పుట్టిన కాసేపటికే ఇద్దరు పసికందులు మృతి.. కారణం వాళ్లే..!

author img

By

Published : May 10, 2022, 7:51 PM IST

new born babies died due to hospital Staff Negligence at hyderabad old city

పండంటి పిల్లలు పుట్టారన్న ఆనందాన్ని ఆ కుటుంబీకులు ఆస్వాదించేలోపే.. ఆవిరైపోయింది. ముట్టుకుంటే ముడుచుకుపోతున్న ఆ పసికందుల్ని ఎత్తుకుని ముద్దాడాలన్న వారి ఆశలు అడియాశలుగా మారాయి. ఎప్పుడెప్పుడు ఒళ్లోకి తీసుకుందామా అని ఎదురు చూస్తున్న వారికి.. విగతజీవులుగా మారిన పసికందుల్ని చూసి గుండె పగిలినంతపనైంది. ఈ ఘటన హైదరాబాద్​ పాతబస్తీలో జరిగింది.


వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి.. ఈరోజే పుట్టిన ఇద్దరు పసికందులు బలయ్యారు. ఈ విషాదకర ఘటన.. హైదరాబాద్ పాతబస్తీలోని శంషీర్​గంజ్​లో చోటుచేసుకుంది. కేఏఎం అనే ప్రైవేట్ ఆస్పత్రిలో ఈరోజు రెండు కాన్పులు జరిగాయి. కాన్పుల అనంతరం పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని బంధువులకు వైద్యులు తెలిపారు. కాసేపటి తర్వాత.. ఇద్దరు పిల్లల ఆరోగ్యం క్షీణించిందని చెప్పి.. పిల్లలను బంధువులకు అప్పజెప్పారు. పసివాళ్లకు ఏమవుతుందోనన్న ఆందోళనతో కుటుంబీకులు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన ఆ ఆస్పత్రి వైద్యులు అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతిచెందారని నిర్ధరించారు.

ఇదిలా ఉంటే.. ఇద్దరు చిన్నారుల ఛాతి, పొట్ట సమీపంలో కాలిన గాయాలున్నాయి. పుట్టినప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని.. అప్పుడు ఎలాంటి గాయాలు లేవని బంధువులు తెలిపారు. పిల్లలకు వేడి కోసం.. ఇంక్యుబేటర్​లో పెట్టారన్నారు. ఆ సమయంలోనే వేడి ఎక్కువై.. పసికందుల ఛాతి, పొట్ట సమీపంలో గాయాలై మృతి చెందారని మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని ఆరోపించారు.

అప్పుడే పుట్టిన పసికందులను చూసి మురిసిపోయేలోపే.. చనిపోయారన్న వార్తతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. విగతజీవులుగా మారిన పసిగుడ్డులను చేతుల్లోకి తీసుకుని గుండెలవిసేలా రోధించారు. ఇదంతా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఫలక్​నుమా పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. బంధువులకు నచ్చజెప్పి.. వారి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.