Madhapur murder : ఇంట్లో వాళ్లకి చెప్పమందనే.. హత్య, ఆపై ఆత్మహత్య!

author img

By

Published : Jul 30, 2021, 12:39 PM IST

Updated : Jul 30, 2021, 2:18 PM IST

ఇంట్లో వాళ్లకి తెలుస్తుందేమోనని

హైదరాబాద్​ మాదాపూర్​ హత్య-ఆత్మహత్య(Madhapur murder) కేసులో ఆ ప్రాంత సీఐ రవీంద్ర ప్రసాద్ పలు వివరాలు సేకరించారు. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న తమ గురించి ఇంట్లో వాళ్లకి చెప్పాలని యువతి ఒత్తిడి చేయడం వల్లే.. ఆ యువకుడు ఆమెను హత్య చేసి తర్వాత తను ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు.

ప్రియురాలి గొంతు కోసి ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడి కేసుపై మాదాపూర్(Madhapur murder) పోలీసులు స్పందించారు. మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం సేకరించినట్లు మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రేమ పెళ్లి వ్యవహారమే ఘటనకు కారణమని తేల్చారు. సీసీ కెమెరా, సెల్​ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

"రాములు కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. అతడి ప్రేయసి సంతోషి.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. చివరకు పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. కానీ.. సంతోషి మాత్రం.. తామేం తప్పు చేయలేదని.. పెళ్లి గురించి అందరికి చెప్పాలని ఒత్తిడి చేసింది. తాను వివాహం చేసుకున్న విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందోనని భయపడిన రాములు.. సంతోషిని హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు."

- రవీంద్ర ప్రసాద్, మాదాపూర్ సీఐ

రాములు తన ప్రేమ గురించి నెల క్రితమే ఇంట్లో చెప్పాడని మృతుడి సోదరుడు సాయి తెలిపాడు. అమ్మాయిది వేరే కులం కావడంతో తమ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పాడు. అయితే, గత రెండు రోజుల నుంచి తన అన్న రాములు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉందని, మంగళవారం ల్యాండ్‌లైన్‌ నుంచి ఫోన్‌ చేసి మాట్లాడాడని... ఫోన్‌ పోయినట్టుగా తమకు చెప్పాడన్నారు. వీరు పెళ్లి చేసుకున్నట్లు తమకు తెలీదని.. తన అన్న చాలా మంచివాడని.. ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ సాయి కన్నీరు మున్నీరుగా విలపించాడు.

రాములుని పెళ్లి చేసుకుంటానని సంతోషి నెల రోజుల క్రితమే ఇంట్లో చెప్పిందని మృతురాలి సోదరుడు రాఘవేందర్‌ తెలిపాడు. ఇరువురి కులాలు వేరయినప్పటికీ పెళ్లికి ఒప్పుకున్నట్లు చెప్పాడు. అయితే, రాములు కుటుంబం ఒప్పుకోలేదన్నారు. కులాంతర వివాహం వద్దని చెప్పారని తెలిపారు. ఇలా జరుగుతుందని ఊహించలేదని రాఘవేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Last Updated :Jul 30, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.