ETV Bharat / entertainment

'అవతార్​-3' కథ చెప్పేసిన జేమ్స్​ కామెరూన్​​.. ఈ సారి ఎలా ఉండబోతుందంటే?

author img

By

Published : Jan 4, 2023, 7:01 PM IST

Updated : Jan 4, 2023, 7:19 PM IST

James Cameron Avataar 3
James Cameron On Avataar 3

ఇటీవలే విడుదలై సంచలనం సృష్టిస్తున్న సినిమా 'అవతార్​ 2'. అయితే తాజాగా.. రెండో భాగానికి కొనసాగింపుగా రాబోతున్న 'అవతార్​ 3' కథ గురించి వివరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్​. ఏం అన్నారంటే..

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి విజువల్‌ వండర్‌ 'అవతార్‌'. హైలెవెల్‌ గ్రాఫిక్‌ వర్క్‌తో ప్రేక్షకులను ఒక సరికొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళ్లిందీ సినిమా. పండోరా లోకం, అక్కడి మనుషులూ, ఆ వింత జీవులూ, వాటితో హీరో చేసే సాహసాలూ ప్రేక్షకలోకాన్ని ఆశ్చర్యపరిచాయి. అందుకే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవలే దానికి సీక్వెల్‌గా విడుదలైన 'అవతార్‌- ది వే ఆఫ్‌ వాటర్‌' కూడా ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన ప్రతిచోటా హౌస్‌ఫుల్‌తో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రం ఐదు భాగాలుగా రాబోతుందని జేమ్స్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మూడో భాగం కథ గురించి మాట్లాడారాయన. మొదటి రెండు భాగాల్లో నావీ అనే అటవి తెగను పాజిటివ్​గా చూపించిన ఆయన.. మూడో భాగంలో​ నావీలోని నెగటివ్​ షేడ్స్​ను చూపించబోతున్నట్లు తెలిపారు. మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్లు పేర్కొన్నారు.

" అవతార్​ 3కి ఇంకా పేరు పెట్టలేదు. మూడో భాగంలోనూ ఇప్పటికే నేను చూపించిన విభిన్న సంస్కృతులు కనిపిస్తాయి. మొదటి రెండు భాగాల్లో మానవులను నెగటివ్​గా, నావి తెగను పాజిటివ్​గా చూపించాను. అయితే ఈ సారి నావి తెగలోని మరో కోణాన్ని చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు వారిలోని పాజిటివ్​ షేడ్స్​ను మాత్రమే చూపించాను. కథలోని ప్రధాన పాత్రలను కొనసాగిస్తూ కొత్త ప్రపంచాలను సృష్టిస్తాం. చివరి మూడు భాగాలు ఉత్తమంగా ఉంటాయని నేను చెప్పగలను." అని జేమ్స్​ వెల్లడించారు.

'అవతార్​' కథ ఇది.. అవతార్‌ కోసం జేమ్స్‌ కామెరూన్‌ సాంకేతికత సాయంతో 'పండోరా' అనే ప్రపంచాన్ని సృష్టించారు. అక్కడ 'నావీ' అనే అటవీ తెగ జీవిస్తుంటుంది. ప్రకృతే ప్రాణంగా జీవించే ఆ వింత ప్రాణులకు, అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్లే మానవులకు మధ్య జరిగే పోరాటమే 'అవతార్' థీమ్‌. అయితే, ఇందులో యాక్షన్‌కు మించిన లవ్‌స్టోరి దాగుంది. ఆ ప్రేమకథ ఎన్నో హృదయాలను హత్తుకుంది. జేక్‌ సల్లీ (సామ్‌ వర్తింగ్‌టన్‌) నావికాదళంలో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రమాదానికి గురై, కాళ్లు పోగొట్టుకుంటాడు. పండోరాలోని విలువైన సంపదను తీసుకొచ్చేందుకు రిసోర్సెస్‌ డెవలెప్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఆర్‌.డి.ఎ) అధికారులు చేపట్టిన అవతార్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొంటే నడవగలిగే స్థితికి వస్తానని తెలుసుకున్న జేక్‌ అందుకు సిద్ధపడతాడు. ప్రోగ్రామ్‌ హెడ్‌ డాక్టర్‌ గ్రేస్‌ అగస్టిన్‌ (సిగర్నీ వీవర్‌) ముందుగా జేక్‌ను వద్దన్నా మరోదారి లేక ఓకే అంటుంది. పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న జేక్‌.. అవతార్‌ శరీరంలోకి ప్రవేశిస్తాడు. పండోరాలోని విలువైన ఓ చెట్టు రహస్యాన్ని చెబితే భూమ్మీదకు పంపించి, కాళ్లు వచ్చే ఏర్పాట్లు చేయిస్తానని జేక్‌కు ఓ అధికారి ఆఫర్ ఇస్తాడు. గ్రేస్‌ బృందంతో కలిసి జేక్‌ పండోరా ప్రపంచంలో అడుగుపెడతాడు. ఓ క్రూర జంతువు దాడి చేసే క్రమంలో మిగిలిన వారంతా తిరిగి వెళ్లపోగా జేక్‌ అక్కడే ఉండిపోతాడు. ఇక అతను బతికుండడం కష్టమే అని అంతా అనుకుంటారు.

కట్‌ చేస్తే, నైత్రి అనే నావీ తెగ అమ్మాయి జేక్‌ను రక్షిస్తుంది. కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తుంది. నావీ వారు అంత సులభంగా ఇతరులను నమ్మరు కాబట్టి ఓ పరీక్ష పెడతారు. అందులో విజయం అందుకున్న జేక్‌కు తమలో ఒకడిగా ఉండేందుకు తగిన శిక్షణ ఇవ్వమని నేత్రి తల్లి ఆమెను ఆదేశిస్తుంది. ఆ ప్రయాణంలో నేత్రి.. జేక్‌ ప్రేమలో పడుతుంది. ఓ రోజు ఆర్‌.డి.ఎ. ఆఫీసర్లు పండోరాలోని చెట్టును తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా జేక్‌ అడ్డుపడతాడు. ఇంతకాలం తమకు సపోర్ట్‌గా ఉన్న జేక్‌ అలా చేయడంతో ఆర్‌.డి.ఎ బృందం షాక్‌ అవుతుంది. దాంతో, ఓ అధికారి జేక్‌ అవతార్‌ని తొలగిస్తాడు. ఆ తర్వాత జేక్‌, గ్రేస్‌ వెళ్లి నావీ వారికి జరిగినదాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. కానీ, వారు వినిపించుకోరు పైగా జేక్‌ తనను మోసం చేశాడని నేత్రి భావిస్తుంది. మరోవైపు, ఆర్‌.డి.ఎ. పండోరాని నాశనం చేస్తుంది. మళ్లీ అవతార్‌గా మారిన జేక్‌ పండోరా వెళ్లి నావీ వారికి స్ఫూర్తిగా నిలుస్తాడు. మానవులు, నావీ వారి మధ్య యుద్ధం మొదలవుతుంది. నావీ టీమ్‌కు కెప్టెగా మారిన జేక్‌ పండోరాను ధ్వంసం చేయాలనుకున్న మానవులను భూమ్మీదకు పంపిస్తాడు. అవతార్‌ రూపంలోనే శాశ్వతంగా ఉండాలని నిర్ణయించుకున్న హీరో 'నేను మళ్లీ ఈ ల్యాబ్‌కు రాను. నా పేరు జేక్‌ మళ్లీ కలుద్దాం' అని చెప్పే సంభాషణతో సినిమా ముగుస్తుంది.

'అవతార్​ 2' కథ ఇది.. తొలి చిత్రంలో భూమి నుంచి పండోరా గ్ర‌హానికి వెళ్లిన జేక్ (సామ్ వ‌ర్తింగ్టన్‌) అక్క‌డే ఓ తెగ‌కి చెందిన నేతిరి (జో స‌ల్దానా)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నేతిరి తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న జేక్ ఆ తెగ‌కి నాయ‌కుడ‌వుతాడు. ప‌దేళ్ల కాలంలో లోక్, నేటియం, టూక్ అనే ముగ్గురు పిల్ల‌ల్ని క‌న్న జేక్‌, నేతిరి దంపతులు... ద‌త్త పుత్రిక కిరీ, స్పైడ‌ర్ అనే మ‌రో బాలుడితో క‌లిసి హాయిగా జీవిస్తుంటారు. ఇంత‌లో భూ ప్ర‌పంచం అంత‌రించిపోతుంద‌ని, ఎలాగైనా పండోరాని ఆక్ర‌మించి అక్క‌డున్న నావీ తెగ‌ని అంతం చేయాల‌ని మ‌నుషులు మ‌రోసారి సాయుధ‌బ‌ల‌గాల‌తో దండెత్తుతారు. జేక్ త‌న కుటుంబాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం ఈసారి మెట్క‌యినా ప్రాంతానికి వెళ‌తాడు.

అక్క‌డి ప్ర‌జ‌ల‌కి స‌ముద్ర‌మే ప్ర‌పంచం. మ‌న‌లో స‌ముద్రం, మ‌న చుట్టూ స‌ముద్రం, ఇచ్చేది స‌ముద్ర‌మే.. తీసుకునేది స‌ముద్ర‌మే అని న‌మ్ముతూ నీటిలోనే బ‌తుకుతుంటారు. మెట్కయినా రాజు టోనోవ‌రి స‌హ‌కారంతో జేక్ కుటుంబం సైతం స‌ముద్రంతో అనుబంధం పెంచుకుంటుంది. కష్టమైనా అక్క‌డ జీవించ‌డం నేర్చుకుంటుంది. ఎలాగైనా జేక్‌ని అతడి కుటుంబాన్ని మ‌ట్టు బెట్టాల‌ని భూమి నుంచి వ‌చ్చిన ప్ర‌ధాన శ‌త్రువు మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్‌), అత‌డి బృందంతో పోరాటం ఎలా సాగించారనేది మిగ‌తా క‌థ‌.

మూడో భాగంలో జేక్​కు వ్యతిరేకంగా ఉండొచ్చు.. మొదటి రెండు అవతార్ సీక్వెల్స్ నావి తెగల వర్గం-మానవుల మధ్య యుద్ధం నేపథ్యంలో కథ నడిచింది. ఇప్పుడు కామెరూన్​ చెప్పిన మాటలను చూస్తే.. మూడో భాగంలో మొదటిసారిగా నావి వర్గంలో అంతర్గత పోరు ఉండబోతుందని అర్థమవుతోంది. నావి తెగ.. తమ నాయకుడిగా ఎదిగిన జేక్​ సల్లీకి వ్యతిరేకంగా మారవచ్చు. కాగా, ఇప్పటికే కామెరూన్‌ 'అవతార్ 3' షూటింగ్​ను పూర్తి చేసినట్లు గతంలోనే తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్​ పనులు జరుగుతున్నాయి. 2024 డిసెంబర్ 20న థియేటర్లలోకి విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Jan 4, 2023, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.