ETV Bharat / city

Telangana CEO Shashank Goyal : 'వీవీప్యాట్ల తరలింపుపై నివేదిక ఇవ్వండి'

author img

By

Published : Nov 1, 2021, 8:01 AM IST

Telangana CEO Shashank Goyal
Telangana CEO Shashank Goyal

ఎంతో ఉత్కంఠగా రేకెత్తించిన హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad by poll 2021)లో వీవీప్యాట్ల తరలింపు సంచలనం రేపింది. వీవీప్యాట్లను అక్రమంగా తరలించారని వచ్చిన ఫిర్యాదుపై నివేదిక అందజేయాలని కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్(Telangana CEO Shashank Goyal) ఆదేశించారు. వీవీప్యాట్స్‌ను బస్సు నుంచి కారులోకి ఎందుకు తరలించారో, కారణాలేంటో అందులో స్పష్టం చేయాలన్నారు.

హుజూరాబాద్‌ ఉపఎన్నిక(Huzurabad by poll 2021) అనంతరం వీవీప్యాట్స్‌ తరలింపు విషయంలో వచ్చిన ఫిర్యాదులపై నివేదిక అందజేయాలని ఆదివారం కరీంనగర్‌ కలెక్టర్‌, నియోజకవర్గ ఎన్నికల అధికారులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌(Telangana CEO Shashank Goyal) ఆదేశించారు. వీవీప్యాట్స్‌ను బస్సు నుంచి కారులోకి ఎందుకు తరలించారో, కారణాలేంటో అందులో స్పష్టం చేయాలన్నారు.

అంతకు ముందు వీవీప్యాట్ల తరలింపు(VVPats manipulation)లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి ఆదివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వీవీప్యాట్లను తరలిస్తున్న బస్సులను జమ్మికుంట శివారులోని హోటల్‌ వద్ద నిలిపి, ప్యాట్లను కారులోకి మార్చినట్లు తమ దృష్టికి వచ్చిందని అందులో పేర్కొన్నారు.

వీవీప్యాట్‌లను అక్రమంగా తరలించారనే వార్తల నేపథ్యంలో సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులో గాంధీజీ విగ్రహం వద్ద భాజపా నేతలు మౌనదీక్ష నిర్వహించారు.‘వీవీ ప్యాట్లు పనిచేయకుంటే స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చాలి లేదా అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లకు విషయం చెప్పాలి.. ప్రైవేటు కార్లలో తరలించడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఆదివారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన ఈ మేరకు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ దర్శకత్వంలోనే ఈ దొంగాటకు తెరలేపారని ఆరోపించారు.

ఓట్ల లెక్కింపుపై సమీక్ష

మరోవైపు.. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపున(Huzurabad by poll counting 2021)కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశించారు. మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి కేంద్రంలో జరిపిన ఏర్పాట్లపై కరీంనగర్‌ కలెక్టర్‌, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శశాంక్‌ గోయల్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పటిష్ఠ భద్రతతో తరలించాం :

హుజూరాబాద్‌ ఉపఎన్నిక(Huzurabad by poll 2021) సందర్భంగా ఈవీఎంల తరలింపు విషయంలో పోలీసులు, అధికారులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ స్పష్టీకరించారు. ఉపఎన్నిక తర్వాత ఈవీఎంలను బస్సుల్లో తరలిస్తుండగా జమ్మికుంట ఫ్లైఓవర్‌ వద్ద ఓ బస్సు టైరు పంక్చరు కావడంతో మిగతావి ఆగిపోయాయని చెప్పారు. వీవీప్యాట్‌ను కారులో తీసుకెళ్లడాన్ని ఈవీఎంను ఆ వాహనంలోకి మార్చినట్లుగా వీడియో తీసి తప్పుదోవ పట్టించారని వివరించారు.

పోలీసులు విచారణ జరపగా అది సాంకేతిక లోపంతో పక్కన పెట్టిన వీవీప్యాట్‌ అని, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి అధికారుల ఆదేశాలతో దాన్ని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలకు తీసుకువచ్చినట్లు తేలిందని సీపీ స్పష్టం చేశారు. 306 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలను ప్రత్యేక భద్రత, జీపీఎస్‌ విధానంతో పర్యవేక్షిస్తూ కరీంనగర్‌కు తరలించామని పేర్కొన్నారు. ఈ అంశాలపై పలు పార్టీల నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. జమ్మికుంట, కరీంనగర్‌లో జరిగిన సంఘటనలపై సీసీ ఫుటేజీ సేకరించి ఎన్నికల అధికారికి సమర్పిస్తామని తెలిపారు.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్ట్‌ చేసిన వ్యక్తుల వివరాలు సేకరించి కేసు పెడతామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.