ETV Bharat / city

శ్రీదేవి డ్రామా కంపెనీ ఎఫెక్ట్.. 8 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కుమార్తె

author img

By

Published : Jun 28, 2022, 10:30 AM IST

శ్రీదేవి డ్రామా కంపెనీ ఎఫెక్ట్
శ్రీదేవి డ్రామా కంపెనీ ఎఫెక్ట్

SriDevi Drama Company Show Effect : శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఈటీవీ ప్రసారమవుతోన్న పాపులర్ షో.. కామెడీ స్కిట్స్.. అదిరిపోయే డ్యాన్స్​ పర్ఫామెన్స్​లు.. అలరించే పాటలు.. అప్పుడప్పు హృదయాల్ని హత్తుకునే రియల్ స్టోరీలతో ప్రేక్షకులన్ని ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే గాక.. ఎనిమిదేళ్ల క్రితం తల్లి నుంచి దూరమైన ఓ కుమార్తెను మళ్లీ తల్లి చెంతకు చేర్చింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో చదవేయండి మరి..

SriDevi Drama Company Show Effect : ఓ మాతృమూర్తి ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించింది.. కన్నకూతురి కోసం ఏళ్ల తరబడి చేసిన వెతుకులాటకు ప్రతిఫలం దక్కింది. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అనాథగా జీవిస్తున్న చిన్నారి.. కుటుంబం చెంతకు చేరింది. ఈటీవీలో ప్రసారమైన కార్యక్రమంతో తల్లి ఒడికి కుమార్తె చేరుకున్న ఘటన భాగ్యనగరంలో చోటు చేసుకుంది.

ఈసీఐఎల్‌ కమలానగర్‌లో ఉండే పిన్నమోని కృష్ణ, అనురాధ దంపతులకు నలుగురు ఆడపిల్లలు. వీరిలో ఇందూ 2014 సెప్టెంబరు 3న మూడున్నర సంవత్సరాల వయసులో ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కుషాయిగూడ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి జిల్లాల్లోని తెలిసిన అనాథాశ్రమాలన్నీ తిరిగారు. అలా ఆ తల్లి ఎనిమిదేళ్లుగా పాప కోసం వెతుకుతూనే ఉంది.

.

‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో ఇటీవల తండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక స్కిట్‌ రూపొందించారు. అందులో కొందరు అనాథ పిల్లలు పాల్గొన్నారు. టీవీలో ఆ షో చూస్తున్న సమయంలో ఓ పాప అనురాధ దృష్టిని ఆకర్షించింది. తన కుమార్తెలానే ఉందని భావించి తెలిసిన వారి ద్వారా ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ, అధికారుల సాయంతో భాగ్యనగర శివారులోని కిస్మత్‌పురాలోని అనాథ పిల్లల బాలికల సంరక్షణ కేంద్రంలో పాప ఉందని తెలుసుకున్నారు. వెంటనే అక్కడి చేరుకున్నారు.

టీవీలో చూసింది తన కుమార్తె అని తెలుసుకుని ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. వారి నుంచి సమగ్రంగా ఆధారాలు సేకరించి నిర్ధారించుకున్న అధికారులు సోమవారం హైదరాబాద్‌ మధురానగర్‌లోని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో తల్లిదండ్రులకు పాపను అప్పగించారు. కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జేడీ(అడ్మిన్‌) సునంద, ఆర్జేడీ శారద పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.