ETV Bharat / city

నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసు.. నిందితులకు జులై 8 వరకు రిమాండ్

author img

By

Published : Jun 24, 2022, 4:46 PM IST

Updated : Jun 24, 2022, 7:12 PM IST

ఎన్ఐఏ
ఎన్ఐఏ

NIA : నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన ముగ్గురిని నేడు విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో హాజరుపరిచారు. జూలై 8 వరకు కోర్టు రిమాండ్​ విధించింది. తమ కుమార్తెను అపహరించి మావోయిస్టులలో కలిపారంటూ ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్ఐఏ రంగంలోకి దిగి... గురువారం ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను హైదరాబాద్​లో అరెస్ట్ చేసింది.

NIA : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ).. హైదరాబాద్​లో అరెస్టు చేసిన ముగ్గురిని విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో హాజరుపరిచారు.నిందితులకు జులై 8 వరకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులను రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేసింది. నర్సింగ్‌ విద్యార్ధినిగా ఉన్న తమ కుమార్తె రాధను కొందరు కుట్రపూరితంగా మావోయిస్టు ఉద్యమంలోకి పంపారంటూ హైదరాబాద్‌ కాప్రాకు చెందిన పల్లెపాటి పోచమ్మ గత జనవరిలో విశాఖపట్నం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పెదబయలు పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తున్న తమ కుమార్తెను చైతన్య మహిళా సంఘానికి చెందిన దొంగరి దేవేంద్ర, దుబాసీ స్వప్న, చుక్క శిల్ప తదితరులు తరచూ కలుస్తూ ఉండేవారని.. మావోయిస్టు భావజాలం ఒంట బట్టించారని పోచమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

2017 డిసెంబరులో దేవేంద్ర ఎవరికో వైద్యం చేయాలంటూ రాధను తీసుకెళ్లారని.. అప్పటినుంచి తిరిగి ఆమె రాలేదని ఫిర్యాదు చేశారు. ఆమె మావోయిస్టులతో కలిసి విశాఖ జిల్లా పెదబయలు అడవుల్లో పని చేస్తున్నట్లు తొమ్మిది నెలల తర్వాత తెలిసిందని రాధ తల్లి తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ప్రాథమిక విచారణ అనంతరం పెదబయలు పోలీసులు కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు.

ఈనెల మూడో తేదీన ఎన్ఐఏ హైదరాబాద్‌ విభాగం దీనిపై మరో కేసు నమోదు చేసింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, మావోయిస్టు నాయకురాలు అరుణతోపాటు చైతన్య మహిళా సంఘానికి చెందిన దేవేంద్ర, స్వప్న, శిల్పలను నిందితులుగా పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌కు చెందిన శిల్ప హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆమెతోపాటు ఘటకేసర్‌ మండలం పర్వతపూర్‌కు చెందిన దేవేంద్ర, మెదక్‌ జిల్లా చేగుంట, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన స్వప్న నివాసాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు చేసి.. ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రజల కోసం చేస్తోన్న ఉద్యమాలను అణచివేస్తున్నారని దేవేంద్ర, శిల్ప ఆరోపించారు. అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ.. వారు ఎన్ఐఏ కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో వ్యాఖ్యానించారు.


ఇదీ చదవండి: ప్రజ్వల పునరావాస కేంద్రం ఎదుట ఆందోళనకు దిగిన మహిళలు

అంధవిశ్వాసం.. గుడిలో నాలుక కోసేసుకున్న భక్తురాలు

Last Updated :Jun 24, 2022, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.