ETV Bharat / crime

Honey trap to software engineer : 'పెళ్లి చేసుకుందామని.. రూ.95 లక్షలు కాజేసింది'

author img

By

Published : Nov 13, 2021, 9:22 AM IST

అందమైన అమ్మాయి ప్రొఫైల్​తో ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే ఎంతో సంబురపడి అంగీకరించాడు. పని ఒత్తిడిలో ఆమె మాటలు ఎంతో హాయినిస్తుంటే ఆనందపడ్డాడు. స్నేహం ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియకముందే.. పెళ్లి చేసుకుందామన్న ఆమె మాట.. అతని గుండెల్లో వేయి వీణలు ఒకేసారి మోగినంత సంతోషాన్ని తెచ్చాయి. సరేనంటూ గంతులేశాడు. ఇంతలో తనకు అత్యవసరంగా డబ్బు అవసరమంటే.. తాను పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆమెకు బదిలీ చేశాడు. చివరకు ఆమె హనీట్రాప్​కు చిక్కానని అర్థమై.. విలవిల్లాడుతున్నాడు సికింద్రాబాద్​కు చెందిన ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్...

Honey trap to software engineer
Honey trap to software engineer

ఫేస్​బుక్​లో అమ్మాయి ప్రొఫెల్​తో అబ్బాయిలకు పరిచయమవ్వడం(Honey trap). నెమ్మదిగా వారితో స్నేహం చేయడం. ఆపై ప్రేమిస్తున్నట్లు నటించడం. ఆ ప్రేమను పెళ్లిపీటలు ఎక్కిద్దామంటూ మాయమాటలు చెప్పడం. ఈలోగా.. ఇంట్లో ఏదో అవసరముందనో.. కుటుంబ సభ్యులకో ఆరోగ్యం బాగోలేదనో.. ఇంకేదో కారణం చెప్పి డబ్బు అవసరమని అమాయకుల నుంచి పెద్దమొత్తంలో నగదు కాజేయడం. ఇప్పుడు సైబర్ నేరాల్లో(Cyber crimes in telangana) ఈ హనీట్రాప్​ది(honey trap) సరికొత్త ట్రెండ్. ఈ ట్రెండ్​కు ఎక్కువగా బలవుతోంది సాఫ్ట్​వేర్ ఇంజినీర్లే.

రోజంతా కోడింగ్​తో సరికొత్త సాఫ్ట్​వేర్లు, టెక్నాలజీలు క్రియేట్ చేసే టెక్కీలు(honey trap to software engineers).. పని ఒత్తిడితో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. వారి ఒంటరితనాన్ని సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అమ్మాయిల ప్రొఫైల్ ఫొటోతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం.. ముందు స్నేహితురాలినంటూ.. ఆ తర్వాత ప్రేయసిగా మారి.. పెళ్లి చేసుకుందామని ఆశలు రేపి చివరకు వాళ్ల వద్ద ఉన్న డబ్బంతా నొక్కేస్తున్నారు. వారితో చాట్ చేసేది అమ్మాయో.. అబ్బాయో కూడా తెలియకుండా.. అమాయకులు వారి వలలో పడుతున్నారు. చివరకు నిజం తెలిసి విలవిలలాడుతున్నారు. ఈ కేసుల్లో ఎక్కువ మంది అబ్బాయిలు డబ్బు పోయినందుకు కాకుండా.. వారిని ఆ అమ్మాయి మోసం చేసిందని బాధపడటం గమనార్హం. ఇలాంటి అమాయకుల నుంచి డబ్బు కాజేయడమే కాదు.. వారి మనసును గాయపరుస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

ఇలాంటి పరిస్థితే సికింద్రాబాద్​కు చెందిన ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్(Software engineer was looted)​కు ఎదురైంది. ఈ టెక్కీఫేస్‌బుక్‌ ఖాతాకు అందమైన అమ్మాయి ముఖచిత్రంతో ఉన్న ఖాతా నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌(Facebook friend request) రావడంతో అంగీకరించాడు. తాను ఏపీలోని గుంటూరులో ఉంటానని, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నానంటూ వివరాలను చెప్పింది. కొంతకాలం వారిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. ఈ క్రమంలో మనసులు సైతం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంత జరిగినా బాధితుడు ఆ అమ్మాయిని ప్రత్యక్షంగా చూడలేదు.

మరోవైపు, తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని చెప్పడంతో.. విడతల వారీగా రూ.95 లక్షలు ఆమెకు ముట్టజెప్పాడు. అనంతరం ఆ అమ్మాయి ఫేస్‌బుక్‌ ఖాతా డిలీట్‌(Facebook account deleted) అయింది. ఫోన్‌లోనూ అందుబాటులో లేకుండా పోయింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు(cyber crime police) దర్యాప్తు ప్రారంభించారు. ఈ హనీట్రాపుల్లో పడి మోసపోతున్న వాళ్లలో చదువుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. తెలియని వాళ్ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే.. అంగీకరించొద్దని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వలపు వలలో పడి.. కష్టపడి సంపాదించిన సొమ్మంతా కేటుగాళ్లకు ముట్టజెప్పొద్దని చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.