ETV Bharat / bharat

'వాళ్లు రెబల్స్‌ కాదు... ద్రోహులు ఎప్పటికీ గెలవలేరు'

author img

By

Published : Jun 28, 2022, 3:05 AM IST

Aaditya Thackeray
Aaditya Thackeray

Maharashtra Crisis News:మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరలేపిన శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలపై శివసేన యువనేత, మంత్రి ఆదిత్యఠాక్రే మరోసారి విరుచుకుపడ్డారు. వాళ్లు రెబల్స్‌ కాదు.. ద్రోహులు అని ఆయన ఆరోపించారు. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం చేసిన తప్పేంటో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని రెబల్‌ ఎమ్మెల్యేలకు ఆయన సవాల్‌ విసిరారు.

Maharashtra Crisis News: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన తారస్థాయికి చేరిన నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్యఠాక్రే మరోసారి విరుచుకుపడ్డారు. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం చేసిన తప్పేంటో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని రెబల్‌ ఎమ్మెల్యేలకు ఆయన సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఓ జాతీయ వార్త సంస్థతో ఆయన మాట్లాడారు.

‘‘వాళ్లు రెబల్స్‌ కాదు.. ద్రోహులు. ఇక్కడి నుంచి పారిపోయి వాళ్లంతట వాళ్లే రెబల్‌ అని అనుకుంటున్నారు. తిరుగుబాటు చేయాలనుకుంటే ఇక్కడే ఉండి చేయాల్సింది. ఇలాంటి వారు ఎప్పటికీ గెలవలేరు. మాకు అందరి మద్ధతు ఉంది. మేం గెలుస్తామన్న నమ్మకం ఉంది’’ అని ఆదిత్య ఠాక్రే అన్నారు. ‘మహా’ రాజకీయ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జులై 11 వరకు రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రెబల్‌ నేతల అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే, ఈ విషయాలను ఆదిత్య ఠాక్రే నేరుగా ప్రస్తావించకుండా.. అసెంబ్లీలో జరిగే విశ్వాస తీర్మానంలో గెలుస్తామన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. బల పరీక్ష కంటే ముందు నైతిక పరీక్ష జరగాలన్నారు. ఆ సమయంలో.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తన ముందు కూర్చొని, కళ్లలోకి చూస్తూ.. ప్రభుత్వం, శివసేన ఏం తప్పు చేసిందో చెబుతారని అన్నారు. మరోవైపు మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ పంపిన నోటీసులపైనా ఆదిత్య ఠాక్రే స్పందించారు. ‘‘ఇది రాజకీయం కాదు.. ఇప్పుడు ఇదొక సర్కస్‌లా మారింది’’ అని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.