ETV Bharat / international

మంచు తుపానుకు అమెరికా గజగజ

author img

By

Published : Feb 18, 2021, 5:01 PM IST

అమెరికా మంచు తుపానుకు గజగజ వణుకుతోంది. పలు రాష్ట్రాలు అంధకారంలో గడుపుతున్నాయి. విద్యుత్​ పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెరుగుతున్న తుపాను తీవ్రత స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.

US-STORM
అమెరికాను వీడని మంచు తుపాను

అమెరికాలో మంచు తుపాను తగ్గుముఖం పట్టట్లేదు. పలు రాష్ట్రాల్లో తుపాను కారణంగా నిలిచిపోయిన విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించేందుకు గురువారం నుంచి అధికారులు ప్రయత్నాలను వేగవంతం చేశారు. కానీ పెరుగుతున్న తుపాను తీవ్రత పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 34 లక్షల మంది ప్రజలు అంధకారంలో గడుపుతున్నారు. మంచు తీవ్రత అత్యధికంగా ఉన్న టెక్సాస్​, అర్కంసాస్​ రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్​ ప్రభావం నీటి సరఫరా పైన కూడా పడింది. దక్షిణ రాష్ట్రాల్లో హిమపాతం కారణంగా నీటి సమస్య తలెత్తింది. ఒక్లాహోమా, నెబ్రాస్కా రాష్ట్రాల్లో పరిస్థితి కుదుటపడుతోంది. అయితే ఈ ప్రాంతాల్లో గ్యాస్​కు డిమాండ్​ పెరిగింది.

US-STORM
గ్యాస్​ కోసం పాట్లు

ఈ వారంలో తుపాను కారణంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్​లో ఇప్పటివరకు 6 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్​ సరఫరా పునరుద్ధరించామని విద్యుత్​ శాఖ వెల్లడించింది. ప్రజల సమస్యలపై స్పందించిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. సహాయక చర్యలు ముమ్మరం చేశామని అన్నారు.

"విద్యుత్​ లేని కారణంగా వారు మనల్ని చూడలేరని నాకు తెలుసు. వారి పరిస్థితిని మేము అర్థం చేసుకోగలము. అధ్యక్షుడు జో బైడెన్, నేను యుద్ధప్రాతిపదికన వారికి వీలైనంత వరకు సహాయం కృషి చేస్తున్నాము."

-కమలా హారిస్, ఉపాధ్యక్షురాలు

మిడిల్​ ఈస్ట్​

మిడిల్ ఈస్ట్​ దేశాల్లో కూడా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. సిరియా, లెబనాన్, జోర్డన్​, ఇజ్రాయెల్ దేశాల్లో బుధవారం మంచు కురిసింది. హిమపాతం కారణంగా రోజువారీ కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురయ్యాయి.

వాయవ్య సిరియాలోని నిరాశ్రయుల శిబిరాలు ఉండే ప్రాంతం చుట్టూ సహాయక బృందాలు మట్టితో అడ్డుకట్ట నిర్మిస్తున్నారు. వరదలు ఈ ప్రాంతాన్ని ముంచెత్తకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇజ్రాయెల్​లో కూడా హిమపాతం దృష్ట్యా పలు ఆంక్షలు విధించారు. టీకా పంపిణీను తాత్కాలికంగా నిలిపివేశారు. లిబియాలో మంచుకి ఏర్పడిన ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఈజిప్టులో తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి : బైడెన్‌ 'తాత'కు భలే బహుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.