ETV Bharat / crime

బంజారాహిల్స్‌ పబ్‌ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. వారిని అరెస్ట్​ చేసేందుకు సన్నాహాలు!

author img

By

Published : Apr 8, 2022, 3:20 AM IST

Updated : Apr 8, 2022, 3:49 AM IST

బంజారాహిల్స్‌ పబ్‌ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. వారిని అరెస్ట్​ చేసేందుకు సన్నాహాలు!
బంజారాహిల్స్‌ పబ్‌ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. వారిని అరెస్ట్​ చేసేందుకు సన్నాహాలు!

Banjarahills Drugs Case: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. అనుమానితులను సోమవారం నుంచి ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికే మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని గుర్తించిన పోలీసులు.. అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు .

బంజారాహిల్స్‌ పబ్‌ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. వారిని అరెస్ట్​ చేసేందుకు సన్నాహాలు!
Banjarahills Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారంలో కొకైన్‌ను వినియోగించినవారిని అరెస్ట్‌ చేసేందుకు బంజారాహిల్స్‌ పోలీసులు సమాయత్తమయ్యారు. కొకైన్‌ సరఫరా, వినియోగంపై అభిషేక్‌తో పాటు మరికొందరికి బలమైన సంబంధాలున్నాయని పోలీసులు కీలకాధారాలు సేకరించారు. అందుకే రాడిసన్‌ బ్లూ హోటల్‌లోని పబ్‌లో ఆదివారం తెల్లవారుజాము వరకూ జరిగిన విందులు, వినోదాలు, వేడుకలకు వెళ్లినవారిలో 148మందిని విచారణకు హాజరు కావాలంటూ తాఖీదులు పంపుతున్నారు. సోమవారం నుంచి వీరిని బంజారాహిల్స్‌ పోలీస్‌ఠాణాలో విచారించే అవకాశాలున్నాయి. ఆ రోజు పబ్‌కు వెళ్లినవారిలో 10మంది నుంచి 20మంది వరకూ మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారని పోలీసులకు కచ్చితమైన ఆధారాలు లభించడంతో వారికి కొకైన్‌ ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎన్నిరోజుల నుంచి వినియోగిస్తున్నారన్న ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. సాక్ష్యాధారాల సేకరణ ఎన్డీపీఎస్‌ చట్టం ప్రకారం వీరిని అరెస్ట్‌ చేయనున్నారు.

డ్రగ్స్‌ తెస్తోంది ఇద్దరేనా? : మాదకద్రవ్యాలు వినియోగించేందుకు పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ను ఎంచుకున్న మత్తుప్రియులకు ఇద్దరు వ్యక్తులు కొకైన్‌ తెస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకరు తరచూ గోవాకు వెళ్లి అక్కడ కొద్దిరోజులుండి తిరిగివచ్చేప్పుడు కొకైన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు తీసుకువస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. మరొకరు ముంబయిలో నివాసముంటున్న నైజీరియన్ల ద్వారా కొకైన్‌ మాత్రమే రహస్యంగా తెప్పిస్తున్నాడని అతడి ఫోన్‌లోని వివరాల ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. వీరిద్దరూ ఒకరికొకరు సంబంధంలేకపోయినా... పుడిండ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌తో ఇద్దరికీ సంబంధం ఉందని అభిషేక్‌ను తరచూ పబ్‌లో కలుసుకుంటున్నారని పబ్‌లో లభించిన సీసీకెమరాల ఫుటేజీలు, అక్కడ పనిచేస్తున్న వారి ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఇవన్నీ ఎవరికీ అనుమానం రాకుండా నిర్వహిస్తున్నారని, వాట్సాప్‌లో మాట్లాడుకున్న వెంటనే సంభాషణలు, వీడియోలు తొలగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. వీటిని మళ్లీ చూసేందుకు ఆ ఫోన్లను ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు.

సరఫరా ముగ్గురి కనుసన్నల్లో.. పబ్‌లో మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం అభిషేక్, అనిల్‌కుమార్, అర్జున్‌ల కనుసన్నల్లోనే జరుగుతోందని పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించారు. పబ్‌లో కొకైన్‌ను వినియోగిస్తున్న కొందరితో అభిషేక్‌ సన్నిహిత సంబంధాలున్నాయని పోలీస్‌ అధికారులు వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. అభిషేక్‌ స్నేహితుల్లో కొందరు డ్రగ్స్‌ వినియోగిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు వారి కదలికలపై నిఘా ఉంచారు. నిత్యం డ్రగ్స్‌ వాడుతున్నవారైతే ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారో తెలుస్తుందన్న అంచనాతో ఇదంతా చేస్తున్నారు. పబ్‌ వ్యవహారాలు చూసుకుంటూనే అభిషేక్‌ తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాడని గుర్తించారు. అక్కడి నుంచి అతడు డ్రగ్స్‌ తెప్పిస్తున్నాడా? అక్కడి డీలర్లకు డబ్బులు ఇచ్చి వారినే సరఫరా చేయాలంటూ సూచించాడా? అన్న కోణంలో పరిశోధన చేస్తున్నారు. అతడి చరవాణిలో సంకేతభాషలో తరచూ మాదక ద్రవ్యాల ప్రస్తావన ఉండడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. దీంతో గురువారం నుంచి పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో గతంలో జరిగిన సంఘటనలు, అభిషేక్, అతడి మిత్రుల వ్యవహారశైలిపై ఆధారాలు సేకరిస్తున్నామని ఒక పోలీస్‌ అధికారి తెలిపారు. అభిషేక్‌ కొకైన్‌ తీసుకుంటున్నాడా? లేదా? అన్నది ప్రస్తుతం చెప్పలేమని, అతడిని కస్టడీకి తీసుకుంటే తెలుస్తుందని వివరించారు.

ఇదీ చదవండి: Hyderabad Pub Case: నిత్యం ఇరవైమందికి డ్రగ్స్‌ సరఫరా!.. ఎలా వస్తున్నాయి?

Last Updated :Apr 8, 2022, 3:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.