ETV Bharat / city

నరకాసురుని వధ జరిగింది ఆ జిల్లాలోనే..!

author img

By

Published : Nov 14, 2020, 5:06 PM IST

దీపావళి.. నరకాసురుణ్ణి వధించిన ఆనందంలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండగ. ఆ తరువాతి కాలంలో.. దీపాల పండగగా, టపాసులు కాలుస్తూ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా జరుపుకునే వేడుకగా మారింది. శ్రీకృష్ణుడు, సత్యభామ నరకుణ్ణి వధించారని అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడ వధించారో తెలుసా..!

nadukuru temple
నరకాసురుని వధ జరిగింది ఆ జిల్లాలోనే..!

పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రజలను హింసించసాగాడు. ప్రజలంతా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు. ప్రజల ఆక్రందనలూ ప్రార్థనలూ విన్న శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుడిని సంహరిస్తాడు. ఆశ్వయుజ శుద్ధ చతుర్దశినాడు నరకుని పీడ వదిలింది కాబట్టి ఆ రోజును నరక చతుర్దశి అని పిలుస్తారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో బాణాసంచాలు కాల్చారు. అలా దీపావళి పర్వదినం వచ్చింది పురాణాలు చెబుతున్నాయి.

ప్రజలందరిలోనూ సంతోషాన్ని నింపిన ఆ నరకాసుర వధ.. ఏపీలోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు ప్రాంతంలోనే జరిగిందని స్కంధ పురాణం చెబుతోంది. నదీతీర గ్రామమైన నడకుదురు ఆనాడు నరకోత్తారక క్షేత్రంగా విలసిల్లింది. నరకాసుర సంహారం అనంతరం శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై.. ఇక్కడ వెలసిన లక్ష్మీనారాయణులను పాటలీ పుష్పాలతో పూజలు చేశాడని పురాణ కథనం. ఆ తరవాత శ్రీకృష్ణుడు దేవవనం నుంచి పాటలీ వృక్షాలను తెచ్చి నడకుదురులో నాటాడట. నరకోత్తారక క్షేత్రంగా విలసిల్లిన ఈ ప్రాంతం తర్వాతి కాలంలో నరకొత్తూరు, నడకదూరు, నడకుదురుగా రూపాంతరం చెందింది. శ్రీకృష్ణుడు పూజించినట్టు చెప్పే లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఇక్కడి కార్తీక వనంలోని ఓ గుడిలో ఉన్నాయి.

పృథ్వీశ్వరుణ్ణి పూజిస్తే సంతానం..

ద్వాపరయుగం నాటికే ఈ ప్రాంతంలో పరమేశ్వరుడు పృథ్వీశ్వరుడిగా వెలిశాడు. లక్ష్మీనారాయణుల ఆలయమూ ఉంది. నరకాసురుడు ఇక్కడ ద్విముఖుడు అనే బ్రాహ్మణుణ్ణి చంపాడు. ఆ పాప పరిహారార్థం పృథ్వీశ్వరుడికి పూజలు చేశాడట. ఒకప్పుడు ఈ ఆలయం ఎంతో ఎత్తులో ఉండేదట. కాలగర్భంలో మార్పుల కారణంగా భూమి కంటే తక్కువ ఎత్తులోకి దిగిపోయింది. ఇది మిగతా ఆలయాల్లా కాకుండా పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. దీనికి ఎదురుగా కృష్ణా నది ప్రవహిస్తుంటుంది. పృథ్వీశ్వరుణ్ణి పూజిస్తే సంతానం కలుగుతుందని స్థానికుల నమ్మకం.

ఏకైక పాటలీవనం..

దేశంలో పాటలీ వృక్షాలు చాలా అరుదు. కాశీ, నడకుదురు ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు కాశీలో కూడా పాటలీ వృక్షాలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. పాటలీ వృక్షాలను వేరొకచోట నాటినా అవి పెరిగిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ చాలా పాటలీ వృక్షాలు వనంలో పెరుగుతున్నాయి. కార్తీక మాసంలో పూసే పాటలీ పుష్పాలతో పృథ్వీశ్వర స్వామికి పూజలు చేస్తారు. పృథ్వీశ్వరుని పూజకు కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఆలయం చెంతనే ఉన్న కార్తీక వనంలో వందలాదిగా ఉన్న ఉసిరి చెట్లు వేలాది మందికి ఆతిథ్యాన్నిస్తాయి. కార్తీకంలో ఇక్కడి వనాల్లో సహపంక్తి భోజనాలు చేస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో అరుదైన ఉసిరి, పాటలీ వృక్షాలతో నిండిన ఈ వనాల్లో భోజనాలు చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది వస్తుంటారు.

ఇదీ చదవండి: దీపాల వెలుగుల్లో మెరుస్తూ మైమరిపిస్తున్న తారలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.