ETV Bharat / city

Telangana News Today : టాప్‌న్యూస్‌ @ 7AM

author img

By

Published : Jun 28, 2022, 6:59 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

  • నేడు రాజ్‌భవన్‌కు కేసీఆర్‌?

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

  • నేడు టీహబ్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

అందమైన రంగుల రంగుల భవనం... చూడగానే ముచ్చటేస్తుంది. ఇదేదో అమెరికాలో ఉందనుకుంటే మనం పొరపడినట్లే.. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌ భవనం. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు.

  • నేడు ఇంటర్ పరీక్ష ఫలితాలు

ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు వెల్లడించనున్నారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్​ బోర్డు కార్యదర్శి జలీల్​ గతంలోనే ప్రకటించారు.

  • నేటి నుంచి ఖాతాల్లో రైతుబంధు సాయం

నేటి నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 68లక్షల 94వేల మంది రైతుల కోటీ 51 లక్షల 11 వేల ఎకరాలకు సంబంధించి 7వేల654 కోట్ల రూపాయలు అందజేయనున్నారు. తొలి రోజు ఎకరాలోపు పొలం ఉన్న 19లక్షల 98వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 586 కోట్లు జమకానున్నాయి. గతంలో మాదిరిగానే రోజుకో ఎకరా చొప్పున పెంచుతూ 10రోజుల పాటు పంపిణీ ప్రక్రియ కొనసాగించనున్నారు.

తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే అమ్మకాల్లో రెండున్నర రెట్ల వృద్ధి నమోదవగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో ఆరు లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూమి నమ్మకమైన పెట్టుబడిగా మారడం, రాబడులు ఆశాజనకంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • వాళ్లు రెబల్స్‌ కాదు... ద్రోహులు

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరలేపిన శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలపై శివసేన యువనేత, మంత్రి ఆదిత్యఠాక్రే మరోసారి విరుచుకుపడ్డారు. వాళ్లు రెబల్స్‌ కాదు.. ద్రోహులు అని ఆయన ఆరోపించారు. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం చేసిన తప్పేంటో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని రెబల్‌ ఎమ్మెల్యేలకు ఆయన సవాల్‌ విసిరారు.

  • యువతనేమో అగ్నివీరులు.. మీ స్నేహితులనేమో దౌలత్‌వీరులా?

కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై విమర్శలు కొనసాగుతున్నాయి. యువతనేమో అగ్నివీరులుగా మార్చుతూ.. మీ స్నేహితులనేమో ధనవంతులుగా మార్చుతున్నారా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అగ్నిపథ్ పథకం కింద ఉద్యోగంలోకి తీసుకున్న యువత పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలని పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

  • 50 దేశాలకు పాకిన మంకీపాక్స్‌

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ వ్యాప్తిని ప్రస్తుతానికి అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ణయించింది. అయితే, రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధి 50 దేశాలకు వ్యాపించడం ఆందోళనకర అంశమేనని స్పష్టం చేసింది.

  • అత్యుత్తమ ఫామ్​లో స్టార్​ ప్లేయర్స్

2018లో జరిగిన కామన్​వెల్త్​ క్రీడల్లో సత్తా చాటిన భారత్​.. వచ్చే నెల 28న ప్రారంభం కానున్న పోటీలకు సమాయత్తమవుతోంది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా ఈ సారి కామన్​వెల్త్​ పోటీలు జరగనున్నాయి. అందరి కళ్లు తమ కెరీర్​లో అత్యుత్తమ ఫామ్​లో ఉన్న ఈ ఐదుగురు ఆటగాళ్లపైనే ఉన్నాయి. ఇంతకీ ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.