రెండేళ్ల క్రితం హత్య.. రోడ్డు ప్రమాదం అనుకుంటే.. 'ఇన్సూరెన్స్' పట్టించింది..!

author img

By

Published : Jan 9, 2023, 7:25 PM IST

DCP pressmeet

Shadnagar road accident case update: రెండేళ్ల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఓ వ్యక్తి కేసులో ఇన్సూరెన్స్​ పాలసీ సంస్థ అనుమానం... నలుగురు నిందితులను పట్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇన్సూరెన్స్ పాలసీ కోసం తన వద్ద పని చేసే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ప్రధాన నిందితుడు సహా సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఊహించని విషయం ఏమిటంటే హత్యకు స్కెచ్ వేసింది ఓ హెడ్ కానిస్టేబుల్. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Shadnagar road accident case update: 2021 డిసెంబర్​లో షాద్​నగర్ నియోజకవర్గం ఫరూక్​నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో భిక్షపతి అనే వ్యక్తి మృతి చెందాడు. అప్పుడు అనుమానాస్పద వాహనం ఢీకొని మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. భిక్షపతి పేరుపై హైదరాబాద్​లో ఉన్న ఇల్లు దానిపై ఉన్న ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేందుకు నామినిగా ఉన్న శ్రీకాంత్ కంపెనీకి వెళ్లాడు. క్లైమ్​ దర్యాప్తులో ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అనుమానం రావడంతో షాద్​నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానంతో బోడ శ్రీకాంత్​ను విచారించారు. విచారణలో గతంలో అతనిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతనే హత్య చేయించినట్లు గుర్తించారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. వీరిలో ఎస్ఓటీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్న మోతిలాల్ కూడా ఉన్నాడు. కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం బోడతండకు చెందిన ప్రధాన నిందితుడు బోడ శ్రీకాంత్... స్థిరాసి వ్యాపారం చేస్తూ కొంతకాలంగా నగరంలోని మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. విలాసాలకు అలవాటు పడిన శ్రీకాంత్... బోగస్ కంపెనీల పేరుతో కొంత మంది ఉద్యోగుల పేర్లు చూపి బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు, లోన్లు తీసుకుని జల్సాలు చేసేవాడు. ఇదే క్రమంలో గతంలో రూ.1.5కోట్ల మోసం కేసులో నాచారం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తరువాత విడుదలైనా శ్రీకాంత్ తీరు మారలేదు. వ్యాపారం కూడా చేసే శ్రీకాంత్ వద్ద రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా నర్సంపేట మండలం గురజాలకు చెందిన భిక్షపతి అనే యువకుడు పనికి చేరాడు. ఆయనకి తల్లిదండ్రులెవరూ లేకపోవడంతో పనిలో చేరిన కొన్ని రోజులకే భిక్షపతి పేరుపై ఐసీఐసీఐ బ్యాంకులో రూ.50లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు.

అదే విధంగా ఆయన పేరుపై రూ.52లక్షలు హౌసింగ్ లోన్‌ తీసుకున్న శ్రీకాంత్ మేడిపల్లి పరిధిలో ఇల్లు కొన్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్​కు డబ్బు అవసరం రావడంతో భిక్షపతిని ఇల్లు విక్రయించి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. తన పేరు మీద రిజిస్టర్ అయిన ఇల్లు అమ్మకానికి భిక్షపతి ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా ఆయనను తప్పించి ఇల్లుతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని పథకం పన్నాడు. ఉపాయం కోసం ఎస్​ఓటీ మల్కాజ్​గిరి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్న మోతిలాల్​ను సహాయం కోరి రూ.10 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. భిక్షపతి హత్యకు సహకరిస్తే తన వద్ద పనిచేసే సతీష్, సమ్మయ్యలకు చెరో రూ.5 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఆ నలుగురు పథకం ప్రకారం భిక్షపతిని కారులో ఎక్కించుకుని అధికంగా మద్యం తాగించారు.

షాద్​నగర్ మొగిలిగిద్ద గ్రామ శివారు వద్దకు తీసుకువచ్చి.. తర్వాత పథకం ప్రకారం హాకీ స్టిక్​తో భిక్షపతిని తలపై కొట్టి గాయపరిచారు. అనంతరం రహదారిపై పడేసి కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఆయనను హత్య చేసిన అనంతరం భిక్షపతి పేరు మీద ఉన్న రూ.50లక్షల ఇన్సూరెన్స్​ను నామినీగా ఉన్న తనకు ఇవ్వాలని శ్రీకాంత్ ఇన్సూరెన్స్ అధికారులను కలిశాడు. అయితే ప్రమాద దర్యాప్తులో అధికారులకు అనుమానాలు రావడంతో వారు షాద్​నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాక్ష్యాలను సేకరించిన పోలీసులు హత్య చేసిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.