ETV Bharat / entertainment

'ఆ స్టూడియోలో రికార్డ్‌ చేసిన తొలి ఇండియన్​ మూవీ 'గాడ్​ఫాదర్'​.. ఛాన్స్​ అందరికీ ఇవ్వరు!'

author img

By

Published : Oct 7, 2022, 6:42 AM IST

ఇటీవలే జాతీయ పురస్కారాన్ని అందుకున్న సంగీత దర్శకుడు తమన్​.. వరుసగా అగ్ర తారల సినిమాలకు స్వరాలు సమకూరుస్తూ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి గాడ్​ఫాదర్​కు ఆయనే బాణీలు అందించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

taman
taman

Godfather Taman: ''నేను తొలిసారి కలిసి పనిచేసిన హీరోలందరి సినిమాలు ఘన విజయం అందుకున్నాయి. ఆ ఆనవాయితీని 'గాడ్‌ఫాదర్‌' కొనసాగించింద''న్నారు సంగీత దర్శకుడు తమన్‌. ఇటీవలే జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆయన, వరుసగా అగ్ర తారల సినిమాలకి స్వరాలు సమకూరుస్తూ విజయ పరంపరని కొనసాగిస్తున్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి 'గాడ్‌ఫాదర్‌'కి ఆయనే సంగీతం అందించారు. ఈ సందర్భంగా తమన్‌ గురువారం ముచ్చటించారు. ఆ విషయాలివీ.

''చిరంజీవితో నేను చేసిన తొలి సినిమా ఇదే. ఆయన సినిమాలకి సంగీతం ఇవ్వడం అంత సులభం కాదు. పైగా 'గాడ్‌ఫాదర్‌'లో పాటలకి, సంగీతానికి పెద్దగా అవకాశం లేదు. కథని నడిపే పాటలే ఉంటాయి. ఇలాంటి కథకి సంగీతం పరంగా ప్రభావం చూపించేలా పనిచేయడం ఎలా అని చాలా ఆలోచించి ఏడాదిపాటు నేనూ, మోహన్‌రాజా కష్టపడి పనిచేశాం. లండన్‌లో ప్రతిష్టాత్మక అబేయ్‌ రోడ్‌ స్టూడియోస్‌లో ఈ సినిమాకి నేపథ్య సంగీతం చేశాం. అక్కడ రికార్డ్‌ చేసిన తొలి భారతీయ సినిమా ఇదే. ఆ స్టూడియోని అందరికీ ఇవ్వరు''.

''మణిశర్మ, కోటి, కీరవాణి.. వీళ్లంతా చిరంజీవి సినిమాల్లో అద్భుతమైన సంగీతం వినిపించారు. చిరు సినిమా అంటే గత సినిమాలతో కూడా పోలిక వస్తుంది. అలాంటప్పుడు నా పనితీరు మరో స్థాయిలో ఉండాల్సిందే అనుకుని, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేశా. ఈ సినిమాకి ఓ అభిమానిగానే పనిచేశా. 'లూసిఫర్‌'లో సంగీతం ప్రత్యేకంగా గుర్తుండదు. కానీ 'గాడ్‌ఫాదర్‌' కోసం గుర్తుపెట్టుకునేలా సంగీతం చేయడం గొప్ప తృప్తినిచ్చింది. చిన్నప్పుడు మా అమ్మతో కలిసి కోటి సర్‌ రికార్డింగ్‌కి వెళ్లా. అప్పుడు నాకు ఐదేళ్లు. అందం హిందోళం పాట చేస్తున్నారు. అప్పటి నుంచి చిరంజీవి సర్‌ సినిమా ఒక్కటి కూడా వదిలేవాణ్ని కాదు. ఇంట్లో కూడా చిరంజీవి పాటలే వాయిస్తూ ఉండేవాణ్ని'

ఇవీ చదవండి: 60 థియేటర్లలో 'ఆదిపురుష్​' త్రీడీ టీజర్.. ట్రోల్స్​కు దిల్​రాజు స్ట్రాంగ్ కౌంటర్

'ఆదిపురుష్'​కు కాపీ సెగ.. ఘాటు వ్యాఖ్యలు చేసిన యానిమేషన్​ సంస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.