ETV Bharat / crime

ప్రేమలేనిదే జీవించలేమని.. ప్రేమికుల ఆత్మహత్య

author img

By

Published : Jun 19, 2021, 12:12 PM IST

lovers suicide in nellore, lovers suicide in ap
నెల్లూరులో ప్రేమజంట ఆత్మహత్య, నెల్లూరులో ప్రేమికుల ఆత్మహత్య

తెల్లవారుజాము.. అప్పటి వరకు తిరిగి అలసి సొలసి కొందరు నడుం వాల్చగా...ఆవేదన ముప్పిరిగొని మరికొందరు మగత నిద్రలో జోగుతున్నారు... సరిగ్గా.. అప్పుడు మోగింది ఆ ఇంట ఫోన్‌...ఆత్రుతగా ఫోన్‌ తీస్తే...అవతల ఆ ఇంటి బిడ్ఢ..నాన్నా.. నేను ప్రేమించినవాడితో పెళ్లి చేస్తావా అని...! మళ్లీ ఆ ఇంట ఫోన్‌ మోగింది...ఏదో కొత్త నంబరు..మనసు కీడు శంకిస్తూనే ఉంది..ఆందోళన.. ఆత్రుతతోనే ఫోన్‌ తీశారు...మీ బిడ్ఢ. మరో యువకుడు..చావు బతుకుల్లో ఉన్నారని...!!

ఆ ఆసుపత్రిలో.. ఆ వైపు యువకుడు.. ఈ వైపు యువతి... ఇద్దరూ చావుబతుకుల మధ్య పోరాటం.... మొదట యువకుడు తనువు చాలించగా- ఆ తర్వాత రెండు నిమిషాలకే.. యువతీ కన్నుమూసింది...

టీనేజీ ప్రేమ.. ఆకర్షణ అని సర్దిచెప్పారు. అంతరాల పేరుతో హెచ్చరించారు.. సామాజిక వర్గాలు వేరంటూ మందలించారు.. కానీ, ఆ యువతీ యువకులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. పెళ్లి చేస్తామని చెబుతూనే.. పెద్దలు తమను మోసం చేస్తున్నారని మదనపడ్డారు. చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. విషగుళికలు తిని బల వన్మరణానికి పాల్పడ్డారు. అపరిపక్వత.. ఆవేదన.. ఆవేశం.. కలగలిసి.. అందరూ మెచ్చేలా బతికిచూపిద్దామన్న నిర్ణయానికి బదులు... తనువులు చాలించారు. నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడంతోపాటు తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చారు. ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ ప్రేమకథ విషాదాంతం పలువురిని కలచివేసింది.

ఆత్మకూరు మేదరవీధికి చెందిన నవీన్‌(19), ఆయిషా (18) టీనేజీలోనే ప్రేమలో పడ్డారు. అయిదేళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. మధ్యలో రెండుసార్లు కలిసి జీవించాలని వెళ్లిపోయారు. అప్పట్లో వారు మైనర్లు కావడంతో పెద్దలు వెతికి పట్టుకుని.. ఎవరిళ్లకు వారిని తీసుకువెళ్లారు. ఆ తర్వాత వారి ప్రేమ కొనసాగింది. ఆరు నెలల కిందట ఆయిషా నవీన్‌ ఇంటికి వచ్చేయగా- మేమే మీకు పెళ్లి చేస్తామని నచ్చజెప్ఫి. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. కానీ, వారి ప్రేమను పెద్దలు స్వాగతించలేకపోయారు. ఇద్దరివీ పేద కుటుంబాలే అయినా.. సామాజికవర్గాలు వేరు కావడంతో వీరి ప్రేమకు తోడ్పాటు లభించలేదు.

కలిసి జీవించాలనే ప్రయత్నాలు విఫలమవడం.. పెద్దలు తమను కలిసి జీవించనీయరన్న నిర్ణయానికి వచ్చారు. గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఆత్మకూరు కాశినాయన ఆశ్రమం సమీపంలోని పొలాల్లోకి వెళ్లారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఆయిషా తన తండ్రికి ఫోన్‌ చేసి.. తమకు పెళ్లి చేయాలని కోరింది. ఇంటికి రావాలని, ఇద్దరికీ పెళ్లి చేస్తామని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె అపనమ్మకాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. అనంతరం ఆమె ఫోన్‌ పెట్టేసింది.

ఆ తర్వాత యువతీ యువకులు ఇద్దరూ తమ వెంట తీసుకువెళ్లిన విష గుళికలను తిని అక్కడే పడిపోయారు. తెల్లవారి పొలం వద్దకు వెళ్లిన రైతు.. అక్కడ యువతీ యువకులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటాన్ని గుర్తించారు. రైతుకు నవీన్‌ తెలిసి ఉండటంతో.. అతడి తండ్రికి, అదే సమయంలో 108కు ఫోన్‌ చేశారు. ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా... చికిత్స పొందుతూ మొదట నవీన్‌ మృతి చెందారు. మరో రెండు నిమిషాల వ్యవధిలోనే ఆయిషా మృతి చెందింది.

ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపగా... బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. మలిసంధ్యలో అండగా ఉంటాడనుకున్న కుమారుడి మృతితో నవీన్‌ తండ్రి శోకసంద్రంలో మునిగిపోగా- ఆయిషా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆత్మకూరు ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.