ETV Bharat / international

అమెరికా-చైనా మధ్య 'పీపుల్స్​'వార్​..!

author img

By

Published : Oct 18, 2020, 12:46 PM IST

america vs china
అమెరికా-చైనా మధ్య 'పీపుల్స్​'వార్​

అమెరికా-చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. అయితే ఇరుదేశాలు ఒకరి ప్రజలపై మరొకరు అభియోగాలు వేస్తూ.. అరెస్టులకు పాల్పడుతున్నారు. అగ్రరాజ్యం తమ ప్రజలను అరెస్టు చేస్తే సహించబోమని చైనా తాజాగా హెచ్చరించింది. అయితే బందీలుగా ఉన్న ప్రజలను అడ్డంపెట్టుకొని.. దౌత్యపరమైన ప్రతీకారం కోసం చైనా ప్రయత్నిస్తోందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది.

అమెరికాలో చైనా స్కాలర్లపై న్యాయశాఖ జరుపుతున్న విచారణను డ్రాగన్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అందుకు ప్రతీకారంగా చైనాలో ఉన్న అమెరికా పౌరులను బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలుసార్లు అమెరికా ప్రభుత్వానికి చైనా హెచ్చరికలు జారీ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ఈ మేరకు ప్రముఖ పత్రిక 'వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌' ఓ కథనాన్ని ప్రచురించింది.

"అమెరికా కోర్టుల్లో చైనా స్కాలర్లపై జరుగుతున్న విచారణను వెంటనే ఆపేయాలి. లేదంటే అమెరికా పౌరులు కూడా మా నిబంధనల్ని ఉల్లంఘించినవారవుతారు" అని హెచ్చరిక సందేశంలో చైనా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అమెరికా అరెస్టులు..

అమెరికాలో గత కొన్ని నెలల్లో చైనా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులను అరెస్టు చేశారు. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)తో వారికి సంబంధాలున్నట్లు.. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయానికి సమాచారం అందించలేదన్న ఆరోపణల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అమెరికా పరిశోధన, సైనిక సంస్థల నుంచి కీలక సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నట్లు అభియోగాలు మోపారు.

చైనా అదే పంథా..

చైనా గతంలో ఇదే తరహాలో ప్రవర్తించింది. ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్‌కు చెందిన పౌరుల్ని బందీలుగా చేసుకుంది. ఆయా దేశాలపై దౌత్యపరమైన ప్రతీకారం తీర్చుకోవడం కోసమే డ్రాగన్‌ మళ్లీ ఈ విధానాన్ని అనుసరిస్తోందని.. వాషింగ్టన్‌లోని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీన్ని వారు 'తాకట్టు దౌత్యం'గా అభివర్ణించారు. వివిధ దేశాల్లో న్యాయపరమైన విచారణ ఎదుర్కొంటున్న తమ పౌరుల్ని విడిపించుకునేందుకు చైనా ఇలాంటి బెదిరింపు చర్యలకు దిగుతోందని తెలిపారు. దీనిపై అమెరికా విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి నేరుగా స్పందించడానికి నిరాకరించారు.

ముందస్తు సూచనలు..

చైనాకు వెళ్లాలనుకునే వారికి సెప్టెంబరులో వివిధ కారణాలు చెబుతూ అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది. వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ఆయా దేశాలతో దౌత్యపరమైన బేరసారాల్లో పైచేయి సాధించడం కోసం.. చైనా విదేశీయులను బందీలుగా చేసుకునే ప్రమాదం ఉందని అందులో హెచ్చరించడం గమనార్హం.

తాజా అంశంపై వాషింగ్టన్‌లోని చైనా దౌత్యాధికారులుగానీ, విదేశాంగ శాఖగానీ స్పందించడానికి నిరాకరించాయి. అయితే చైనా సమగ్రతను, జాతీయ భద్రతను కాపాడడంలో భాగంగా వివిధ చట్టాల్ని అమలు చేయాల్సి ఉంటుందని అధికారులు వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.