ETV Bharat / city

‘ఆకాంక్ష’కు అంకితభావం తోడైతే .. రూ.3 కోట్ల టర్నోవర్ కాస్త 75 కోట్లు!

author img

By

Published : Jun 21, 2021, 3:54 PM IST

వ్యాపార కుటుంబమే అయినా దర్జాగా వెళ్లి సీఈవో కుర్చీలో కూర్చోలేదు.  ఆత్మ విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని కొత్త చోట నుంచీ మొదలు పెట్టింది. రూ.3 కోట్ల టర్నోవర్‌ ఉన్న కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని రూ.75 కోట్ల స్థాయికి తీసుకెళ్లింది. ఆమే ఆకాంక్ష భార్గవ. తనదైన రీతిలో వ్యాపారాన్ని వృద్ధి చేసిన ఆకాంక్ష అనుభవాలు తెలుసుకుందాం రండి...!

success story, pmr business
ఆకాంక్ష, పీఎంఆర్ బిజినెస్

ఆకాంక్ష భార్గవ… గుడ్‌గావ్‌లోని పీఎం రిలోకేషన్స్‌ సంస్థ సీఈవో. వ్యాపారంలోకి అడుగు పెట్టినప్పుడు తన దగ్గర 35 మంది ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తుతం 535 మంది. అప్పటి పీఎంఆర్‌ సంస్థ టర్నోవర్‌ 2.8 కోట్లు అయితే ఇప్పుడు రూ.75 కోట్లకు చేరింది. బెంగళూరుతో ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆకాంక్ష క్రమంగా 14 శాఖలకు విస్తరించింది. ఇంతకీ ఆమె ప్రయాణం ఎలా సాగింది? వ్యాపార మెళుకువలు ఏంటో ఆమె మాటల్లో తెలుసుకుందాం…

ఆకాంక్ష అమ్మానాన్నలు రాజీవ్‌ భార్గవ, అర్చన. స్వస్థలం కోల్‌కతా. దిల్లీలో చదువుకుంది. ముంబయిలో ఎంబీఎ చేసింది. ఆమె తండ్రి రాజీవ్‌ భార్గవ 1985లో కోల్‌కతాలో పీఎంఆర్‌ (ప్యాకింగ్‌ అండ్‌ మూవింగ్‌ రిలోకేషన్స్‌) సంస్థను నెలకొల్పారు. అంటే ఇంటిలోని సామగ్రిని ప్యాక్‌ చేసి, వేరే చోటకి తరలించడం అన్నమాట. 1992లో దిల్లీలో మరో శాఖను తెరిచారు. అమ్మానాన్న ఇద్దరూ వ్యాపారాన్ని చూసుకునే వారు.

వారేే స్ఫూర్తి

నాన్నతో సమానంగా అమ్మ కష్టపడటం, ఇద్దరూ ఒకరికొరు సాయం చేసుకోవడం చూసిన ఆకాంక్షకు చిన్నప్పట్నుంచే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారనే నమ్మకం ఉండేది. ఆ ధైర్యంతోనే డిగ్రీ పూర్తయ్యాక వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటానని తండ్రితో చెప్పింది.

అప్పటికి నాకు 21. వ్యాపారంలోకి అడుగు పెడతానంటే నాన్న వెన్నుతట్టారు. ఆయన స్ఫూర్తితో ఏప్రిల్‌ 30, 2007 బెంగళూర్‌లో బ్రాంచ్‌ ప్రారంభించాను. ఆయన నాతో 3 రోజులు బెంగళూరులోనే ఉన్నారు. అప్పుడు బిజినెస్‌ గురించి చెబుతారు అనుకున్నా... కానీ 10 డాక్యుమెంట్లు చేతిలో పెట్టి, ఇవి నీ పని పట్ల నిబద్ధతను గుర్తు చేస్తాయి. ఏం జరిగినా బెదరకు, అడుగు ముందుకు వెయ్యి అని దిల్లీ వెళ్లిపోయారు. మొదట్లో నేనూ వర్కర్లతో కలిసి షిఫ్టింగులు చేసేదాన్ని. ఒక్కోసారి అర్ధరాత్రుళ్లు పనులు ఉండేవి. తొమ్మిది నెలలు ఇంటికే వెళ్లలేదు. ఒకరోజు మా వర్కర్లలో ఒక వ్యక్తి ట్రక్‌ కింద పడి చనిపోయారు. అప్పుడు పెద్ద గొడవే జరిగింది. ఆ సమయంలో నాన్న ఇంటికి వచ్చేయ్‌. నేను చూసుకుంటా అన్నారు. లేదు ఇలాంటి సవాళ్లు ఎన్ని ఎదురైనా నిలబడతాను అని మాట ఇచ్చాను. 2007- 09 మధ్యలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయినా పట్టు వదల్లేదు. అప్పులు చేసి సిబ్బందికి జీతాలు ఇచ్చాను. మెల్లిగా వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నాను. బెంగళూరు తర్వాత హైదరాబాదులో బ్రాంచ్‌ ఓపెన్‌ చేశాను. బెంగళూర్‌, కోల్‌కతా, దిల్లీ, హైదరాబాద్‌ కలిపి మొత్తం 35 మంది ఉద్యోగులు ఉండేవారు. 2012లో అధికారికంగా సంస్థకు సీఈవో అయ్యాను. ఒడుదొడుకులు ఎదురైనా నమ్మకాన్ని కోల్పోలేదు. ధైర్యంగా నిలబడ్డాను. మగవాళ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే రంగమిది. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను.

-ఆకాంక్ష భార్గవ

హైదరాబాద్‌, పుణె, అహ్మదాబాద్‌, ముంబయి, చెన్నై, దిల్లీ, కలకత్తా ఇలా 14 బ్రాంచ్‌లను నెలకొల్పి 75 కోట్ల టర్నోవర్‌ను సాధించారు. దీన్ని రూ.100 కోట్లకు చేర్చడమే తన లక్ష్యమని ధీమాగా చెబుతున్నారీమె. పనిమీద శ్రద్ధ, అంకితభావం, ప్రేమ... ఉంటే విజయం సాధించగలమన్నది ఆకాంక్ష మాట!

ఇదీ చదవండి: parenting tips: చిన్నారుల వికాసానికి పంచసూత్రాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.