ETV Bharat / crime

అన్నం పెట్టిన సంస్థకే సున్నం.. నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఘరానా మోసం

author img

By

Published : Jun 23, 2022, 1:37 PM IST

gold appraiser fraud in AP
gold appraiser fraud in AP

gold appraiser fraud in AP :ఎవరైనా బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందాలనుకుంటే.. ఆ గోల్డ్ ఎంత బరువుంది..? అసలు బంగారమా..? నకిలీదా..? అనే కీలక విషయాలను ధ్రువీకరించే బాధ్యత అప్రైజర్​ది. ఇంతటి కీలక విధులు నిర్వహించే ఓ బ్యాంకు అప్రైజర్.. తన ఉద్యోగ ధర్మాన్ని విస్మరించాడు. మోసానికి స్కెచ్ వేశాడు. తన కుమారుడితోపాటు అతని ముగ్గురు స్నేహితులతో కుమ్మక్కై.. ఘరానా మోసానికి పాల్పడ్డారు. నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా నమ్మించి.. ఆ పసిడిని తనఖా పెట్టి.. బ్యాంకు నుంచి రూ.35 లక్షలు స్వాహా చేశాడు..!

gold appraiser fraud in AP నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంకు నుంచి లక్షల్లో రుణం పొందిన ఘటన ఏపీలోని గుంటూరులో "తమిళనాడు మార్కంటైల్ బ్యాంకు"లో చోటు చేసుకుంది. ఓ ఘరానా ముఠా చేసిన ఈ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎస్​ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చేబ్రోలులోని తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకులో బాబూరావు గోల్డ్ అప్రైజర్​గా పనిచేస్తున్నాడు. ఐదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న బాబూరావు.. తన కుమారుడితోపాటు అతని ముగ్గురు స్నేహితులతో కుమ్మక్కై ఘరానా మోసానికి పాల్పడ్డాడు. బ్యాంకు మేనేజర్ లేని సమయం చూసి నకిలీ బంగారం తీసుకువచ్చి బ్యాంకులో తనఖా పెట్టి రూ.35 లక్షల రూపాయల రుణం తీసుకుని వివిధ ఖాతాలకు మళ్లించాడు.

ఆ తర్వాత అనుమానంతో.. తాకట్టు పెట్టిన బంగారాన్ని మేనేజర్‌ పరిశీలించగా.. అది నకిలీదని తేలింది. మేనేజర్ బంగారాన్ని పరిశీలించడాన్న విషయాన్ని తెలుసుకున్న గోల్డ్‌ అప్రైజర్ బాబూరావు రాత్రికి రాత్రే ఉడాయించాడు. బ్యాంక్ మేనేజర్ సతీశ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.