ETV Bharat / international

చివరి సర్వేలోనూ బైడెన్ జోరు- ట్రంప్​పై భారీ లీడ్

author img

By

Published : Nov 2, 2020, 11:04 AM IST

Updated : Nov 2, 2020, 1:31 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు విడుదలైన చివరి సర్వేలోనూ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ దూసుకుపోతున్నారు. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్​పై 10 పాయింట్ల తేడాతో జోరు కనబరుస్తున్నారు. హోరాహోరీ పోరు జరిగే రాష్ట్రాల్లోనూ ఓటర్లు బైడెన్​కే అనుకూలంగా ఉన్నారు. అయితే శ్వేతజాతీయులు, డిగ్రీ పట్టా లేని తెల్ల ఓటర్లలో ట్రంప్ హవా కొనసాగుతోంది.

Biden leads Trump by 10 points in pre-election poll
చివరి సర్వేలోనూ బైడెన్ జోరు- ట్రంప్​పై భారీ లీడ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఎన్నికకు కొన్ని గంటలే ఉన్న సమయంలో విడుదలైన ఎన్​బీసీ న్యూస్, వాల్​స్ట్రీట్ జర్నల్​ పోల్​లో 10 పాయింట్ల ముందంజలో ఉన్నారు. బైడెన్​ 52 శాతం ఓట్లు దక్కించుకోనుండగా... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు 42 శాతం ఓటర్లు మద్దతుగా ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైంది.

హోరాహోరీ పోటీ జరిగే 12 రాష్ట్రాల్లో బైడెన్ 6 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేల్లో తేలింది. అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, అయోవా, మెయినీ, మిషిగన్, మిన్నెసోటా, ఉత్తర కరోలినా, న్యూ హాంప్​షైర్, నెవాడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్​లో బైడెన్​కు 51 శాతం మద్దతు లభిస్తుండగా.. ట్రంప్​ 45 శాతం మద్దతు పొందుతున్నట్లు పోల్స్ తెలిపాయి.

బైడెన్​కే జై!

నల్లజాతీయుల్లో 87 శాతం మంది బైడెన్​వైపే ఉన్నారు. 5 శాతం మంది మాత్రమే ట్రంప్​కు అనుకూలంగా ఉన్నారు. యువ(18-34 ఏళ్ల మధ్య వయసున్న) ఓటర్లలో బైడెన్​కు 60 శాతం, ట్రంప్​కు 32 శాతం మద్దతిస్తున్నారు. సీనియర్లలో 58 శాతం బైడెన్, 35 శాతం ట్రంప్​వైపు ఉన్నారు. మహిళల్లో 57 శాతం బైడెన్​కు మద్దతిస్తుండగా.. 37 శాతం మంది ప్రస్తుత అధ్యక్షుడికి అనుకూలంగా ఉన్నారు. డిగ్రీ పట్టా ఉన్న శ్వేతజాతీయుల్లో 56 శాతం జో బైడెన్​కు మొగ్గుచూపుతుండగా..41 శాతం మంది ట్రంప్ వైపు ఉన్నారు.

డిగ్రీ లేనివారు ట్రంప్​వైపే...

అయితే శ్వేతజాతీయ ఓటర్లలో ట్రంప్ తన హవా కొనసాగిస్తున్నారు. వీరిలో 51 శాతం మంది ఆయనకు మద్దతుగా ఉన్నారు. 45 శాతం మంది మాత్రం బైడెన్​కు మొగ్గుచూపుతున్నారు. కళాశాల డిగ్రీ లేని శ్వేతజాతీయుల్లో ట్రంప్ పట్టు ఏమాత్రం తగ్గలేదు. 58 శాతం మంది ట్రంప్ వెంటే ఉన్నారు. 37 శాతం మంది బైడెన్​కు బాసటగా నిలిచారు.

కరోనాపై గరం!

సర్వేలో పాల్గొన్న 57 శాతం మంది ఓటర్లు కరోనా కట్టడిలో ట్రంప్ పనితీరును తప్పుబట్టారు. అయితే ఆర్థిక వ్యవస్థ విషయంలో 55 శాతం మంది ట్రంప్​ యంత్రాంగానికి మంచి మార్కులే వేశారు.

అక్టోబర్​ 29-31 మధ్య ఈ పోల్ నిర్వహించారు. ఎన్నికలకు ముందు విడుదలైన చివరి సర్వే ఇదే కావడం విశేషం.

Last Updated : Nov 2, 2020, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.