కరణ్​సింగ్ నేరచరిత్ర చూసి పోలీసులే షాక్

author img

By

Published : Jan 7, 2023, 8:04 AM IST

Criminal history of Karan Singh

Criminal history of Karan Singh: దారిన వెళ్లే వారిని బెదిరించి డబ్బు కాజేయడం. ఆడపిల్లలు కనిపిస్తే చాలు ప్రేమించమంటూ వేధింపులకు గురి చేయటం. బైక్‌లు, కార్లు చోరీ చేసి విక్రయించడం. ఇది రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో పోలీసులపై దాడి చేసిన కరణ్‌సింగ్‌ నేర చరిత్ర. పోలీసులు దర్యాప్తు చేస్తుంటే.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

పోలీసులపై దాడి చేసిన కరణ్‌సింగ్‌ కేసులో విస్తుపోయే నిజాలు

Criminal history of Karan Singh: హైదరాబాద్‌ అత్తాపూర్ సమీపంలోని సిక్‌చావ్‌ని ప్రాంతానికి చెందిన కరణ్‌సింగ్‌.. పసితనంలోనే తండ్రి మరణించడంతో తల్లి సంరక్షణలోనే పెరిగాడు. పెద్దల భయం లేకపోవటంతో చిన్నప్పటి నుంచే ఆవారాగా మారాడు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచే చుట్టుపక్కల పిల్లలతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. వైట్నర్, గాంజా లాంటి దురాలవాట్లకు బానిసైన ఈ ముఠా రోజంతా అదే మైకంలో ఉంటుంది.

బైక్‌లు చోరీ చేయడం, తల్వార్‌లతో ప్రజలను బెదిరించి వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్‌ లాక్కోవటం వంటి అరాచకాలు చేసేవారు. అత్తాపూర్‌ ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో కరణ్‌ సింగ్‌పై 5 కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 కేసులు మైనర్‌గా ఉన్నపుడు నమోదైనవే. ఇంతకముందే కరణ్‌ సింగ్ ఒకరిపై కత్తితో దాడి చేశాడు. పలుచోట్ల గొలుసు దొంగతనాలు సైతం చేసినట్లు కాలనీవాసులు తెలిపారు.

కరీంనగర్‌లో ఓ ఖరీదైన కారు, హైదరాబాద్‌లో ఆటోను కరణ్‌సింగ్‌ దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది. తాజాగా అతను నివాసముండే సిక్‌చావ్‌ని ప్రాంతంలో ఉండే ఓ బాలికను ప్రేమించమంటూ వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేరాలను గమనించిన పోలీసులు 10 నెలల క్రితం కరణ్‌సింగ్‌ మేజర్ కావడంతో అతడిపై రౌడీషీట్ నమోదు చేశారు. తాజాగా కరణ్‌సింగ్‌ పోలీసులపై దాడి చేయటం తెలుసుకున్న కాలనీవాసులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు.

కరణ్‌సింగ్‌ రెంజు రోజుల క్రితం నార్సింగి సమీపంలోని మంచిరేవుల రింగ్‌రో‌డ్డు సమీపంలో కిషోర్‌ అనే వ్యక్తిపై తల్వార్‌తో దాడి చేసి చంపాడు. అనంతరం తనను పట్టుకోవడానికి వచ్చిన కానిస్టేబుళ్లు రాజునాయక్‌, విజయ్‌పై కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన రాజునాయక్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అయితే ఇద్దరు కానిస్టేబుల్స్‌ని హతమార్చి పారిపోదామని కరణ్ భావించినట్లు పోలిసులు తెలిపారు. మరోవైపు నిందితుడి అనుచరుడు చింటూను అదుపులోకి తీసుకున్నారని కొందరు వ్యక్తులు నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. కేసుతో సంబంధం లేని యువకుడిని తీసుకొచ్చారంటూ ఆరోపణలు చేశారు. అయితే ఈకేసులో తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని నార్సింగి పోలీసులు స్పష్టంచేశారు.

కానిస్టేబుళ్లపై తల్వార్​తో దాడి: బుధవారం రాత్రి నార్సింగి రక్తమైసమ్మ వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై దోపిడి దొంగ దాడి చేశాడు. కిశోర్‌ అనే వ్యక్తి.. మహిళపై తల్వార్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలతో కిశోర్‌ మృతి చెందాడు. గాయాలతో తప్పించుకుని పరిగెత్తిన మహిళను.. దుండగుడు వెంటపడి పట్టుకుని చేతివేళ్లు కోసేశాడు. ఆమె వద్ద నుంచి రూ.15 వేల రూపాయలు లాక్కుని పరారయ్యాడు. ఈ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. నిందితుడు జగద్గిరిగుట్టలో ఉన్న విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కరణ్​సింగ్ తల్వార్​తో వారిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రాజును ఛాతిలో కత్తితో పొడిచాడు. విజయ్‌ అనే మరో కానిస్టేబుల్‌ను తలపై కొట్టాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.