ETV Bharat / crime

మృతదేహం తరలింపునకు రూ.80 వేలు.. ఆసుపత్రిలోనే వదిలివెళ్లిన సోదరుడు

author img

By

Published : May 1, 2022, 8:13 AM IST

మృతదేహం తరలింపునకు రూ.80 వేలు.. ఆసుపత్రిలోనే వదిలేసిన సోదరుడు
మృతదేహం తరలింపునకు రూ.80 వేలు.. ఆసుపత్రిలోనే వదిలేసిన సోదరుడు

రైలులో ప్రయాణిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శవాన్ని స్వస్థలానికి తరలించేందుకు మృతుడి సోదరుడు ఓ ప్రైవేట్​ అంబులెన్స్​ను సంప్రదించగా.. వారు చెప్పిన రేటుకు అతని కళ్లు బైర్లుకమ్మాయి. వారు అడిగినంత ఇచ్చే స్థోమత లేక.. చేసేదేమీలేక.. తన సోదరుడి శవాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు వడదెబ్బతో ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి డబ్బులు లేక తన సోదరుడు శవాన్ని ఆసుపత్రిలోనే వదిలెళ్లాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మోతీషా(23) అనే యువకుడు ఏప్రిల్‌ 28న తన సోదరుడితో కలిసి రైలులో ప్రయాణిస్తుండగా.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని సోదరుడు హుటాహుటిన మార్గమధ్యలోని బెల్లంపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు మంచిర్యాలలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించాడు.

ఆసుపత్రిలో చేరిన రెండు గంటల్లోనే మోతీషా మృతి చెందాడు. వడదెబ్బతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, శవాన్ని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు తన సోదరుడు ఓ ప్రైవేటు ఆంబులెన్స్‌ను సంప్రదించగా.. చోదకులు రూ.80 వేల వరకు డిమాండ్‌ చేశారు. నిరుపేద కావడంతో అంత డబ్బు చెల్లించే స్థోమత లేక శవాన్ని ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ మృతదేహం ఆసుపత్రి మార్చురీలోనే అనాథగా పడి ఉంది. ఆసుపత్రి సిబ్బంది తన సోదరుడిని సెల్‌ఫోన్‌ ద్వారా సంప్రదించడానికి పలుమార్లు ప్రయత్నించినా స్పందించలేదు. దీంతో సిబ్బంది శనివారం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబసభ్యుల వివరాలు సేకరిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చూడండి..

'నీవు లేని జీవితం వద్దు.. నీ దగ్గరికే వస్తున్నా..' సాయిగణేశ్​ ప్రేమికురాలు ఆత్మహత్యాయత్నం

అత్యాచారం విఫలయత్నం.. రైలు నుంచి యువతిని తోసేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.