ETV Bharat / international

మాస్కు ధరించలేదని మహిళపై అరెస్టు వారెంట్

author img

By

Published : Mar 15, 2021, 1:39 PM IST

మాస్కు ధరించనందుకు ఓ మహిళపై అమెరికా పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళ... "ఏం చేస్తావ్? అరెస్ట్ చేస్కో" అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిందని అధికారులు తెలిపారు.

Arrest warrant issued after woman rejects mask at Texas bank
మాస్కు ధరించలేదని మహిళపై అరెస్టు వారెంట్

మాస్కు ధరించేందుకు నిరాకరించిన ఓ మహిళపై అరెస్టు వారెంట్ జారీ అయింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా వద్ద ఈ ఘటన జరిగింది.

ఓరెగాన్​లోని గ్రాంట్స్ పాస్​కు చెందిన టెర్రీ రైట్ అనే 65 ఏళ్ల మహిళ నగదు ఉపసంహరించుకునేందుకు బ్యాంకుకు వెళ్లింది. మాస్కు ధరించాలని ఆమెను బ్యాంకు సిబ్బంది కోరారు. ఇందుకు టెర్రీ నిరాకరించింది. బయటకు వెళ్లేందుకూ మొండికేసింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు బ్యాంక్ మేనేజర్.

పోలీసులు వచ్చి మాస్కు ధరించాలని కోరగా.. అందుకు ససేమిరా అంది ఆ మహిళ. అంతేగాక.. 'నువ్వేం చేస్తావ్? అరెస్టు చేస్కో' అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది.

నిబంధనల అతిక్రమణ ఆరోపణలపై అరెస్టు చేస్తున్నట్లు మహిళకు చెప్పారు పోలీసులు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది టెర్రీ. పోలీసులు ఆమెను అడ్డగించి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తన కాలికి గాయమైందని చెప్పింది మహిళ. స్థానిక నిబంధనల ప్రకారం తాను మాస్కు ధరించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.

తప్పనిసరి కాదా?

రాష్ట్ర వ్యాప్తంగా మాస్కు ధరించడం తప్పనిసరి కాదని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఇటీవలే ప్రకటన విడుదల చేశారు. కొవిడ్ జాగ్రత్తలకు సంబంధించి స్థానిక వ్యాపారులే సొంతంగా నిబంధనలు పాటించాలని సూచించారు. అయితే చాలా ప్రాంతాల్లో మాస్కు తప్పనిసరి నిబంధన కొనసాగుతోంది.

ఇదీ చదవండి: మాస్క్​ ధరించమన్నందుకు డ్రైవర్​తో గొడవ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.