ETV Bharat / city

'అబ్బాయిలు.. మొదట్లో నమ్మిస్తారు.. తర్వాత నరకం చూపిస్తారు'

author img

By

Published : Oct 17, 2020, 8:50 AM IST

'అబ్బాయిలతో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మొదట్లో వారు మనతో చాలా సున్నితంగా ఉండి నమ్మిస్తారు... తర్వాత ముసుగులు తొలగిస్తారు'. విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో బలైన యువతి చెప్పిన మాటలివి. గతంలో అత్యంత ఆవేదనతో చెబుతున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేయగా... వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

urder-victim-instagram-posts-were-released
విజయవాడలో యువతి హత్య

‘‘అమ్మాయిలూ.. అబ్బాయిలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మొదట్లో వారు మనతో చాలా సున్నితంగా ఉండి నమ్మిస్తారు. తర్వాత ముసుగులు తొలగిస్తారు. వారి సైకోయిజాన్ని, విలనిజాన్ని బయటపెడతారు. ప్రతి ఒక అమ్మాయి ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రెండున్నరేళ్ల కిందట వరకూ నేనూ ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అతనిలో తీవ్రస్థాయిలో విలనిజం, సైకోయిజం గుర్తించాను. ఆ బంధానికి స్వస్తి పలికి నా కెరీర్‌పై దృష్టిసారించాను. అది మొదలు అతడి నుంచి నాకు బెదిరింపు కాల్స్‌, సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.’’ అంటూ ప్రేమోన్మాది చేతిలో బలైన ఇంజినీరింగ్‌ విద్యార్థిని (బాధితురాలు) గతంలో అత్యంత ఆవేదనతో చెబుతున్న వీడియోలు వెలుగుచూశాయి. వాటిని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఇంతకు ముందు పోస్టుచేయగా... పోలీసులు గుర్తించారు. ఆమె ఈ వీడియోల్లో ఎవరి పేరూ ప్రస్తావించకపోయినా నిందితుడైన నాగేంద్రబాబు అలియాస్‌ చిన్నస్వామిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తనలా మరో అమ్మాయి ఉన్మాదుల బారిన పడకుండా ఉండాలనే సంకల్పంతో చేసిన వీడియోలో ఆమె ఆవేదన ప్రతి ఒకర్నీ కంటతడి పెట్టించేలా, అమ్మాయిల్ని మేల్కొలిపేలా ఉంది. వీడియోల్లో బాధితురాలు ఏమన్నారో ఆమె మాటల్లోనే..

అభద్రతాభావంతోనే ఫిర్యాదు చేయలేదు

‘‘నాపై అతను చేస్తున్న దుష్ప్రచారంలోని విషయాలన్నీ నా దృష్టికి, మా కుటుంబసభ్యుల దృష్టికి వచ్చాయి. వారు నాకు అండగా నిలిచి, నేను ధైర్యంగా అడుగులేసేందుకు ప్రోత్సహించారు. దీంతో ఆ నరకం నుంచి తొందరగానే బయటపడ్డాను. అయితే అమ్మాయిగా నాకు కొంత అభద్రతాభావం ఉంది. అతడి నుంచి నా కుటుంబసభ్యులకు ఏమైనా ముప్పు ఉంటుందేమోనన్న ఆందోళన ఉంది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బెదిరింపులు తీవ్రమైతే మాత్రం కచ్చితంగా ఫిర్యాదు చేస్తా. మా అన్నయ్య కూడా డిపార్ట్‌మెంట్‌లోనే ఉన్నాడు. నా స్నేహితుల్లోనే ఎవరో ఒకరు అతనికి సహకరిస్తున్నారు. నా పరిస్థితుల్లో వారే ఉంటే ఏం చేస్తారో ఆలోచించుకోవాలి.
నన్ను ఇంజినీరింగ్‌ నుంచి డ్రాపువట్‌ చేయించాలని చూశాడు. నేను నోరు మూసుకుని పడి ఉండేలా చేయాలనుకున్నాడు. నా కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. వాటన్నింటినీ నేను బలంగా ఎదుర్కొని బయటకు రాగలిగాను. ఇది నా తొలి అడుగు.

ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేసినా..

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి నాకు అతని నుంచి బెదిరింపు కాల్స్‌, సందేశాలు వెల్లువెత్తాయి. అతని నంబర్‌ను బ్లాక్‌ చేశాను. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్‌ చేయటం మొదలుపెట్టాడు. ఇలా 17 నంబర్లు మార్చి కాల్స్‌ చేసి బెదిరించాడు. నేను అమ్మాయిని కాబట్టి దుష్ప్రచారం చేస్తే భయపడి ఊరుకుంటానని అనుకుంటున్నట్లున్నాడు. నేను ధైర్యంగా ఎదుర్కొంటాను.’’

ఏడు రోజుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేస్తాం: డీజీపీ

విజయవాడ యువతి హత్య ఘటనలో ఏడు రోజుల వ్యవధిలో అభియోగపత్రాలు దాఖలు చేస్తామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. ఇలాంటి ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కృష్ణమ్మ ఉగ్రరూపం.. నిండా మునిగిన లంక గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.