ETV Bharat / crime

పెళ్లిలో చేతివాటం చూపిన పురోహితుడు

author img

By

Published : May 18, 2021, 4:15 PM IST

Updated : May 18, 2021, 7:48 PM IST

gold Theft
బంగారం దొంగతనం

పెళ్లంటే.. పందిళ్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అంటారు. ఇవన్నీ ఉన్నా పురోహితుడు తప్పకుండా ఉండాల్సిందే. వధూవరులకు వివాహ బంధం గొప్పతనం చెబుతూ మాంగల్యధారణ చేయించాల్సిందే. పవిత్రమైన బంధానికి ప్రత్యక్షసాక్షులుగా ఉండాల్సిందే. కాని మెదక్ జిల్లాలో ఓ వివాహవేడుకలో పురోహితుడే పుస్తెలతాడు మాయం చేయడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

పెళ్లిలో చేతివాటం చూపిన పురోహితుడు

మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఈనెల 16న ఓ జంటకు వివాహం జరిగింది. పడాలపల్లికి చెందిన మునిరాతి పెంటయ్య సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేంధర్‌ దాసు.. నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంతకు పెళ్లి జరిపించారు. మంగళవాయిద్యాలు.. మేళతాళాల నడుమ పురోహితుడు వధూవరులను ఒక్కటిచేశారు. గౌరీపూజ దగ్గర్నుంచి జీలకర్ర బెల్లం పెట్టే వరకు మాంగల్యం తంతునానేనా అనే వరకు వివాహ వేడుక సజావుగానే సాగింది. కానీ వరుడితో తాళికట్టించే సమయానికి ముందే మూడు తులాల పుస్తెలతాడును పురోహితుడు కాజేశాడు. పెళ్లి మంత్రాల సందడిలోనే బంగారం గొలుసును జేబులో వేసుకున్నాడు. ఈ తతంగం పెళ్లి వీడియోలో రికార్డయ్యింది.

పురోహితుడే పుస్తెలతాడును నొక్కేయడం చూసి అవాక్కయ్యారు

పెళ్లిసందడిలో ఉన్న కుటుంబ సభ్యులు పుస్తెలతాడు లేదనే విషయాన్ని గుర్తుపట్టలేదు. ఆ తర్వాత బంగారం గొలుసు కన్పించకపోవటంతో షాక్‌ అయ్యారు. పెళ్లి వీడియోలో వెతకగా.. పురోహితుడే పుస్తెలతాడును నొక్కేయడం చూసి అవాక్కయ్యారు. ఎందుకైనా మంచిది... ఓసారి అడుగుదామని ఫోన్‌ చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా స్విచ్ఛాఫ్‌ అనే వస్తోంది. విషయం ఏంటో కనుక్కుందామని బాధితులు గజ్వేల్‌లోని పురోహితుడి ఇంటికి వెళ్లారు. మర్యాదగా ఇస్తే బంగారం తీసుకొచ్చుకుందాం అని భావించారు. కాని పురోహితుడు మూడు రోజులుగా ఇంటికి రావడం లేదనే సమాధానంతో కంగుతిన్నారు. చేసేదిలేక తూప్రాన్‌ పోలీసులను ఆశ్రయించారు.

దర్యాప్తు ప్రారంభం

పురోహితుడు పుస్తెలతాడు కాజేశాడనే ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. పెళ్లి జరిపిస్తుండగా జేబులో పుస్తెలతాడు వేసుకుంటున్న వీడియోను పరిశీలించారు. వేదమంత్రాలు ఉచ్ఛరిస్తూ భార్యాభర్తలను ఒక్కటిచేసే వేడుకలో పురోహితుడే చేతివాటం ప్రదర్శించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని జనం అవాక్కవుతున్నారు.

ఇదీ చదవండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

Last Updated :May 18, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.