వ్యవసాయ అధికారులకు చుక్కలు చూపిస్తున్న క్రాప్‌ బుకింగ్ యాప్​

author img

By

Published : Sep 9, 2022, 3:05 PM IST

crop booking app

Delay in crop booking app: క్రాప్‌బుకింగ్‌ పేరుతో రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన పంటల నమోదు వ్యవసాయ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. సాంకేతిక సమస్యలు, క్షేత్రస్థాయి ఇబ్బందుల మధ్య.. పంటల నమోదు తుదిదశకు చేరుకుంటున్నా.. భూముల గుర్తింపు, సాంకేతిక సమస్యలతో వ్యవసాయ విస్తరణాధికారులు తికమక పడుతున్నారు. ప్రభుత్వ భూములు, వివాదంలో ఉన్న చోట, పాసుపుస్తకాలు లేని భూముల్లో విస్తరణ అధికారులు అవస్థలకు గురవుతున్నారు.

వ్యవసాయ అధికారులకు చుక్కలు చూపిస్తున్న క్రాప్‌ బుకింగ్ యాప్​

Delay in crop booking app: రాష్ట్రంలో పండిస్తున్న పంటలపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించడమే లక్ష్యంగా... సర్కారు చేపట్టిన పంటల నమోదు తుదిదశకు చేరుకుంటోంది. గతేడాది వానాకాలంలో.. కోటి 52లక్షల 88వేల ఎకరాల్లో పంటలు నమోదు చేయగా ఈ ఏడాది కోటి 30లక్షల ఎకరాల్లోని పంటల్ని వివరాలు నమోదు చేశారు. మరో 23లక్షల ఎకరాల్లో ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఐతే క్రాప్‌ బుకింగ్‌లో వ్యవసాయ విస్తరణాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గతంలో ఏ సర్వే నెంబర్‌లో ఎవరు ఎంత విస్తీర్ణంలో పంటలు వేశారో సమాచారం తెలుసుకొని... ఆ వివరాల్ని వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసేవారు. ప్రస్తుతం పంటల నమోదుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించగా... విస్తరణాధికారులు ప్రతి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి... అక్కడి నుంచే యాప్ ద్వారా పంటల్ని నమోదు చేయాల్సి ఉంది. సర్వే నెంబర్లు, సబ్ నంబర్లు, ఎంత విస్తీర్ణంలో ఏ పంట పండిస్తున్నారో కచ్చితంగా నమోదు చేయాలి. సర్వేనంబర్ల వరకూ భూములు ఎక్కడున్నాయో భువన్ యాప్ ద్వారా గుర్తించగలిగినా, బై నంబర్ల భూముల్ని గుర్తించడం కష్టంగా మారుతోంది. గతంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది సహకారం ఉన్నా... ఇప్పుడు వారు అందుబాటులో లేకపోవటంతో విస్తరణాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మారుమూల ప్రాంతాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ రాకపోవటంతో... ఇంటర్ నెట్ సౌకర్యం ఉండటం లేదు. కొన్నిచోట్ల సిగ్నల్‌ ఉన్నా... ఇంటర్‌నెట్‌ వేగం తక్కువగా ఉంటోంది. దీంతో మొబైల్‌ యాప్‌ పూర్తిస్థాయిలో తెరచుకోవడం లేదు. సిగ్నల్ ఉన్న ప్రాంతాలకు వెళ్లి... అక్కడన్నుంచి నమోదు చేయాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాలు, కొండలు, గుట్టలు దాటుకొని వెళ్లాల్సిన రావడం వ్యవసాయ విస్తరణాధికారుల్లో మహిళలు ఉంటుండటంతో... ఒంటరిగా అలాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు నానాఅవస్థలు పడాల్సి వస్తోంది

పంటల నమోదు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉపగ్రహం ద్వారా గుర్తించిన గ్రౌండ్ ట్రూత్ పాయింట్స్‌లో ఏ పంటలు వేశారో ధ్రువీకరించాలని ప్రతి విస్తరణాధికారి పరిధిలో 4 నుంచి 6 పాయింట్లు కేటాయించారు. అక్కడ వేసిన పంటల్ని ధ్రువీకరించాలంటే జీపీఎస్ ఆధారంగా అధికారులు ఆ పాయింట్‌ని చేరుకోవాలి. పంట ఫోటోలు, విస్తీర్ణం, ఇతర వివరాల్ని అక్కడి నుంచే నిక్షిప్తం చేసి ధ్రువీకరించాలి. పంటల నమోదులో కచ్చితత్వాన్ని పెంచేందుకు ఈ ధ్రువీకరణ తోడ్పడినా... మారుమూల ప్రాంతాల్లోని జీటీ పాయింట్లకు వెళ్లటం అధికారులకు పరీక్షగా మారుతోంది.

ఆరంభంలో వర్షాధార పంటలు వేసి... వానలు రాగానే పంటమార్చి వరి వేసే రైతుల పంటల నమోదులోనూ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వ్యవసాయ విస్తరణాధికారులు చెబుతున్నారు. ఏఈఓల్లో కొందరికి 6వేల నుంచి 14వేల ఎకరాల వరకు కేటాయించడంతో జాప్యం జరుగుతోంది. భూములుండీ, పంటలు పండిస్తున్నా పట్టా పాస్ పుస్తకం రాని వారి పంటల నమోదుకు యాప్‌లో ఆప్షన్‌ లేకపోవడంతో ప్రక్రియ ఆగిపోయింది. రికార్డుల్లో వ్యవసాయ భూములై ఉండి.. క్షేత్రస్థాయిలో ఇళ్ల స్థలాలుగా మారినవి... వివాదాల్లోని ఉన్న వాటితో పాటు ప్రభుత్వ భూముల్లో పంటల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు

పంటల నమోదును గడువులోపు పూర్తిచేయాలని, కచ్చితత్వంతో సాగాలని కిందిస్థాయి సిబ్బందిపై సాంకేతిక నిఘా పెంచిన ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం గుర్తించడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటల నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని క్షేత్రస్థాయి సిబ్బంది కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.