'ప్రశ్నాపత్నం లీక్ కేసులోనే నారాయణ అరెస్టు.. అడ్మిషన్ల కోసమే మాల్ ప్రాక్టీస్‌..'

author img

By

Published : May 10, 2022, 6:13 PM IST

Updated : May 10, 2022, 7:05 PM IST

Ex minister Narayana arrested in 10th class question paper leak case chitturu SP said

18:11 May 10

'ప్రశ్నాపత్నం లీక్ కేసులోనే నారాయణ అరెస్టు.. అడ్మిషన్ల కోసమే మాల్ ప్రాక్టీస్‌..'

'పదోతరగతి ప్రశ్నాపత్నం లీక్ కేసులోనే నారాయణ అరెస్టు'

Ex minister Narayana arrest: పదోతరగతి ప్రశ్నపత్నం లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసినట్లు ఏపీలోని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను అదుపులోకి తీసుకున్నామన్నారు. గత నెల 27న పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రం వాట్సాప్‌ గ్రూపులో సర్క్యులేట్‌ అయిందని డీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. విచారణలో భాగంగా ముద్దాయిలను పోలీసు కస్టడీకి తీసుకున్నామన్నారు. దర్యాప్తులో భాగంగా లభించిన వివరాలు, సాంకేతిక ఆధారాలు, ముద్దాయిల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సరైన విధానంలో నిబంధనల ప్రకారమే నారాయణను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

"ప్రవేశాల సంఖ్య పెంచుకోవడంలో భాగంగా పేపర్‌ లీక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇన్విజిలేటర్లు ఏఏ సెంటర్లల్లో ఎవరెవరు ఉంటారనే సమాచారాన్ని ముందుగానే సేకరించారు. వీరిలో ఎవరెవరిని లోబర్చుకోవచ్చో తెలుసుకున్నారు. వీరి దగ్గర చదివే విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించారు. బాగా చదివేవారు.. చదవని వారిగా విభజించారు. ఏఏ సెంటర్లలో ఈ పిల్లలున్నారో ముందుగా మాట్లాడుకున్న వారి ద్వారా ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడినట్లు తెలిసింది. పరీక్ష కేంద్రంలో ఉన్న ఒక ఉపాధ్యాయుడి ద్వారా ప్రశ్న పత్రాన్ని ఫొటో తీసి, వాటికి సమాధానాలు రాసి తిరిగి లోపలికి పంపించేందుకు ప్రయత్నించారు. గతంలో కూడా వీరు ఇలాంటి ప్రాక్టీస్‌కి పాల్పడినట్లు మా దర్యాప్తులో తేలింది. గత రెండేళ్లుగా కరోనా వల్ల పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది మళ్లీ పరీక్షలు రావడం.. ఒత్తిడి ఎక్కువై మంచి మార్కులు తీసుకురావాలనే దురాలోచనతో ఈ మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు." -రిషాంత్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ

ప్రశ్న పత్రం తీసుకున్న తర్వాత వాటి కీ రెడీ చేసి అటెండర్స్‌, వాటర్‌ బాయ్స్‌, ముందుగానే ప్రలోభాలకు గురైన ఉపాధ్యాయుల ద్వారా సమాధానాలు లోపలికి పంపించేలా గతంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిసిందని ఎస్పీ తెలిపారు. అదే ప్రక్రియను ఈసారి కూడా చేయబోయారన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా విషయం బయటకు వచ్చిందన్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని విద్యాసంస్థల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు. అయితే పట్టుబడిన ముద్దాయిల గత చరిత్రను పరిశీలిస్తే వీరంతా గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినట్లు గుర్తించామన్నారు. 2008 నుంచి నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసి 2014, 2015లో బయటకు వచ్చి వేర్వేరు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి మిగతా విద్యా సంస్థల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తామని తెలిపారు. విచారణలో ఉన్నందున ప్రస్తుతం ఈ కేసులో నారాయణ పాత్ర, వాంగ్మూలంలో వివరాలు ఇప్పుడు వెల్లడించలేమని ఎస్పీ తెలిపారు. నారాయణ సతీమణిని పోలీసులు అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా ఏడుగురిని అరెస్టు చేశామన్న ఎస్పీ.. ఇవాళ నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ నారాయణను, తిరుపతిలోని విద్యాసంస్థల డీన్‌ బాలగంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని న్యాయస్థానంలో హాజరుపరిచి తదుపరి విచారణ కొనసాగిస్తామని ఎస్పీ రిషాంత్​రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్​లో అరెస్టు: మాజీమంత్రి నారాయణను హైదారాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత అరెస్టు చేసినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంలో ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. హైదరాబాద్‌లో కారులో వెళ్తున్న నారాయణ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి సొంత కారులోనే ఏపీకి తరలించారు.

నారాయణపై పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్ ప్రాక్టీస్ చట్టం, సెక్షన్‌ 5, 8, 10 ఏపీ పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ చట్టంతో పాటు 408, 409, 201, 120 (బి), 65 ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. చిత్తూరు జ్యుడీషియల్ కోర్టులో పోలీసులు నారాయణను హాజరుపరచనున్నారు. అనంతరం ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్నారు.

ఇవీ చూడండి:

Last Updated :May 10, 2022, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.