Kaleshwaram: కాళేశ్వరం నుంచి మూడో టీఎంసీ ఎత్తిపోతలకు భూసేకరణ

author img

By

Published : Jul 16, 2021, 5:28 AM IST

Kaleshwaram

కాళేశ్వరం ఎత్తిపోతల (Kaleshwaram Lift Irrigation) ద్వారా ఇప్పటికే రెండు టీఎంసీల నీటి ఎత్తిపోతల కొనసాగుతోంది. ప్రభుత్వం మూడో టీఎంసీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఐతే ఇప్పటికే ఇందుకు నిర్వాసితులు భూములిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు భూములు కోల్పోయిన రైతులు మూడోసారికి ససేమిరా అంటున్నారు. పరిహారం వ్యవహారం తేలిన తర్వాతే ఆలోచిస్తామని పట్టుబడుతున్నారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం (Kaleshwaram) ద్వారా మూడో టీఎంసీ ఎత్తిపోతలకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్​ఆర్​ఎస్పీ (SRSP) వరద కాలువకు సమాంతరంగా మరో కాలువ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం కరీంనగర్ జిల్లా రామడుగు, గంగాధర, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలాల్లోని భూములు సేకరించే ప్రక్రియ ప్రారంభం కావడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు భూములు కోల్పోయిన వారు ఇప్పుడు వారి భూములు, ఇళ్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.

ఎంత కోల్పోతే అంతే..

తమ భూములు ఇవ్వబోమని.... కాల్వను మరో చోటు నుంచి తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఒకవేళా ఇక్కడి నుంచే కాల్వ తీయాలనుకుంటే... భూమి ఎంత కోల్పోతే అంతే విస్తీర్ణంలో గ్రామ శివారులో స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టివ్వాలని కోరుతున్నారు. భూమికి భూమి ఇవ్వలేని పక్షంలో... 20ఏళ్ల తర్వాత ఆ భూములకు ఎంతైతే ధర ఉంటుందో అంచనా వేసి ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాళేశ్వరం నుంచి మూడో టీఎంసీ ఎత్తిపోతలకు భూసేకరణ.. భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్న స్థానికులు

నాడు ఆలోచించకుండా భూములిచ్చాం..

2004లో ఎస్​ఆర్​ఎస్పీ వరద కాల్వ కోసం భూసేకరణలో చాలా మంది నష్టపోయామని రైతులు అంటున్నారు. ఆనాడు ఈ ప్రాంతంలో సాగు నీరు అందక ఇబ్బంది పడుతున్న తరుణంలో పరిహారం కోసం పెద్దగా ఆలోచించకుండా భూములు ఇచ్చామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పరిహారం కోసం ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించాలని బాధితులు కంటతడి పెడుతున్నారు.

మేమెలా జీవించాలి..?

వరద కాల్వ కారణంగా పంటలు చేతికి వస్తున్నాయని, ఇప్పుడు మూడో టీఎంసీ అని భూములు సేకరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మేమెలా జీవించాలో ప్రభుత్వం సూచించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: RDS: ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టవద్దంటూ.. ఏపీ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.