ETV Bharat / international

'వర్క్‌ ఫ్రమ్‌ స్పేస్‌' కోసం బెజోస్‌ యత్నాలు!

author img

By

Published : Oct 30, 2021, 7:31 AM IST

అమెజాన్‌, బ్లూ ఆరిజిన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ వినూత్న ఆఫర్​తో ముందుకు రానున్నారు. రానున్న రోజుల్లో 'వర్క్​ ఫ్రమ్ స్పేస్'కి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇవేగాక.. స్పేస్‌ హోటల్‌, సినిమాలు తీయడానికి స్టూడియో, పరిశోధనల కోసం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

amazon jeff bezos
బెజోస్‌

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఎలాగూ ఆఫీస్‌ లేదు.. ఇంట్లో ఉండి ఏం పనిచేస్తాం.. సరదాగా విహారయాత్రకు వెళ్లి అక్కడి నుంచి పనిచేసుకుంటే బాగుండు అని చాలా మంది అనుకొనే ఉంటారు. అలాంటి వారి కోసం పలు పర్యటక ప్రాంతాలు, సంస్థలు ఆఫర్లు కూడా ప్రకటించాయి. అయితే, కొన్నేళ్లలో భూమి మీద కాదు.. అంతరిక్షం నుంచి పనిచేసే వెసులుబాటు రాబోతోంది. ఈ మేరకు అమెజాన్‌, బ్లూ ఆరిజిన్‌ సంస్థల అధినేత జెఫ్‌ బెజోస్‌ ప్రణాళికలు రచిస్తున్నారు.

బెజోస్‌ మానస పుత్రికైన బ్లూ ఆరిజిన్‌ సంస్థ.. సియారా స్పేస్‌, రెడ్‌వైర్‌ స్పేస్‌, జెనిసిస్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో 'ఆర్బిటాల్‌ రీఫ్‌' పేరుతో కమర్షియల్‌ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతుంది. 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ అంతరిక్ష కేంద్రాన్ని బిజినెస్‌ పార్క్‌గా తీర్చిదిద్దనున్నట్లు సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఈ బిజినెస్‌ పార్క్‌లో పది మందికి ఆతిథ్యం ఇచ్చేలా స్పేస్‌ హోటల్‌, సినిమాలు తీయడానికి స్టూడియో, పరిశోధనల కోసం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారట. 2025 తర్వాత ఆర్బిటాల్‌ రీఫ్‌కు తొలి అంతరిక్షయానం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో చెప్పడానికి ఆయా సంస్థల ప్రతినిధులు నిరాకరించారు. అయితే, ప్రైవేటు స్పేస్‌ ఏజెన్సీలు, హైటెక్‌ సంస్థలు, స్పేస్‌ ప్రాజెక్టులు లేని దేశాలు, మీడియా, ట్రావెల్‌ సంస్థలు ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టొచ్చని ఆహ్వానిస్తున్నారు. మరోవైపు బెజోస్‌.. బ్లూ ఆరిజిన్‌ ప్రయోగాల కోసం ఏటా 1 బిలియన్‌ డాలర్లు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ పత్రికల కథనాల ద్వారా తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.