ETV Bharat / city

Jagga Reddy: 'వ్యక్తిగతంగా ఏ అభిప్రాయమున్నా పార్టీ నిర్ణయం మేరకే పనిచేస్తా'

author img

By

Published : Jul 6, 2021, 8:06 PM IST

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy)ని టీపీసీసీ నూతనాధ్యక్షుడు రేవంత్​రెడ్డి(TPCC chief Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. రేపటి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. "పోటీలో ఉన్నప్పుడు వేరు.. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నాక వేరు" అని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. రేవంత్​కు అన్ని విషయాల్లో పూర్తిగా సహాకరిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

tpcc chief revanth reddy met sangareddy mla jagga reddy in his house
tpcc chief revanth reddy met sangareddy mla jagga reddy in his house

'వ్యక్తిగతంగా ఏ అభిప్రాయమున్నా పార్టీ నిర్ణయం మేరకే పనిచేస్తా'

వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలున్నా.. పార్టీ అధిష్ఠానం ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడే పనిచేస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) తెలిపారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్​రెడ్డికి (TPCC chief Revanth Reddy) తన పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన రేవంత్​రెడ్డి.. రేపటి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.

మా ఇద్దరి మధ్య ఏం లేదు...

"రాజకీయాలకు అతీతంగా జగ్గారెడ్డి నాకు మిత్రుడు. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు అందరం కలిసి కృషి చేస్తాం. పార్టీలో రేవంత్​కు, జగ్గారెడ్డికి మధ్యలో ఏదో కొట్లాట ఉందని చాలా మంది అపోహపడుతున్నారు. అదంతా ఏమీ లేదు. కాంగ్రెస్​లో నేతల మధ్య మనస్పర్ధలొస్తే.. దాన్ని పట్టుకుని లబ్ధి పొందాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అలాంటి వాటికి కాంగ్రెస్​లో స్థానం లేదు. అందరం పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు కలిసికట్టుగా పనిచేస్తాం. సీనియర్లందరినీ కలుపుకొని... సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతాం. తెరాస ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎలాంటి మేలు జరగలేదు. అందరం కూర్చొని పార్టీలో చర్చించి... నిరుద్యోగ సమస్యపై వీలైనంత త్వరగా కార్యాచరణ ప్రకటిస్తాం."

- రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ముందు వేరు... తర్వాత వేరు...

"నిమామకం ముందు వరకు ఎన్ని పోటీలు ఉన్నా.. తర్వాత మాత్రం పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటాం. గతంలో జరిగిన అన్ని పరిస్థితులను మరచిపోయి.. ప్రజల తరఫున పని చేస్తాం. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు నూతన అధ్యక్షునిగా ఎంపికైన రేవంత్​రెడ్డికి శుభాకాంక్షలు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలా అయితే సహకరించామో.. రేవంత్​కు కూడా అలాగే సహకరిస్తా. నిరుద్యోగ సమస్యపై కార్యాచరణ చేపట్టాలని రేవంత్​కు చెప్పాను. తెరాస, భాజపా రాత్రి కలుస్తాయి.. పగలు కొట్లాడుతాయి. ఇక ఇప్పటి నుంచి మా దాడి.. తెరాస, భాజపాలపై ఉంటుంది. అది కూడా రేవంత్​రెడ్డి నాయకత్వంలోనే ఉండనుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రేపటి కార్యక్రామానికి నేను హాజరవుతున్నాను."

- జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే.

పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డికి అన్ని విధాలా తన సహకారం ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రేవంత్​ నాయకత్వంలో పార్టీ కార్యచరణకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయనుకుని... వాటిని వాడుకుని లబ్ధి పొందాలని చూసేవాళ్లు.. అలాంటి అపోహలను తీసేయాలని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Revanth Reddy : 'జోడెద్దుల్లా పనిచేసి.. పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.