ETV Bharat / crime

Honey Trap: 'వలపు వలతో దోచుకుంటున్నారు.. బాధితులు భయంతో ఆగిపోతున్నారు'

author img

By

Published : Dec 17, 2021, 8:31 AM IST

Honey Trap Cases: హనీట్రాప్​.. ఈ మధ్య తరచూ వినిపిస్తున్న పదం. 60 ఏళ్ల వృద్ధుల నుంచి 18 ఏళ్ల కుర్రాళ్ల వరకు ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. వలపు వల వేసి.. అందినకాడికి దోచేసి.. నిలువునా ముంచేస్తున్నా.. పరువుపోతుందనే భయంతో కొందరు నోరు కూడా మెదపడంలేదు. వారి భయాన్నే సైబర్​ నేరగాళ్లు ఆయుధంగా మలచుకుంటూ.. మరింత రెచ్చిపోతున్నారు.

Honey Trap, Honey Trap Cases
హనీట్రాప్

  • Honey Trap Cases: అతడి వయసు 60కు పైనే. పదవీ విరమణ అనంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల వాట్సాప్‌ నంబరుకు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేస్తే.. ఓ ఫోను నంబరు కనిపించింది. ఫోన్‌ చేస్తే అందమైన ఆడపిల్ల గొంతు. క్రమంగా ఆమె మాటలకు ఆకర్షితుడయ్యాడు. వృద్ధుడి నగ్న వీడియోలు తీసుకొని.. యువతి డబ్బులు డిమాండ్‌ చేయటం ప్రారంభించింది. రెండు నెలల్లో రూ.12 లక్షల వరకు కాజేసింది. బయటకు చెబితే పరువుపోతుందనే ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయాడు.
  • కూకట్‌పల్లికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన యువతితో అర్ధరాత్రి వరకూ ఛాటింగ్‌ చేసేవాడు. వాట్సాప్‌ ద్వారా నగ్నంగా మాట్లాడుకోవడాన్ని.. ఆ యువతి రికార్డు చేసింది. కొన్నాళ్లకు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులకు వీడియోలు పంపుతానంటూ బెదిరించింది. దీంతో ఆ యువకుడు.. తల్లికి తెలియకుండా ఆమె ఆభరణాలు తాకట్టు పెట్టి నగదు ఇచ్చాడు. విషయం తెలిసిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదులు తక్కువే..

సైబరాబాద్‌ పోలీసులకు రోజూ వస్తున్న ఫిర్యాదుల్లో 9-10 వరకూ హనీట్రాప్‌కు సంబంధించినవే ఉంటున్నాయి. బాధితుల్లో కళాశాల విద్యార్థుల నుంచి కార్పొరేట్‌ సంస్థ ఉన్నత ఉద్యోగుల వరకు ఉన్నారు. కేవలం 1-2 శాతమే ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని, దీన్ని అవకాశం తీసుకొని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2018లో 293 సైబర్‌ నేరాలు నమోదైతే, 2021 నవంబరు వరకూ 1,500 దాటి ఉంటాయని అంచనా. మూడేళ్ల వ్యవధిలో బాధితులు సుమారు రూ.65-85 కోట్లు నష్టపోయినట్లు అంచనా. వీటిలో కేవలం 36.4 శాతం మాత్రమే రాబట్టగలిగారు.

సాంకేతికతపై అవగాహన..

Honey Trap Cases: సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచటం, సైబర్‌క్రైమ్‌ విభాగపు పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంపై మరింత అవగాహన కల్పించేందుకు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సాంకేతిక నిపుణులు, సైబర్‌, కార్పొరేట్‌ చట్టాలపై పట్టున్న న్యాయవాదులతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. కొత్త ఎత్తులతో సైబర్‌ నేరగాళ్లను గుర్తించి.. వారి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్‌ చేసేలా పోలీసులను తీర్చిదిద్దుతున్నారు.

బయటపడిందిలా..

ఆన్‌లైన్‌ వివాహ వేదికలు, సహజీవనం, హనీట్రాప్‌ల్లో మోసపోతున్న బాధితుల్లో కొద్దిమంది మాత్రమే ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల రాజస్థాన్‌, యూపీ, దిల్లీలకు చెందిన కొంతమంది సైబర్‌ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి ఫోన్లలో లభించిన సమాచారం ఆధారంగా పలువురు వ్యక్తులు.. ఈ మాయగాళ్ల ఉచ్చులో పడినట్లు గుర్తించారు. వీరిలో గ్రేటర్‌కు చెందిన బాధితులు 200-300 వరకూ ఉండవచ్చని ఓ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. గచ్చిబౌలికి చెందిన కార్పొరేట్‌ ఉద్యోగి సుమారు రూ.25 లక్షలు పోగొట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇదీ చూడండి: Honey trap to software engineer : 'పెళ్లి చేసుకుందామని.. రూ.95 లక్షలు కాజేసింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.