ETV Bharat / city

పైడితల్లి వేడుక.. ఉత్తరాంధ్రకు పండుగ

author img

By

Published : Oct 27, 2020, 7:33 AM IST

sirimanu utsavam
పైడితల్లి వేడుక.. ఉత్తరాంధ్రకు పండుగ

ఏపీలోని విజయనగరానికి దసరా వచ్చిందంటే చాలు పండగ వాతావరణం నెలకొంటుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పూజలందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబురాలు దసరా నుంచి ఆరంభమవుతాయి. దసరా మొదలుకుని పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబురం వరకు విజయనగరమంతా సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఏటా ఘనంగా జరుగుతుంది. విజయదశమి అనంతరం వచ్చే మంగళవారం నాడు జరిగే సిరిమానోత్సవానికి ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్​ఘడ్ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు.

ఏపీ విజయనగరం సంస్థానానికి చెందిన ఆడపడుచు పైడిమాంబే ప్రస్తుతం శ్రీ పైడితల్లి అమ్మవారిగా కొలవబడుతోందని ప్రతీక. 258 ఏళ్ల క్రితం విజయనగర సంస్థానంలో ఆడపడుచుగా జన్మించింది పైడిమాంబ. విజయనగరం సంస్థానానికి అప్పటి రాజు అయిన అన్న పెద విజయరామరాజు చెల్లెలే.. పైడిమాంబ. పైడిమాంబకు అన్నపెద విజయరామరాజు అంటే ఎంతో అభిమానం. పైడిమాంబ చిన్నతనం నుంచి దుర్గాదేవీ భక్తురాలు. బొబ్బిలి యుద్ధానికి వెళ్తున్న అన్న విజయరామరాజుకు విదేశీయుడైన బుస్సీ పన్నిన కుట్రను ముందుగా ఈమె తన అన్నకు తెలియజేసింది. తన అన్నయుద్దం చేయడం ఇష్టం లేని పైడిమాంబ.. అతన్ని వెళ్లనీయకుండా అడ్డుపడుతోంది. నువ్వు చేస్తున్న ఈ యుద్ధం ప్రజలకు క్షేమం కాదు. యుద్ధం వద్దని, చేస్తే మరణిస్తావని అన్నను బతిమిలాడింది.

విజయనగర సంస్థాన ఆడపడుచు

పైడిమాంబ చెప్పిన మాటలను పెడచెవిన పెట్టిన విజయరామరాజు.. బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపారాయుడి చేతిలో హత్యకు గురయ్యాడు. బొబ్బిలి యుద్ధంలో ఉన్న తన అన్న యోగక్షేమాలు తెలుసుకునేందుకు సంస్థానంలో పనిచేసే, పైడిమాంబ యోగక్షేమాలు చూసే, పతివాడ అప్పలనాయుడు అనే సన్నిహితుడి సహాయంతో స్వయంగా గుర్రపు బగ్గీపై కోట నుంచి పైడిమాంబ బయలుదేరింది. ప్రస్తుతం విజయనగరంలో ఉన్న రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకునేసరికి సోదరుడు విజయరామరాజు మరణవార్త పైడిమాంబకు తెలుస్తుంది. పైడిమాంబ అక్కడే స్పృహ కోల్పోతుంది. పైడితల్లితో ఉన్న అప్పలనాయుడు సపర్యలు చెేయగా ఆమెకు మెళకువ వస్తుంది. ఆ తర్వాత పైడిమాంబ తానిక బతకనని, దేవీలో ఐక్యం అవుతున్నానని చెప్పి మరణిస్తుంది.

పెద్ద చెరువులో విగ్రహం లభ్యం

తన విగ్రహాన్ని మహారాజ కోటకు ఎదురుగా ఉన్న పెద్దచెరువులో పశ్చిమ దిక్కున లభ్యమవుతుందని అప్పలనాయుడుకు కలలో కనిపించి చెప్పిందని.. చిరుప్రాయం నుంచే దేవీభక్తురాలైన పైడిమాంబ తర్వాత ఆ దేవీలో ఐక్యమైందని పూర్వీకుల కథనం. గజపతుల ఆత్మీయుడైన అప్పలనాయుడు కలలో కనిపించి తాను దేవతగా అవతరించానని, తన ప్రతిమ పెద్ద చెరువులో ఉందని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్టించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమయినట్టుగా ప్రచారం. స్వప్నంలో అమ్మవారి చెప్పినట్టుగా పతివాడ అప్పలనాయుడు గ్రామస్థులతో కలిసి పెద్ద చెరువులో వెతుకుతారు. జాలర్ల వలలో చిక్కుకుని విగ్రహం లభ్యమవుతుంది. ఆ విగ్రహాన్ని బయటకు తీసి పెద్ద చెరువు ఒడ్డునే ఆలయం నిర్మించి పూజలు చేశారు గ్రామస్థులు. ఇలా పైడిమాంబ పైడితల్లిగా అవతరించారని పెద్దలు చెబుతుంటారు. 1758వ సంవత్సరం అంటే దాదాపు 260 సంవత్సరాల చరిత్ర కలిగిన కోవెల, అంతటి చరిత్ర కలిగిన ఉత్సవాలు ఈ పైడిమాంబ సొంతం.

వనం గుడి నుంచి చదురుగుడికి

అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించిన పతివాడ అప్పలనాయుడు తొలి పూజారిగా పూజలు నిర్వహించారు. అప్పటినుంచి ఇప్పటివరకు అప్పలనాయుడు వారసులే అమ్మవారి పూజారులుగా కొనసాగుతున్నారు. ముందుగా అమ్మవారి ఉత్సవాలు వనం గుడి వద్ద నిర్వహించేవారు. ఇలా 166 సంవత్సరాలు అమ్మవారి ఉత్సవాలు జరిపారు. వనం గుడి దగ్గర భక్తులకు అసౌకర్యం కలుగుతుండటంతో ఊరి మధ్యలో అమ్మవారిని 1924లో మూడు లాంతర్ల జంక్షన్ సమీపంలో మరోక చదురుగుడిని నిర్మించారు.

వనం గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. పూర్వం ఆ ప్రాంతమంతా అడవి కావడంతో వనం గుడిగా పిలిచారు. ఈ గుడినే అమ్మవారి పుట్టినింటిగా కొలుస్తారు. ఇకపోతే ఊరిమధ్యలో నిర్మించిన చదురుగుడిని మెట్టినింటిగా భావిస్తుంటారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరుపక్కలా ఘటాలు ఉండటం విశేషం. ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దీని మొదలులో అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటూ ఉంటాడు.

దేవాదాయ శాఖ ఆధీనంలో

దీంతో అప్పటి నుంచి చదురు గుడి వద్దే ఆమ్మవారు ఉత్సవాలు జరుగుతాయి. ఇలా భక్త జన కోటితో పూజలందుకుంటున్న అమ్మవారిని ఆలయాన్ని 1951లో దేవాదాయ ధర్మాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి ప్రభుత్వమే అమ్మవారి ఉత్సవాలను జరుపుతుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ చేసి సుమారు నెల రోజుల పాటు అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ముందుగా ఉత్సవాల ప్రారంభానికి సూచికగా ప్రధాన రాటను ప్రతిష్టించడం, తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం, ఉయ్యాల కంబాల ఇలా అనేక కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు నిర్వహిస్తారు. ఆడపడుచులైతే అమ్మవారికి కరుణా కటాక్షాలు పొందేందుకు ప్రత్యేకించి ఘటాలను ఎత్తుకుంటారు. కలశాలతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

తోలేళ్ల ఉత్సవం

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ప్రధానంగా చెప్పుకునేవి తోలేళ్ల ఉత్సవం. పైడితల్లి జాతర సిరిమాను ఊరేగింపు జరగడానికి ముందు రోజు తోలేళ్ల ఉత్సవం నిర్వహిస్తారు. తోలేళ్ల ఉత్సవం రోజు ఉదయాన గజపతి రాజులు ఆడపడుచైన పైడితల్లి అమ్మవారికి అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సిరిమానోత్సవం ముందు రోజు రాత్రి చదురుగుడి దగ్గర నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాల నడుమ ఊరేగింపుగా కోటలోనికి తీసుకువస్తారు. కోటలోని రౌండ్ మహల్ దగ్గర పూజారికి బోనాలు సమర్పించి అమ్మవారి చరిత్రను స్తుతిస్తూ రాగయుక్తంగా పాటలను పాడుతారు. కోటలో పూజలందుకున్న ఘటాలను చదురుగుడి దగ్గరకు తరలిస్తారు. ఇక రాత్రి అమ్మవారి ఘటాలను కోటవద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ రెండు గంటలపాటు పూజలు నిర్వహిస్తారు.

భవిష్యవాణి

అనంతరం అక్కడ నుంచి పంచ లోహాలతో రెండు ఘటాలను, నాలుగు కంచు ఘటాలను అమ్మవారి గుడివద్దకు తీసుకువస్తారు. బోనాల ఉత్సవంలో విన్పించే భవిష్యవాణిలా కోటలో కూడా పైడిమాంబకు ప్రతిరూపంగా కొలిచే పూజారి భవిష్యవాణిని చెప్తారు. రాబోయే ఏడాది జరిగే మంచిచెడులను అమ్మ చెప్తోంది. వ్యవసాయ అభివృద్ధి, పాడి సంపద, ఉత్తరాంధ్ర అభివృద్ధి కళ్లకు కట్టినట్టు అమ్మ పలుకుతోంది. అలాగే ఉపద్రవాలు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంది. ఈ సందర్భంగా అమ్మవారి భవిష్యవాణిని వినేందుకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అమ్మవారి కథను భక్తులకు వినిపిస్తారు. అదేరోజు ఆలయ పూజారి రైతులకు విత్తనాలు పంచుతారు. తొలి ఏరు అన్నది వ్యవసాయానికి సంబంధించిన పదం. ఆరోజు అమ్మవారికి వ్యవసాయ విత్తనాలను చూపి వాటిని వేసి దున్నితే పంటలు బాగా పండుతాయని రైతుల ప్రగాఢ విశ్వాసం. సర్వమంగళ స్వరూపినిగా చెప్పుకొనే అమ్మవారు కరుణిస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం.

సిరిమానోత్సవం

పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో జరిగే ప్రధాన పండగ సిరిమానోత్సవం.. రాష్ట్రంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతున్నా విజయనగరం గ్రామ దేవత పండగకు ఓ విశిష్టత ఉంది. తోలేళ్ల ఉత్సవం జరిగిన మరుసటి రోజున సిరుమాను సంబరం జరుగుతుంది. పైడిమాంబ కోరిక మేరకు పతివాడ అప్పలనాయుడు వంశస్థులే వంశపారపర్యంగా పైడిమాంబకు పూజలు చేస్తున్నారు. ఏటా పతివాడ వంశస్తులు, సిరిమానును అధిరోహించే వారు ఎవరైతే వారి కలలోకి వచ్చి సిరిమాను ఏ ప్రదేశంలో ఉందో పైడిమాంబ చెబుతుందంటారు. అమ్మవారు ప్రధాన పూజారి కలలో చెప్పినట్లుగా ఎక్కడ ఉందో వెతికి నలభై అడుగుల చింత చెట్టు మానును సేకరించి పసుపు కుంకుమలతో పూజ చేసి అమ్మవారి ప్రతిరూపంగా భావించి, సిరిమానోత్సవం కోసం ఆ చెట్టును మొదలు నుంచి సేకరిస్తారు. అలా పూజలు చేసి సేకరించిన సిరుమానును విజయనగరంలోని హుకుంపేటకు తరలిస్తారు. అక్కడ సిరిమానును అధిరోహించే పూజారి కులస్థులు సిరిమాను రథాన్ని తయారుచేస్తారు. పూజారి కూర్చోవటానికి వీలుగా ఓ శిలను తయారు చేస్తారు. అలా తయారు చేసిన శిలలోనే సిరిమానోత్సవం రోజున ప్రధాన అర్చకులు ఆశీనులవుతారు. అలాగే ఇక్కడే అమ్మవారి పాలధార, జాలరి(బెస్త) వల, తెల్ల ఏనుగు అంబారీలు కూడా తయారవుతాయి. సిరిమాను ఊరేగింపులో భాగంగా 55 అడుగుల ఎత్తు ఉండే ఈ సిరిమానును ఎక్కడా మేకులు లేకుండా కేవలం ఇరుసులతో మాత్రమే ఏర్పాటు చేయడం ఓ విశేషం. ఈ తయారీ అంతా హుకుంపేటలో ఒక వేడుకలా చేస్తారు.

పూజారి ప్రాధాన్యం

పెద్దచెరువులో లభించిన పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని చెరువులో నుంచి తీసి విజయదశమి తర్వాత తొలి మంగళవారం నాడు వనం గుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అందువల్లే ప్రతీ ఏడాది విజయదశమి తర్వాతే వచ్చిన మంగళవారం రోజున ఈ సిరిమానోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాలలో సిరిమానోత్సవం రోజున పూజారి ప్రాధాన్యం ఆది నుంచి ఉంది. మొదట పూజారి ఆలయం వద్ద గల అమ్మవారికి పూజలు చేస్తారు. కొత్తవైన తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. పూసపాటి గజపతులు ఇచ్చిన కిరీటాన్ని ధరించి.. కుడిచేతిలో నిమ్మకాయలు, అక్షింతలు, ఎడమచేతిలో విసన కర్ర, బొడ్డులో కత్తి పట్టుకొని సిరిమానును అధిరోహిస్తాడు. ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించిన తరువాత అమ్మవారి ఆలయం నుంచి సిరిమాను ఉత్సవం ప్రారంభమవుతుంది. సిరిమానుకు ముందు పాలధార, జాలరి వల, తెల్ల ఏనుగు రథాలు కదులుతుంటాయి. ఇవన్నీ అమ్మవారి చరిత్రలో భాగంగా జరిగిన ఘట్టాలను అనుసరించి తయారైన వాహనాలే. వీటిని అనుసరిస్తూ సిరిమాను మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోట పూసపాటి రాజుల బురుజు వరకు మూడుసార్లు తిరుగుతుంది. దీంతో ప్రధాన ఘట్టం సిరిమాను సంబరం ముగుస్తుంది. సిరిమాను మూడు సార్లు తిరుగుతున్నప్పుడు పూజారికి భక్తులు నైవేద్యంగా అరటి పండ్లను మీదకు విసురుతారు. ఇలా సిరిమాను ఉత్సవం అత్యంత వైభవంగా ముగుస్తుంది.

ఇలా రెండు రోజులపాటు సాగే తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవ కార్యక్రమాలను కనులారా చూసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరిలివస్తారు. పక్క రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్​గడ్, మహారాష్ట్రల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తారు. విజయనగరం నుంచి వెళ్లి బయట స్థిరపడిన ఆడపడుచులూ, ఉద్యోగులు అందరూ ఈ పండుగ కోసమే విజయనగరం ప్రత్యేకించి రావడం, వెళ్లడం జరుగుతూ ఉంటుంది.

ఇవీచూడండి: లక్ష ఇళ్ల నిర్మాణం తుదిదశకు చేరుకుంది: మంత్రి కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.