ఎన్ఐఏ అదుపులో లాయర్లు​ శిల్ప, దేవేంద్ర.. రాధ మిస్సింగ్‌ కేసుపై విచారణ

author img

By

Published : Jun 23, 2022, 9:34 AM IST

Updated : Jun 23, 2022, 12:18 PM IST

NIA searches at High Court Advocate Shilpa house

09:32 June 23

NIA Raids: మాదాపూర్‌లో హైకోర్టు అడ్వకేట్‌ శిల్పను విచారిస్తున్న ఎన్ఐఏ

హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు...

NIA Raids: రాష్ట్రంలోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు జరుపుతోంది. నర్సింగ్‌ విద్యార్థిని రాధ అదృశ్యం కేసులో విచారణ జరుపుతోన్న ఎన్​ఐఏ అధికారులు.. హైదరాబాద్‌ ఉప్పల్‌తో పాటు మెదక్‌ జిల్లా చేగుంట, మేడిపల్లి పర్వతాపూర్​లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు.

ఉప్పల్‌లోని హైకోర్టు న్యాయవాది శిల్ప ఉంట్లో అధికారులు తనిఖీలు జరిపారు. అనంతరం శిల్పను అదుపులోకి తీసుకున్న అధికారులు.. మాదాపూర్‌లోని కార్యాలయానికి తరలించారు. రాధ మిస్సింగ్‌ కేసుకు సంబంధించి శిల్పను విచారించనున్నారు. గతంలో ఎల్బీనగర్, ములుగు, గద్వాల, చెర్ల, ఏపీలో నమోదైన కేసుల్లో శిల్పను అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో న్యాయవాది దేవేంద్ర నివాసంలోనూ సోదాలు చేసిన అధికారులు.. ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో చైత్యన్య మహిళా సంఘంలో దేవేంద్ర పనిచేశారు. గతంలో ఏవోబీ ఎన్​కౌంటర్​లో మృతి చెందిన ప్రభాకర్ భార్యే దేవేంద్ర. అదే విధంగా.. చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడు శంకర్‌ నివాసంలో ఎన్​ఐఏ సోదాలు చేపట్టింది.

ఎన్‌ఐఏ సోదాలపై అడ్వకేట్ శిల్ప భర్త బండి కిరణ్ స్పందించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఎన్​ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. రాధ కేసుకు శిల్పకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శిల్పను ఇబ్బందిపెట్టాలని కావాలనే ఇలాంటి కేసులు పెడుతున్నారని బండి కిరణ్​ తెలిపారు.

"సోదాల విషయంపై ఎన్‌ఐఏ మాకు నోటీసులు ఇవ్వలేదు. శిల్ప ప్రస్తుతం చైతన్య మహిళా సంఘంలో లేదు. ప్రస్తుతం ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాం. మావోయిస్టు అనుబంధ సంస్థగా ముద్ర వేస్తున్నారని శిల్ప బయటికొచ్చింది. శిల్పను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారు. గతంలో అర్బన్ మావోయిస్టు అని శిల్పను 6నెలలు జైల్లో ఉంచారు. రాధ కేసుకు శిల్పకు ఎలాంటి సంబంధం లేదు." - బండి కిరణ్‌, అడ్వకేట్​ శిల్ప భర్త

తమ కూతురు కిడ్నాప్‌నకు గురైందంటూ.. 2017 డిసెంబర్‌లో ఏపీలో విశాఖలోని పెద్దబాయిల పోలీస్‌ స్టేషన్‌లో రాధ తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్టు అనుబంధ సంస్థ సీఎంఎస్​ నాయకులు కిడ్నాప్ చేసి.. రాధను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించింది. సీఎంఎస్​ నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ ఇంటికి వచ్చేవారని ఆమె వెల్లడించింది. వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లారని రాధ తల్లి ఫిర్యాదు చేసింది.

రాధ అదృశ్యంపై విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదు కాగా... రాధను నక్సల్స్‌లో చేర్చారని అడ్వకేట్‌ శిల్పపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నర్సింగ్ విద్యార్థిని రాధ కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. విశాఖలో నమోదైన ఎఫ్​ఐఆర్​ ఆధారంగా కేసు నమోదు చేసిన ఎన్​ఐఏ... ఈ మేరకు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలోని చేగుంట, ఉప్పల్‌లో ఏకకాలంలో సోదాలు జరిపింది.

Last Updated :Jun 23, 2022, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.