ETV Bharat / city

KRMB-GRMB: కృష్ణా, గోదావరి బోర్డుల నోటిఫికేషన్లలో సవరణలు

author img

By

Published : Apr 3, 2022, 7:21 AM IST

KRMB-GRMB: కేంద్ర జల్‌శక్తి శాఖ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య మండళ్ల జ్యురిస్‌డిక్షన్‌ నోటిఫికేషన్లకు స్వల్ప సవరణలు చేసింది. ఆ నోటిఫికేషన్లు విడుదలైన 60 రోజుల్లోపు ఒక్కో రాష్ట్రం ఒక్కో నదీ యాజమాన్య మండలి నిర్వహణ కోసం రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్‌ చేయాలని షరతు విధించిన కేంద్రం.. ఇప్పుడు ఆ గడువును మరోసారి పొడిగించింది. ఆ లోపు అనుమతులు తీసుకోకపోతే అలాంటి ప్రాజెక్టుల నిర్వహణను నిలిపేస్తామని పేర్కొంది.

River management board
River management board

KRMB-GRMB: కేంద్ర జల్‌శక్తి శాఖ గత ఏడాది జులై 15న జారీ చేసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య మండళ్ల జ్యురిస్‌డిక్షన్‌ నోటిఫికేషన్లకు స్వల్ప సవరణలు చేసింది. ఆ నోటిఫికేషన్లు విడుదలైన 60 రోజుల్లోపు ఒక్కో రాష్ట్రం ఒక్కో నదీ యాజమాన్య మండలి నిర్వహణ కోసం రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్‌ చేయాలని షరతు విధించిన కేంద్రం.. ఇప్పుడు ఆ గడువును ఏడాదికి పొడిగించింది. రెండు నదీపరీవాహక ప్రాంతాల్లో ఉన్న అనుమతి లేని ప్రాజెక్టుల గురించి ఆరు నెలల్లోపు కేంద్ర జల్‌శక్తిశాఖకు నివేదించి నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాలని గతంలో ప్రభుత్వం చెప్పింది. తాజాగా ఈ గడువునూ సంవత్సరానికి పెంచింది. ఆ లోపు అనుమతులు తీసుకోకపోతే అలాంటి ప్రాజెక్టుల నిర్వహణను నిలిపేస్తామని పేర్కొంది.

గతంలోనే స్పందించని రాష్ట్రాలు

  • కేంద్ర జల్‌శక్తి శాఖ తొలుత చెప్పిన ప్రకారం గత ఏడాది సెప్టెంబరు 15లోగా తెలంగాణ రూ.400 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ రూ.400 కోట్ల చొప్పున రెండు బోర్డులకు డిపాజిట్‌ చేయాల్సి ఉంది. తాజా సవరణ ప్రకారం వచ్చే జులై 15లోగా ఇవ్వవచ్చు. గతంలోనే రెండు రాష్ట్రాలు దీనికి సానుకూలంగా స్పందించలేదు. బోర్డుల నిర్వహణకు ఎంత అవసరమో నిర్ణయించి దానికి తగ్గట్టుగా విడుదల చేస్తే సరిపోతుందని పేర్కొన్నాయి. అసలు ఇంత భారీ మొత్తం అవసరమని ఏ ప్రాతిపదికన అంచనాకు వచ్చారో కూడా చెప్పాలని కోరాయి. నోటిఫికేషన్‌ ప్రకారం డిపాజిట్‌ చేయాలని బోర్డులు, కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ పలుసార్లు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం సవరణ చేసింది. ఇది కూడా ఆచరణలో సాధ్యమయ్యేది కాదని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
  • గతంలో జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం 2022 జనవరి 15 లోగా అనుమతి లేని ప్రాజెక్టులకు కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాలి. లేదంటే నిర్మాణంలో ఉన్నా పనులు నిలిపివేయాలి. దీని గడువును ఆరునెలల నుంచి ఏడాదికి మారుస్తూ సవరణ జారీ చేసింది. అంటే ఈ ఏడాది జులై 15లోగా అనుమతులు పొందాలి. దీనికి మరో మూడున్నర నెలలు మాత్రమే మిగిలి ఉంది.
  • గోదావరి బేసిన్‌లో తెలంగాణ ఆరు ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను(డీపీఆర్‌) అందజేసింది. దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలు తప్ప ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాళేశ్వరం అదనపు టీఎంసీతో సహా పలు ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను గమనిస్తే తాజా గడువు ప్రకారం కూడా అనుమతులు లభించే అవకాశం లేదు.
  • ఆంధ్రప్రదేశ్‌ రెండింటి డీపీఆర్‌లు సమర్పించినా అడుగు ముందుకు పడలేదు. కృష్ణా బేసిన్‌లో నీటి వాటా ఎవరికి ఎంత అనేది తేలితే తప్ప అనుమతుల ప్రక్రియను చేపట్టడానికే అవకాశం లేదు. ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు డీపీఆర్‌ అనుమతి కోసం వెళ్లలేదు. నీటి లభ్యత లేకుండా సాధ్యం కాదు కూడా. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై విచారణ జరుపుతోన్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చిన తర్వాతనే రెండు రాష్ట్రాలు అనుమతుల ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది. ఎన్జీటీ ఆదేశాలతో కృష్ణాబేసిన్‌లో రెండు రాష్ట్రాలు కొన్ని ప్రాజెక్టుల పనులను నిలిపివేయడం తప్ప కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. వచ్చే జులై 15లోగా అమలుకు నోచుకొనే అవకాశం కనిపించడం లేదు.

ఇదీ చదవండి:విత్తన పంచాయితీ... రెండేళ్లుగా రైతన్నల నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.