ETV Bharat / crime

హైదరాబాద్ టు దిల్లీ.. వయా కాజీపేట్.. తెలివిగా తప్పించుకున్న చైన్ స్నాచర్స్

author img

By

Published : Jan 11, 2023, 4:06 PM IST

Hyderabad Chain Snatching Case Update : ఇటీవల నగరంలో వరుస చోరీలతో హడలెత్తించిన చైన్ స్నాచర్స్ హైదరాబాద్​ను వీడి దిల్లీలో మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీ పోలీసుల సహాయంతో నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్న నగర పోలీసులు.. పాత నేరస్థుల సాయం కూడా తీసుకుంటున్నారు.

Chain snatchers
Chain snatchers

Hyderabad Chain Snatching Case Update : ఈ నెల 7న హైదరాబాద్​లో వరుసగా చైన్ స్నాచింగ్​కు పాల్పడిన దుండగులు నగరం వీడి దిల్లీలో మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. వరుస దొంగతనాల అనంతరం హైదరాబాద్ నుంచి కాజీపేట్ మీదుగా దిల్లీ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీలో నిఘా పెట్టిన నగర పోలీసులు.. అక్కడి పోలీసుల సహాయంతో వారి ఉనికి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి పాత నేరస్థుల సాయం కూడా తీసుకుంటున్నారు.

ఇదీ జరిగింది..: ఈ నెల 7న ఉదయం వరుస గొలుసు దొంగతనాలతో గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్‌ వాసులను ఉలిక్కిపడేలా చేశారు. దాదాపు రెండు గంటల వ్యవధిలో 6 చోట్ల మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఉదయం 6:20 గంటల నుంచి 8:10 గంటల వరకు వివిధ చోట్ల హడలెత్తించారు. ఉప్పల్‌ పరిధిలోని రాజధాని ప్రాంతంతో పాటు కల్యాణపురి, నాచారంలోని నాగేంద్రనగర్‌, హబ్సిగూడాలోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రాంగోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో ఆగంతకులు మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు.

బైక్​ను దొంగిలించి చైన్ స్నాచింగ్ అనంతరం వదిలిపెట్టి: ఉదయం ఉప్పల్‌లో మొదలుపెట్టి.. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ వరకు వరుసగా 6 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. చోరీ చేసిన ద్విచక్రవాహనంపై వచ్చి ఉప్పల్‌ చౌరాస్తాకు సమీపంలో తొలుత ఓ గొలుసు తెంచుకెళ్లిన ఇద్దరు దుండగులు.. కల్యాణిపురి కాలనీలో ఓ వృద్ధురాలి బంగారు నగలను అపహరించుకుపోయారు. హబ్సిగూడ రవీంద్రనగర్‌లో జానకమ్మ అనే వృద్ధురాలు ఇంటి ముందు పూలు తెంపుతుండగా.. పల్సర్‌ బైక్‌పై వచ్చి అడ్రస్‌ అడుగుతున్నట్లు నటిస్తూ అదును చూసి గొలుసు తెంచుకుని ఉడాయించారు.

నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగేంద్రనగర్‌లో ఇంటి ముందు విమల అనే వృద్ధురాలు ముగ్గు వేస్తుండగా.. పువ్వులు కావాలంటూ దగ్గరకు వచ్చి ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. చోరీలు చేసిన తర్వాత గొలుసు దొంగలు ద్విచక్ర వాహనాన్ని ప్యారడైజ్‌ వద్ద వదిలివెళ్లారు.

దొంగల స్వస్థలం శామ్లీ జిల్లా యూపీ: గొలుసు దొంగతనానికి తొలుత ఇద్దరే వచ్చినట్లు పోలీసులు అనుమానించినా.. ఆ తర్వాత నలుగురు వచ్చినట్లు నిర్ధరణకు వచ్చారు. నిందితుల కోసం ముమ్మర వేట సాగిస్తున్న హైదరాబాద్, రాచకొండ పోలీసులు దొంగల సొంతూరు శామ్లీ జిల్లాకు రెండుబృందాలను పంపగా వారు స్వస్ధలం యూపీలోని శామ్మీ జిల్లా చేరినట్లు ఆధారాలు లభించకపోవడం నగరంలో మకాం వేసినట్లు అంచనావేశారు. నిందితులను పట్టుకునేందుకు సోమవారం తెల్లవారుజామున నగర వ్యాప్తంగా నాకాబంధీ చేపట్టారు.

పలు ప్రాంతాలు, వాహనాలను తనిఖీ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా ఎక్కడా అంతరాష్ట్ర దొంగల ఆనవాళ్లు లభించలేదు. చైన్‌స్నాచర్ల సొత్తును విక్రయించే రిసీవర్లను అదుపులోకి తీసుకున్నా వారి వద్ద ఎలాంటి సమాచారం లభించలేదు. చోరీలు చేసిన తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ వద్ద వాహనం వదిలేసి ఆటోలో వివిధ ప్రాంతాలను చుట్టేశారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు ఏంజీబీఎస్​ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టినట్టు సీసీకెమెరాల ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు.

2011లో హైదరాబాద్‌కి పింకుతోపాటు వచ్చిన ముఠా మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 32 చోట్ల గొలుసు చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. గతంలో వివిధ రాష్ట్రాల్లోని పోలీసులు.. పింకును అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈసారి అతనిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులు యోచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.