ETV Bharat / city

'కాంగ్రెస్‌ పిలుపునిస్తే... తెరాస, ఎంఐఎం దాడి చేశాయా?'

author img

By

Published : Jun 18, 2022, 1:13 PM IST

Revanthreddy on Agnipath: కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే.. యువకులు బలవుతున్నారని... పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అన్నివిధాలా ఆలోచించి చర్చించి తీసుకురావాల్సిన అగ్నిపథ్‌ సర్వీసును... కేంద్రం హడావిడిగా తీసుకొచ్చిందని అన్నారు. సైనికులను నాలుగేళ్ల తాత్కాలిక ప్రాతిపదికన నియమించడం దారుణమన్న రేవంత్‌రెడ్డి... కేంద్ర సర్కార్‌ అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Revanthreddy
Revanthreddy

Revanthreddy on Agnipath: అన్నివిధాలా ఆలోచించి, చర్చించి తీసుకురావాల్సిన అగ్నిపథ్‌ సర్వీసును కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే యువకులు బలవుతున్నారని ఆయన ఆరోపించారు. సైనికులను నాలుగేళ్ల ప్రాతిపదికన నియమించడం దారుణమన్న రేవంత్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

చట్టాలు చేసిన తర్వాత పార్లమెంట్‌లోకా?.. సైన్యంలో చేరికలను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా చేపట్టడాన్ని దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అందులో భాగమే నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటన అని చెప్పారు. అగ్నిపథ్‌పై దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమన్నారు. రైతులు దేశానికి వెన్నెముక అని.. సైనికులు దేశ రక్షణ అనే గొప్ప సందేశాన్ని కాంగ్రెస్‌ ఇచ్చిందని రేవంత్‌ గుర్తు చేశారు. పార్లమెంట్‌లో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలను.. చట్టాలు చేసిన తర్వాత పార్లమెంట్‌లోకి తీసుకొస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకొని.. పరీక్షలకు సిద్ధమైన యువకుల పట్ల మోదీ ప్రభుత్వం నిరంకుశత్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ పిలుపునిస్తే ఆ పార్టీలు దాడి చేశాయా?.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘర్షణలో ఒకరు చనిపోవడంతో పాటు ఐదుగురికి గాయాలయ్యాయని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధితులను పరామర్శించకుండా అమిత్‌షా దగ్గరకు వెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలోనే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అల్లర్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పిలుపునిస్తే తెరాస, ఎంఐఎం దాడి చేశాయా? అని నిలదీశారు. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భమా అని ప్రశ్నించారు. వారణాసిలో కూడా దాడులు జరిగాయని.. అక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్‌ చేయించిందా? అని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:సికింద్రాబాద్ 'అగ్నిపథ్‌' అల్లర్ల సూత్రధారి అరెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.