ETV Bharat / international

మూడు దశాబ్దాలుగా ఒకే నెంబర్ లాటరీ కొనుగోలు.. చివరికి!

author img

By

Published : Aug 28, 2021, 10:06 PM IST

Lottery news
Lottery news

ముప్పై ఏళ్లుగా ఒకే నెంబర్​తో లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నాడు ఓ వ్యక్తి. కానీ ఎప్పుడూ నిరాశే. అయితే ఈసారి అతడి నిరీక్షణ ఫలించింది. కానీ అసలింతకీ ముప్పై ఏళ్లుగా ఒకే నెంబర్​పై ఎందుకు కొనాల్సి వచ్చింది? అది లక్కీ నెంబరే అయితే ఇన్నేళ్లు అతనికెందుకు కలసిరాలేదు? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదివేయండి..

అమెరికాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో లాటరీ టిక్కెట్లు అమ్ముడవుతుంటాయి. అయితే లాటరీ తగలడం అనేది అదృష్టంపై అధారపడి ఉంటుంది. ఈ క్రమంలో కేవలం తన అదృష్టాన్నే నమ్ముకున్నాడో వ్యక్తి. ఒకే సంఖ్య తనకు సిరులు తెచ్చిపెడుతుందని బలంగా విశ్వసించాడు. దాదాపు ముప్పై ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఒకే నెంబర్​పై లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. అన్నేళ్లు వరించని అదృష్టం ఇటీవలే అతన్ని పలకరించింది. దీనికి సంబంధించిన ఆసక్తికర కథనం నెట్టింట్లో వైరల్​గా మారింది.

అమెరికాకు చెందిన ఓ లాటరీ సంస్థ ఈ వారం విజేతలను ప్రకటించింది. అదే సమయంలో ఓ ఆసక్తికర అంశాన్నీ వెల్లడించింది. ఈసారి లాటరీలో జాక్​పాట్ కొట్టిన మిచిగాన్​కు చెందిన ఓ వ్యక్తి గత 30 ఏళ్లుగా అదే నెంబర్​పై లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడని తెలిపింది. మొండితనం, ఆశ కారణంగానే ఆ 61 ఏళ్ల వ్యక్తి ఇలా చేశాడని పేర్కొంది.

"నేను 1991 నుంచి ఒకే సెట్ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేస్తున్నా. కానీ.. ఇప్పటివరకు నేను నగదు గెలచుకోలేదు. చాలాసార్లు వేరే నెంబర్‌ కొనుగోలు గురించి ఆలోచించా. కానీ ప్రతిసారి మొండిగా ఈ సెట్‌నే కొంటూ ఉండిపోయా."

-లాటరీ గెలిచిన వ్యక్తి

తాజా లాటరీలో దాదాపు రూ.135 కోట్లు గెలుచుకున్న ఆ వ్యక్తి మీడియాతో మాట్లాడాడు. "మూడు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ఇంత భారీ మొత్తం గెలిచానంటే నమ్మలేకపోతున్నా" అని తెలిపాడు.

ఈ మొత్తం నుంచి దాదాపు రూ.86 కోట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అతను తెలిపాడు. ఇందులో నుంచి కొంతమొత్తాన్ని తన కుటుంబానికి వెచ్చిస్తానని.. మిగిలిన మొత్తం పొదుపు చేస్తానని తెలిపాడు. ఆపై కొంత నగదును స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.