ETV Bharat / city

Kodandaram: 'ఇది ఆరంభం మాత్రమే.. రానున్న రోజుల్లో పల్లెపల్లెకు తిరిగి ప్రజల్లోకి..'

author img

By

Published : Jul 29, 2021, 12:10 PM IST

Updated : Jul 29, 2021, 12:44 PM IST

పెరిగిన చమురు ధరలను నిరసిస్తూ తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనున్న దీక్షకు.. పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సత్యాగ్రహ దీక్ష ఆరంభమేనని.. రానున్న రోజుల్లో పల్లెపల్లెకు తిరిగి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.

tjs leader kodandaram started satyagraha deeksha in nampally
tjs leader kodandaram started satyagraha deeksha in nampally

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం.. సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ హైదరాబాద్​ నాంపల్లిలోని తెజస కార్యాలయంలో కోదండరాం సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. హైదరాబాద్​తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో ఉన్న తెజస శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇది ఆరంభం మాత్రమే..

"మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు నిర్ణయం కావడం లేదు. క్రూడాయిల్ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం అబద్దాలు చెబుతోంది. ప్రభుత్వాలు చెబుతున్న మాయమాటలను నమ్మడానికి మేం సిద్ధంగా లేం. పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గుతాయి. అలా చేయకుండా.. ప్రభుత్వం సామాన్యుని నడ్డి విరుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. లేకపోతే రాజీనామా చేయండి. 50 రూపాయలకే పెట్రోల్, డీజిల్​ను మేం ఇచ్చి చూపిస్తాం. ఈ సత్యాగ్రహ దీక్ష ఆరంభం మాత్రమే. పల్లె పల్లెకు తిరిగి ప్రజలకు ధరల పెరుగుదలపై వాస్తవాలు వివరిస్తాం"- కోదండరాం, తెజస అధ్యక్షుడు

ఇటీవలి కాలంలో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ ధరలు గణనీయంగా పెంచాయి. పెరిగిన ధరలను నిరసిస్తూ... కొద్ది రోజులుగా విపక్షాలు ఆందోళనలు ప్రదర్శిస్తున్నాయి. అటు దిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో విపక్షాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. గత నెలలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​... పెద్ద ఎత్తున చలో రాజ్​భవన్​ కార్యక్రమాన్ని నిర్వహించింది.

కరోనా కష్టకాలంలో ఉన్న సామాన్యునిపై ధరల భారం మోపి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేరుకోలేని దెబ్బ కొడుతున్నాయని విపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ప్రజల జీవన విధానాన్ని మళ్లీ వెనక్కి నెట్టే చర్యలను ప్రభుత్వాలు మానుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని.. లేకపోతే ప్రజా వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 29, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.