ETV Bharat / city

మునుగోడు నియోజకవర్గంలో తెరాస జోరు.. ప్రచార హోరు..!!

author img

By

Published : Oct 12, 2022, 8:02 PM IST

TRS Campaign in Munugode: మునుగోడు నియోజకవర్గంలో తెరాస ఊరూవాడ జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. నియోజకవర్గంలోనే మకాం వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు... కారు గుర్తుకే ఓటువేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గడపగడపకూ తిరుగుతూ తెరాసతోనే అభివృద్ధి సాధ్యమంటూ ఓటర్లకు చెబుతున్నారు.

TRS Campaign in Munugode
TRS Campaign in Munugode

మునుగోడు నియోజకవర్గంలో తెరాస జోరు.. ప్రచార హోరు..

TRS Campaign in Munugode: మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా గులాబీపార్టీ జోరుగా ప్రచారం కొనసాగిస్తోంది. భాజపా, కాంగ్రెస్‌పై తీవ్రవిమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ ట్విట్టర్‌ వేదికగా కమలనాథులకు ప్రశ్నలు సంధించారు. కేంద్రప్రభుత్వం నల్గొండ జిల్లాకు 18వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తే మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస పోటీ నుంచి తప్పుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు కేటాయించమని నీతిఆయోగ్‌ సిఫార్సు చేస్తే పట్టించుకోని కేంద్రం... రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇచ్చిందని ఆరోపించారు. గుజరాత్‌కేమో 5నెలల్లో 80వేల కోట్ల ప్యాకేజీలు, తెలంగాణకు కనీసం 18వేల కోట్లు ఇవ్వలేరా? అని కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం మేరకు... మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మునుగోడు నియోజకవర్గాన్నిచుట్టేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తెరాస ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చండూరులో వివిధ వార్డుల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. నియోజకవర్గానికి రాజగోపాల్‌రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. చౌటుప్పల్ పరిధి లింగోజిగూడెంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లిలో తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

నాంపల్లి మండలంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మందాపురం గ్రామంలో మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ నృత్యం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపానే బలవంతంగా మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చిందని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ఉపఎన్నికల్లో డబ్బును వెదజల్లుతోందని మండిపడ్డారు. తెరాస ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు అనుబంధ విభాగాలు ఊరూరా తిరుగుతూ విస్తృతం ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.