ETV Bharat / entertainment

'వాల్తేరు వీరయ్య' టైటిల్​ సాంగ్​పై రగడ.. క్లారిటీ ఇచ్చిన చంద్రబోస్.. ఏమన్నారంటే?

author img

By

Published : Jan 6, 2023, 6:33 AM IST

సంక్రాంతికి బరిలోకి దిగనున్న 'వాల్తేరు వీరయ్' నుంచి ఇప్పటికే కొన్ని పాటలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో లేటెస్ట్​గా రిలీజైన 'భగ భగ..' పై సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. దీంతో ఆ పాట రచయిత చంద్రబోస్​ క్లారిటీ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే?

waltair veerayya title song
lyricist chandrabose

సంక్రాంతి సినిమాల పాటలు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఏ పాటకి ఆ పాట సామాజిక మాధ్యమాల్ని ఊపేస్తూ... శ్రోతల చెవులకి చేరుతూ ఆయా సినిమాలపై అంచనాల్ని, ఆకర్షణని పెంచుతున్నాయి. అందులో 'వాల్తేరు వీరయ్య' చిత్రంలోని 'భగ భగ... 'పాట ఒకటి. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ రాసిన ఈ శీర్షిక గీతంపై చర్చ కూడా సాగింది. సాహిత్య ప్రక్రియలు, పురాణాలు ప్రస్తావనకొచ్చాయి. కొన్ని ఆక్షేపణలపై చంద్రబోస్‌ వివరణ ఇచ్చారు.

"ఈమధ్య కాలంలో శాస్త్రపరమైన చర్చని లేవనెత్తిన గీతం ఇది. ఎంత కష్టపడి రాశానో అంతకంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. ఇన్ని పాటలు రాశాక కూడా, కొత్తగా మరో పాట మొదలు పెట్టేటప్పుడు ఓ చిన్న భయం ఉంటుంది. ఏ పాటనీ తేలికగా తీసుకోకూడదు. దీనికి ఇది రాస్తే సరిపోతుందిలే అని కాకుండా, ఇది కూడా రాయొచ్చు అన్నట్టుగా నా పనితీరు ఉండాలనుకుంటా. అర్థం, సౌందర్యం, సన్నివేశం పరంగా వచ్చే ఓ లోతు పాటలో కనిపించాలనుకుంటా. అలా చేసినప్పుడే నాదైన ప్రత్యేకత కనిపిస్తుంది. అర్థాలు తెలుసుకోవాలనే ఉత్సుకత రేకెత్తించేలా పాట రాయాలంటే శ్రమించాల్సిందే. ఎన్నో అకృత్యాలు, అరాచకాలు చేస్తూ అమాయకపు ప్రజల ప్రాణాల్ని తీసే రాక్షసుడిని సంహరించి శాంతి సంస్థాపన చేసే కథానాయకుడు అమాయక ప్రజల పాలిట మహర్షి అవుతాడు, దేవుడు అవుతాడు. అలా రాక్షస సంహారం చేసే సందర్భంలో వచ్చే పాటే ఇది. శబ్ద గాంభీర్యం అర్థ సౌందర్యం ఒకదానికొకటి పోటీ పడతాయి. మూడు రోజుల తపస్సులా కూర్చుని రాశా."

"ఈమధ్య కాలంలో విన్న ఓ మంచి శీర్షిక గీతం అని చాలామంది అభినందించారు. అధ్యయనం చేయదగిన సాహిత్య ప్రమాణాలున్న పాట అని సీనియర్‌ రచయిత సత్యానంద్‌ అభినందించారు. పాటలో నేను ఉపయోగించిన అర్థాలంకారాలు తెరపైకొచ్చాయి. అందరూ దీని గురించి మాట్లాడటం, చర్చించడంతో సినిమా పాట గౌరవం, సినిమా రచయిత విలువ మరింతగా పెరిగినట్టైంది. సాహిత్యంలో కవితా పంక్తులకి శోభని చేకూర్చేలా అలంకారాలు, అధివాస్తవికత, రెండు వ్యతిరేక భావాలతో కూడిన పదాల్ని ఒక దగ్గర చేర్చడం లాంటి ప్రయోగాల్ని ఈ పాటలో ఎక్కువగా చేశా. తనొంక తానే తలెత్తి చూడటం తరహా అభివ్యక్తీకరణలు ఇందులో ఉన్నాయి. దాంతో ఈ పాటకి మరింత శోభ వచ్చింది. చర్చ లేవనెత్తింది. కొన్ని ఆక్షేపణలొస్తే నేను వాటికి వివరణ కూడా ఇచ్చా. తెలుగు పాట పక్క రాష్ట్రంలో వినిపిస్తే చాలనుకునేవాళ్లం. ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగుతున్నాయి. నాటు నాటు పాట... ఆస్కార్‌కి, గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ పురస్కారాలకి నామినేట్‌ అయ్యింది. ఊ అంటావా... పాట యూ ట్యూబ్‌ గ్లోబల్‌ షాట్స్‌లో ఆరు నెలలపాటు నంబర్‌ వన్‌గా కొనసాగింది. ప్రపంచం మొత్తం తెలుగు పాటలు వింటోంది. రాసేటప్పుడు ఆ స్థాయిలోనే ఆలోచించాలి, అప్పుడే కొంతవరకైనా వెళ్లగలుగుతాం". అంటూ చంద్రబోస్​ చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.