ETV Bharat / city

ఇంటింటా వైద్య పరీక్షలు

author img

By

Published : May 15, 2020, 5:55 AM IST

రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపు తట్టాలని, ఆయా ఇళ్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా వంటి లక్షణాలున్న వారిని గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా ఇక నుంచి క్షేత్రస్థాయిలో వైద్యసిబ్బంది పనిచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు.

medical tests to each and every person in the state
ఇంటింటా వైద్య పరీక్షలు

రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని, క్షేత్రస్థాయి నుంచి వైద్య సిబ్బంది పని చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా వంటి లక్షణాలున్న వారిని గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

వలసజీవుల్లో ఈ లక్షణాలుంటే వెంటనే ఐసోలేషన్‌కు తరలించి, నమూనాలను పరీక్షలకు పంపించాలని సూచించారు. అ దే సాధారణ వ్యక్తుల్లో లక్షణాలు గుర్తిస్తే వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి, అక్కడి వైద్యుడి సలహా మేరకు అనుమానం ఉంటే ఐసోలేషన్‌కు తీసుకెళ్లి నమూనాలు సేకరించాలని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని వైద్యసిబ్బందితో గురువారం మంత్రి ఈటల దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ‘మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లను అవసరాల మేరకు వాడుకోవాలి. సర్వేకు వెళ్తున్నప్పుడు అందరూ మాస్కులు ధరించాలి. కరోనా నియంత్రణ చర్యలతో పాటు సాధారణ వైద్యసేవలను మళ్లీ గాడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఆరోగ్యశాఖపైనే ఉంది. ఆరోగ్యశాఖ సిబ్బందికి మాత్రమే పరీక్షలు నిర్వహించేలా ప్రత్యేకంగా ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకొస్తాం. పాజిటివ్‌ రాగానే, ఏమవుతుందోనని ఆగమాగం కావద్దు. తెలంగాణలో 98 శాతం మంది కరోనా బాధితులు కోలుకుని ఇళ్లకెళ్తున్నారు. కనుక ధైర్యంగా పనిచేయాలి.' అని మంత్రి తెలిపారు.

జీతాలివ్వకుంటే చెప్పండి

" ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల్లో ఎవరికైనా జీతభత్యాలు ఆలస్యంగా వస్తే వెంటనే సమాచారమివ్వండి. మీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమస్య ఉంటే, మొహమాటం లేకుండా చెప్పండి. 104, 108, 102 వాహనాల పనితీరును బేరీజు వేసుకుని, లోటుపాట్లు చక్కదిద్దాలి. ఇవి లేకపోతే, ప్రైవేటు అంబులెన్సులు, ఇతర వాహనాలనైనా వినియోగించుకోవాలి. సాధారణ రోగులకు ఒక ఓపీ... జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి మరొకటి నిర్వహించాలి. వైద్యులు ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సేవలందించాలి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక అధికారులను నియమించి, పరిస్థితిని సమీక్షించాల"ని మంత్రి ఆదేశించారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.