ETV Bharat / city

ts ministers on agnipath: 'దేశభద్రత అనేది షార్ట్ టర్మ్ కోర్సు కాదు'

author img

By

Published : Jun 17, 2022, 5:34 PM IST

TS Ministers on Agnipath: సైనిక బలగాల నియామకం విషయంలో కేంద్రం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌ స్కీం లోపభూయిష్టంగా ఉందని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. ఇవాళ్టి ఆందోళనలో చనిపోయిన, గాయపడ్డ కుటుంబాలకు కేంద్రమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ తన అనాలోచిత నిర్ణయాలతో మొన్న రైతులను.. నేడు యువకులను రోడ్డున పడేశారని మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్​ గౌడ్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.

TS Ministers on Agnipath
TS Ministers on Agnipath

TS Ministers on Agnipath: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసన తెలుపుతున్న యువతపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించడం, కొందరు గాయపడడం బాధాకరమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మృతుని కుటుంబానికి, గాయపడిన కుటుంబాలకు కేంద్రం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయమని వ్యాఖ్యానించారు. 46 వేల మంది 90 రోజుల్లో నియామకం, కేవలం 30 వేల రూపాయల జీతం అర్థం లేనిదని, దేశ భద్రత విషయంలో ఇంత అనాలోచిత నిర్ణయం అవివేకం అని ఆక్షేపించారు. కేంద్ర నిర్ణయంపై యువత ఆగ్రహిస్తే తెరాసపై ఆరోపణలు చేయడం తగదని సూచించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ గొడవలు జరుగుతున్నాయని అక్కడ ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించారు.

'దేశభద్రత అనేది షార్ట్ టర్మ్ కోర్సు కాదు. దేశ భవిష్యత్, రక్షణకు ఇది గొడ్డలిపెట్టు. వేతనాలు, ఫించన్ల భారం తగ్గించుకోవడానికి కేంద్రం తీసుకున్న తలాతోకాలేని నిర్ణయం ఇది. దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలకు కేంద్రమే బాధ్యత వహించాలి.' -నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

అగ్నిపథ్​ను ఉపసంహరించాలి: భాజపా పాపం ముదిరి పాకానపడిందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మొన్న నల్ల వ్యవసాయ చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్నారని.. నేడు అగ్నిపథ్ లాంటి నిర్ణయాలతో యువత ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. నల్లధనం తెస్తాం... 15 లక్షల రూపాయలు పేదల ఖాతాల్లో వేస్తామని అమాయకుల ఓట్లు కొల్లగొట్టి.. ఇప్పుడు జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయం లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుశేరు కింద అమ్మేస్తూ... నిరుద్యోగాన్ని 5.6 % నుంచి 7.83 % పెంచేశారని తూర్పారపట్టారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు సాగుతున్నాయని... యువత ఆగ్రహం గమనించైనా కేంద్రం తన నిర్ణయాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఓటు బ్యాంకు రాజకీయమే కారణం: రైల్వే పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతిచెందడం బాధాకరమన్నారు మరో మంత్రి ప్రశాంత్‌రెడ్డి. దేశానికి సేవ చేయాలనే యువతను భాజపా అవమానిస్తోందని మండిపడ్డారు. మొన్న రైతులను, నేడు యువకులను రోడ్డున పడేశారని వాపోయారు. ఓటు బ్యాంకు రాజకీయమే దేశవ్యాప్త అల్లర్లకు కారణమన్నారు. ఆందోళన చేస్తున్న యువత సంయమనం పాటించాలని ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

శాంతియుతంగా పోరాడండి: సికింద్రాబాద్ ఘ‌ట‌న‌పై మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో మృతిచెందిన యువకుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి వైద్యులు మెరుగైన వైద్యమందించాలని సూచించారు. అగ్నిపథ్​ విషయంలో యువత సంయ‌మ‌నంతో శాంతియుతంగా పోరాడాలని ఎర్రబెల్లి సూచించారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఒక ఆనాలోచిత‌, ఆప‌రిప‌క్వ‌, అసంబ‌ద్ధ ఆలోచ‌న వ‌ల్ల ఈ అన‌ర్థాలు జ‌రుగుతున్నాయి. 10వ తరగతి పాసైన విద్యార్థులు అగ్నిపథ్‌లో చేరి తిరిగి వెళ్లేటప్పుడు 12వ తరగతి పాసైన సర్టిఫికెట్ ఇస్తామనడం సిగ్గు చేటు అని తీవ్రంగా తప్పుపట్టారు. దేశ రక్షణ కోసం తీసుకుంటున్నారా... సర్టిఫికెట్​లో అప్రెంటిస్ షిప్ కోసం తీసుకుంటున్నారా...? అని మంత్రి ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.