప్రక్రియలో ఎలక్టోరల్‌ కాలేజ్‌లో అత్యధిక స్థానాలు సాధించిన వారే విజేత. ప్రజలు వాస్తవంగా ఓటు వేసేది ఎలక్టార్‌కు. ప్రతి రాష్ట్రానికి జనాభాను అనుసరించి ఎలక్టార్ల సంఖ్యను నిర్ణయిస్తారు. మొత్తం 538 మంది ఎలక్టార్లు ఉంటారు. 270 అంతకన్నా ఎక్కువ మంది ఎలక్టార్లను గెల్చుకున్న పార్టీ అభ్యర్థే అధ్యక్షుడవుతారు.

ఎప్పుడూ ఈ పార్టీలేనా?

అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ వినిపించే పార్టీల పేర్లు.. డెమొక్రటిక్, రిపబ్లికన్​. ఈ రెండు పార్టీలదే అమెరికా రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో రెండే ప్రధాన పార్టీలుగా ఉండటానికి కారణాలు చాలానే ఉన్నాయి.

US ELECTION OVERALL
రెండే పార్టీలు..

ఓటరు ఎటువైపు?

పోల్ సర్వేలు పరిశీలిస్తే బైడెన్​కే అమెరికా ఓటర్లు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతోంది. కీలక రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన చాలా సర్వేల్లో ట్రంప్​ కన్నా బైడెన్​ 9-10 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు తేల్చాయి. అయితే, ఈ అంచనాలు తారుమారైనా ఆశ్చర్యపోనవసరం లేదు.

2016లోనూ సర్వేలకు భిన్నంగా ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఫలితాలను తేల్చే అంశాలివే..

ట్రంపా, బైడెనా... ఎవరు కొత్త అధ్యక్షుడనేది తేల్చుకోబోతున్న అమెరికా ప్రజానీకం ఇంతకూ వేటి ఆధారంగా తన నిర్ణయాన్ని తెలుపుతోంది? అమెరికా ఓటర్లను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి?

US ELECTION OVERALL
ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు..

ఇద్దరి మధ్య టై అయితే..

ట్రంప్, బైడెన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో 'టై' అయితే ఎలా అన్న అంశం చర్చకు వస్తోంది. ఇందుకు అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ముందుగానే ఊహించి పరిష్కారాన్ని పొందుపరిచారు. నిబంధనల ప్రకారం అమెరికా కాంగ్రెస్​లోని ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.

లక్ష కోట్లు వ్యయం..

ఈ సారి అమెరికా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ధన ప్రవాహం కొనసాగింది. ఇప్పటివరకు ఈ ఎన్నికలే అత్యంత ఖరీదైనవిగా నిలవబోతున్నాయి. మొత్తం రూ.లక్ష కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఇది 2016 ఎన్నికలతో పోలిస్తే రెండింతలు.

ఎవరు గెలిస్తే ఏంటి?

అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారన్న అంశంపై ప్రపంచమంతటా ఆసక్తి నెలకొంది. ఎవరు గెలిస్తే ఏం జరుగుతుందన్న విషయంపైనా చర్చ జరుగుతోంది. ట్రంప్​కు మళ్లీ అధికారం వస్తే అంతర్జాతీయ సంబంధాలు క్షీణిస్తాయా? బైడెన్​తో దేశాల మధ్య సహకారం పెరుగుతుందా? అయితే, ఎవరు గెలిచినా భారత్​కు కలిగే ప్రయోజనం అంతంతమాత్రమేనన్నది నిపుణుల విశ్లేషణ.

కట్టుదిట్టమైన భద్రత..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దశాబ్దాల తరబడి ప్రశాంతంగానే జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి, వర్ణవివక్ష నిరసనలు తదితర పరిణామాలతో ఈ సారి భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా భత్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.