ETV Bharat / entertainment

2023 సైమా వేడుకలు దుబాయ్​లో.. మృణాల్ ఠాకూర్ ప్రదర్శన

author img

By

Published : Jul 8, 2023, 7:27 AM IST

Updated : Jul 8, 2023, 9:16 AM IST

SIIMA awards 2023 : 2023 సైమా వేడుకలు దుబాయ్​లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన సైమాలో భాగం కావడం ఆనందంగా ఉందంటూ ఈ సందర్భంగా రానా పేర్కొన్నారు.

siima 2023
siima 2023

SIIMA awards 2023 : సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2023 ఏడాది ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు సైమా ఛైర్‌పర్సన్‌ బృందాప్రసాద్‌ వెల్లడించారు. 11 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు ప్రతిష్ఠాత్మక దుబాయ్‌ నగరం వేదిక కానుందని బృందాప్రసాద్ తెలిపారు. ఈ సారి జరిగే వేడుకలకు స్పాన్సర్​గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుందని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు వేడుకల గురించి అధికారిక సమాచారం ఇచ్చేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బృందాప్రసాద్.. "సౌత్ ఇండియాలో అనేక సినీ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల్లోని సృజనాత్మకతను గుర్తించేందుకు, ప్రతిభని ప్రోత్సహించేందుకు సైమా, నెక్సా కలిశాయి. ఇది చాలా ఆనందం కలిగించే విషయం. ఇకపైనా ఈ బంధం బలంగా ప్రభావం చూపించాలని ఆశిస్తున్నా" అని అన్నారు.

SIIMA awards 2023
.

టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సైమా సంస్థ.. దక్షిణాది సినీ పరిశ్రమను ఒకే తాటిపైకి తెచ్చిందని కొనియాడారు. ఈ వేడుకల్లో తాను భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. దక్షిణాది నుంచి అభిమానుల ప్రేమను స్వీకరించానని చెప్పుకొచ్చారు. తన తొలి చిత్రమైన సీతారామం గురించి ప్రస్తావించారు. ఈ సినిమా విడుదలైన వెంటనే సైమాలో భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయి కథలు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో భారతీయ చిత్ర పరిశ్రమలో భాగం కావడం చాలా గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు. దుబాయ్​లోని D.W.T.Cలో జరిగే ఈ వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ సహా పలువురు పాల్గొన్నారు.

గతేడాది 'పుష్ప' జోరు
దక్షిణాదిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో సైమా అగ్రస్థానంలో ఉంటుంది. గతేడాది సైమా ఉత్సవాలు అక్టోబర్ నెలలో నిర్వహించారు. దక్షిణాదికి చెందిన పలువురు స్టార్ నటీనటులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో టాలీవుడ్​ సినిమా 'పుష్ప: ది రైజ్' జోరు కనబర్చింది. ఆరు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు కేటగిరీల్లో అవార్డులు కైవసం చేసుకుంది. అవార్డ్స్ పూర్తి లిస్ట్ కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated :Jul 8, 2023, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.