ETV Bharat / crime

Khammam Unemployed Suicide : 'ఇగ నోటిఫికేషన్లు రావు.. పిచ్చి లేస్తోంది'

author img

By

Published : Jan 25, 2022, 9:46 AM IST

Updated : Jan 26, 2022, 6:43 AM IST

Young man commits suicide, Khammam Suicide
ఉద్యోగ నోటిఫికేషన్ రావట్లేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

09:42 January 25

ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో యువకుడు ఆత్మహత్య

Khammam Unemployed Suicide : పేద కుటుంబమైనా ఆ యువకుడు గొప్ప కలలు కన్నాడు. ఎలాగైనా సర్కారీ కొలువు సాధించాలని గట్టిగా అనుకున్నాడు. ఎస్సై ఉద్యోగం సాధించి... దర్జాగా బతకాలనుకున్నాడు. తాను మంచి స్థాయిలో ఉండి... కుటుబసభ్యులను బాగా చూసుకోవాలని ఆశపడ్డాడు. కానీ అతడి ఆశలు అడియాసలయ్యాయి. చేసేది లేక చివరకు ఉసురు తీసుకున్నాడు.

ఏం జరిగింది?

ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడక ఎస్సై కావాలన్న తన కల సాకారం కాదేమోనని ఓ పేద కుటుంబంలోని నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసు ఉద్యోగం కోసం చిన్నప్పటి నుంచి పరితపించిన అతడు ఎన్‌సీసీలోనూ సీ సర్టిఫికెట్‌ సంపాదించాడు. రెండున్నరేళ్లుగా ఓ ప్రైవేటు సంస్థలో శిక్షణ తీసుకుంటున్న ముత్యాల సాగర్‌(24) మంగళవారం తెల్లవారుజామున ఖమ్మం మామిళ్లగూడెం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం. సోమవారం అర్ధరాత్రి 2.45 గంటలకు అతడి మొబైల్‌లోని వాట్సప్‌ స్టేటస్‌లో.. ‘నోటిఫికేషన్‌లు లేవు.. పిచ్చిలేస్తోంది. కేసీఆర్‌, కరోనా కారణం’ అని ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.

డబ్బు పంపే స్థోమత తల్లిదండ్రులకు లేదని..

సాగర్‌ తండ్రి భద్రయ్య హమాలీ. తల్లి కళమ్మ కూలీ. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. రెండేళ్ల కిందట కుమార్తె సౌజన్య వివాహం చేశారు. సాగర్‌ చదువులో చురుగ్గా ఉండేవాడు. ఐదేళ్లుగా ఖమ్మంలోనే ఉంటున్నాడు. ఓ ప్రైవేటు కళాశాలలో 2019లో డిగ్రీ పూర్తి చేశాడు. స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటూండగా 3 నెలల క్రితం వారు వెళ్లిపోవడంతో ఒక్కడే కాలం గడుపుతున్నాడు. జేబు ఖర్చులకు డబ్బు పంపే స్థోమత తల్లిదండ్రులకు లేదని.. వారికి భారం కాకూడదని ఖాళీ సమయంలో క్యాటరింగ్‌ పనులకు వెళ్లేవాడు. సంక్రాంతి పండుగకి ఇంటికి వెళ్లి తిరిగి ఖమ్మం వచ్చాడు. తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తేగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాతే చేసుకుంటానని చెప్పాడు. సోమవారంరాత్రి తల్లితో ఫోన్‌లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డాడు.

శవాగారం వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఉద్యోగ నోటిఫికేషన్లు లేకనే సాగర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని కాంగ్రెస్‌, భాజపా, న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ నాయకులతోపాటు పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఏఎస్‌ఎఫ్‌, బీజేవైఎం వారు ఆందోళన చేశారు. వారి ఆందోళనతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి శవాగారం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వామపక్ష విద్యార్థి నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేయగా.. భాజపా నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

స్వగ్రామంలో విపక్షాల ఆందోళన

బయ్యారం, న్యూస్‌టుడే: తెరాస ప్రభుత్వ వైఖరి కారణంగానే సాగర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని బయ్యారం మండలంలోని విపక్షపార్టీలన్నీ ఆందోళనకు దిగాయి. కులసంఘాల నాయకులు, నిరుద్యోగులు మృతదేహాన్ని తరలిస్తున్న వాహనం వెంట వచ్చి రామాలయం సెంటర్‌లో ఆందోళన చేపట్టారు. ఇల్లెందు, మహబూబాబాద్‌ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్‌ సూచనతో మహబూబాబాద్‌ డీఎస్పీ సదయ్య, తహసీల్దార్‌ రంజిత్‌ బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2లక్షలు ఇస్తామని, కుటుంబంలో ఒకరికిఉద్యోగంవచ్చేలా చూస్తామని హామీఇచ్చారు.

ఇదీ చదవండి: గంజాయి ముఠా బీభత్సం.. కారు వదిలేసి చెరువులో దూకిన స్మగ్లర్లు

Last Updated :Jan 26, 2022, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.