ETV Bharat / international

6 అడుగుల దూరంలో బైడెన్​- న్యాయపోరాటానికి ట్రంప్

author img

By

Published : Nov 5, 2020, 4:58 AM IST

హోరాహోరీగా సాగుతోన్న అధ్యక్ష ఎన్నికల్లో శ్వేతసౌధానికి ఆరు ఎలక్టోరల్​ ఓట్ల దూరంలో బైడెన్​ ఉన్నారు. అధ్యక్ష పీఠం సాధించేందుకు అవసరమైన 270 ఎలక్టోరల్​ ఓట్లకు గాను బైడెన్​ 264 ఓట్లు సాధించారు. మరోవైపు ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్​ న్యాయపోరాటానికి దిగారు.

Joe Biden
ఆరు అడుగుల దూరంలో బైడెన్​- న్యాయపోరాటానికి ట్రంప్

అగ్రరాజ్య తదుపరి అధినేత అయ్యేందుకు జో బైడెన్​ కేవలం 6 ఎలక్టోరల్​ ఓట్ల దూరంలో ఉన్నారు. కీలక రాష్ట్రాలైన మిషిగన్, విస్కాన్సిన్​లో గెలుపుతో ఆయన ఆధిక్యం అమాంతం పెరిగింది. ఇప్పటివరకు బైడెన్‌కు 264, ట్రంప్‌నకు 214 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. శ్వేతసౌధం దక్కించుకునేందుకు 270 ఓట్లు కావాలి.

ఆ రాష్ట్రాల్లో గెలుపుతో...

నిన్న సాయంత్రం వరకు ట్రంప్​, బైడెన్​ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అయితే బైడెన్‌ కీలక రాష్ట్రాలైన మిషిగన్, విస్కాన్సిన్‌లో గెలుపొందడం వల్ల ట్రంప్​ వెనుకబడ్డారు. ఇక్కడ వరుసగా 16, 10 ఎలక్టోరల్​ ఓట్లు ఉన్నాయి. అంతకుముందు బైడెన్​ మరో కీలక రాష్ట్రం అరిజోనాలోనూ విజయం సాధించారు.

బైడెన్​ ప్రకటన...

విజయం దాదాపు ఖరారైన తరుణంలో ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​తో కలిసి బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు.

"సుదీర్ఘ కౌంటింగ్​ అనంతరం, 270 ఎలక్టోరల్​ ఓట్లు సాధించడానికి కావాల్సిన రాష్ట్రాల్లో మేం గెలుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా మేం గెలిచాం అని చెప్పడానికి ఇక్కడికి రాలేదు. కౌంటింగ్​ పూర్తయ్యేసరికి మేం గెలుస్తాం అంటున్నా.

నేను, మేము డెమొక్రాట్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాం. కానీ గెలిచాక అమెరికా అధ్యక్షుడిగానే పాలిస్తాను. మేం గెలిచన అనంతరం రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్​ అంటూ ఉండవు. ఉండేది ఒకటే యూనైటెడ్​ స్టేట్స్​ ఆఫ్​ అమెరికా."

- జో బైడెన్​, డెమొక్రాటిక్​ అధ్యక్ష అభ్యర్థి

ట్రంప్ న్యాయపోరాటం...

కీలక రాష్ట్రాల్లో వెనుకబడ్డ డొనాల్డ్ ట్రంప్​ న్యాయపోరాటానికి దిగారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు ట్రంప్. మిషిగన్‌ ఓటింగ్‌ సరైన విధంగా జరగలేదని ట్రంప్‌ దావా వేశారు. ఓట్ల లెక్కింపు చేసే చోట నిపుణులైన పరిశీలకులను నియమించాలని అందులో కోరారు. అప్పటివరకు ఆ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు నిలిపివేయాలన్నారు.

బైడెన్ గెలుపొందిన విస్కాన్సిన్‌ రాష్ట్రంలో ఓట్లను పునర్​లెక్కించాలని ట్రంప్​ బృందం కోరింది. ఇక్కడ ఇరువురి మధ్య పోరు నువ్వానేనా రీతిలో సాగింది. 2016లో కూడా ఈ రాష్ట్రంలో ట్రంప్​ ఒక పాయింట్​ కన్నా తక్కువ మార్జిన్​లో ఓడిపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.