ETV Bharat / city

నిర్వికార నిరంజనుడు.. దయామయుడు.. శివశంకరుడు

author img

By

Published : Mar 11, 2021, 2:17 PM IST

శివుడు.. నిర్వికారుడు.. నిరంజనుడు.. దయామయుడు.. కరుణించి వరాలిచ్చే బోళా శంకరుడు.. ఆయన ఎక్కడుంటాడు? ఆయన రూపం ఎలా ఉంటుంది?

special story on lord shiva on the eve of maha shivratri
నిర్వికార నిరంజనుడు శివశంకరుడు

‘శివ’ అనే పదానికి ‘ఏది లేదో... అది’ అనే అర్థం ఉంది. అంటే అఖండ శూన్యం అనుకోవచ్చు. కంటికి కనిపించని అనంతమైన ఆ చీకటిలో నుంచే తేజోమయ ప్రపంచం అంతా ఆవిర్భవిస్తోంది. నక్షత్ర మండలాలు, కృష్ణ బిలాలు, సకల జీవరాశులు... అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. అందులోనే లీనమై పోతున్నాయి. ఆ సువిశాలమైన శూన్యాన్నే ‘శివ’ అంటారు. అంటే అన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి ఆయనలోనే కలిసిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. శివ అంటే చలనంలేని వాడు అనే మరో అర్థం కూడా ఉంది. ఇక్కడ చలనం లేకపోవడమంటే జడత్వం అని కాదు. సృష్టిలోని అణువణువులోనూ ఉన్న పరమేశ్వరుడు కదలటానికి అవకాశం ఎక్కడ? అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. నిరంతరం ఉంటాడు కాబట్టే ఆయన్ని సదా శివుడని అంటారు. జగత్తులో కదిలేది... కదలనిది.. అంతా ఆయనే కదా.

ఆ ‘జ్యోతి’ మనలోనే..!

ఆధ్యాత్మికంగా చైతన్యాన్ని జ్యోతి అంటారు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంగా వెలిశాడంటే తన తేజస్సును అంతలా విస్తరింపజేశాడని భావం. ప్రతి మనిషిలోని పరమ చైతన్యం ఆ పరమేష్ఠిదే. మనలో ఉండే పంచ కర్మేంద్రియాలు (వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ), పంచ జ్ఞానేంద్రియాలు (చర్మం, కన్ను, నాలుక, చెవి, ముక్కు), మనస్సు, జీవుడు... ఈ పన్నెండింటిలో నిండి ఉండేది పరమేశ్వరుడే కాబట్టి మనలోని శివతత్త్వం ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపాలకు ప్రతీకలని చెప్పొచ్చు.

మనలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానమనే పంచ ప్రాణాలున్నాయి. మరో అయిదు ఉప ప్రాణాలున్నాయి. అవి.. నాగ (త్రేన్పుగా వచ్చే గాలి), కూర్మ (రెప్పపాటుకు కారణమైన గాలి), కృకర (తుమ్ము), ధనుంజయ (హృదయనాడులను తెరుస్తూ, మూస్తూ ఉండే వాయువు), దేవదత్తం (ఆవులింతలోని గాలి). వీటితో పాటు ఆత్మ... ఈ పదకొండు ప్రాణశక్తులు ఏకాదశ రుద్రులకు ప్రతీక.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం... వీటిలో ఉండే శక్తి అంతా పరమేశ్వర స్వరూపమే.

మనలోనూ, ప్రకృతిలోనూ పరమేశ్వరుడిని దర్శించమని మనిషికి బోధించడమే ఇందులోని అంతరార్థం.

గత్తు ప్రారంభం సృష్టి. అది చైతన్యంతో కళకళలాడుతూ ఉండడం స్థితి. తిరిగి ఈ జగత్తు ఎక్కడ ప్రారంభమైందో అక్కడే లీనమవ్వడమే లయం... ఇదంతా శివతత్త్వమే. అనంతం, అఖండం అయిన ఆ విరాట్‌ రూపాన్ని వేద రుషులు దర్శించారు. ఓ ప్రసిద్ధ శ్లోకంలో పరమశివుడి విశ్వరూపాన్ని వివరించారు.

ఆ పాతాళ నభః స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర
జ్జ్యోతిః స్ఫాటిక లింగమౌళి విలసత్‌ పూర్ణేందువాంతామృతైః
అస్తోకాప్లుత మేకమీకమనిశం రుద్రానువాకం జపన్‌
ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివమ్‌

పాతాళం నుంచి ఆకాశం చిట్టచివరి కొనవరకూ బ్రహ్మాండమైన ఆకారంలో శుద్ధ స్ఫటిక లింగరూపంగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. శిరస్సుపై కొలువైన చంద్రమండలం నుంచి వెలువడుతున్న అమృతధారలు ఆ స్వామికి చేస్తున్న అభిషేకంలా ప్రకాశిస్తున్నాయి. విశ్వమంతా తానొక్కడై నిండిన ఆ రుద్రమూర్తిని నా కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నాను... అంటూ చేసిన వర్ణన ఆయన సర్వ వ్యాపకత్వాన్ని నిరూపిస్తుంది.

నాగేంద్రహారాయ త్రిలోచనాయ...

త్రిశూలంలోని మూడు కొనలు సత్త్వ, రజ స్తమో గుణాలకు ప్రతీకలు. అవి మూడూ ఒక పిడి వద్ద కలుసుకుంటాయి. అవి త్రిగుణాల ఏకత్వానికి సంకేతం.

డమరుకం విశ్వంలోని నాదానికి ఉత్పత్తిస్థానం. పంచాక్షరీ మంత్ర సాధన చేస్తున్నప్పుడు ఆ ప్రకంపనలు తరంగాలుగా మారి అనంతాకాశంలో ప్రయాణించి శివ డమరుక ధ్వనితో సంయోగం చెందుతాయి. అప్పుడు పరమేశ్వరానుగ్రహం కలుగుతుందని చెబుతారు.
పరమేశ్వరుడి జటాజూటంలోని చంద్ర రేఖ ఆయన కాలస్వరూపుడనే విషయాన్ని తెలియజేస్తుంది. శివారాధకులకు చంద్రుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

శివయ్య మెడలో మూడు చుట్టలుగా ఉన్న సర్పం కాల చక్రానికి సంకేతం. భూత, భవిష్యత్‌, వర్తమానాలకు అవి సంకేతం.

త్రినేత్రం... ఇది ఇతర కళ్లలాంటిది కాదు. సకల ద్వంద్వాలకు అతీతమైన స్థితిని ప్రకటిస్తుందీ నేత్రం.

సదా శివుడు సంపద కారకుడు, సర్వ సౌఖ్యాలను ఇచ్చేవాడు. కాస్తంత అభిషేకానికే సంతోషిస్తాడు. అందుకే భోళా శంకరుడు అంటారు. అలాంటి శివుణ్ణి భక్తితో కొలిచే రోజు శివరాత్రి. శివరాత్రి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రుద్రాభిషేకం. నమకం, చమకం, మహన్యాసం వీటి సమాహారంతో శివునికి అభిషేకం చేస్తారు.

సదా శివుడు సంపద కారకుడు

మనిషి శివుడు ఎప్పుడవుతాడు?

‘నారుద్రో రుద్రమర్చయేత్‌’ అంటారు... అంటే రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకానికి అర్హుడు కాడనేది శాస్త్ర వచనం. అంటే మనిషి శివుడుగా మారితేనే పూజకు అర్హుడవుతాడన్నమాట. ఇది ఎలా సాధ్యమవుతుంది? యజుర్వేదం ఇలా వివరించింది..
వ్యక్తి శివ చైతన్యాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు కావాలి. పాంచభౌతికమైన శరీరంలోకి పరమ తత్త్వాన్ని ఆహ్వానించాలంటే అతనిలో కొన్ని సంస్కరణలు జరగాలి.

అందుకోసం మహన్యాసం అనే విధానం ఉంది. రుద్రుని తన ఆత్మలో నిలుపుకోవడం కోసం చేసే ప్రార్థననే రౌద్రీకరణం అంటారు. ఇది చాలా మహిమాన్వితమైంది. న్యాసం అంటే ఉంచడం, తాకడం అని అర్థం. భక్తుడు మంత్రాలను పఠిస్తూ, తన శరీరంలోని భాగాలను తాకుతుండడం వల్ల పరమేశ్వర శక్తి అతని దేహాత్మల్లో ప్రవేశించినట్లు భావిస్తారు. తద్వారా రుద్రార్చనకు అర్హత పొందుతాడు. ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు ఇమిడి ఉన్న రుద్రమహన్యాసంలో ఐదు అంగ న్యాసాలుంటాయి

* శిఖ నుంచి ముంగురుల వరకు ముప్ఫై ఒక చోట్ల తాకడం ప్రథమాంగన్యాసం

* శిరస్సు నుంచి పాదాల వరకు పదిచోట్ల తాకడం ద్వితీయాంగన్యాసం

* పాదాల నుంచి శిరస్సు వరకు ఐదు చోట్ల తాకే ప్రక్రియ తృతీయాంగన్యాసం

* గుప్తావయవాల నుంచి శిరస్సు వరకు ఐదు ప్రదేశాలను తాకడం చతుర్థాంగన్యాసం

* హృదయం నుంచి ఐదు చోట్ల తాకితే అది పంచమాంగ న్యాసం

ఇలా వేద మంత్రోచ్చారణతో వివిధ పద్ధతుల్లో, శరీర భాగాలను తాకితే ఆయుష్షు, ఆరోగ్యం, వర్ఛస్సు, తేజస్సు లాంటివి వృద్ధి చెందుతాయని చెబుతారు. ఆ తర్వాత నమకచమకాలతో రుద్రాభిషేకం చేస్తారు.

* నమ: అనే పదం చివరగా ఉండే మంత్రాలు నమకంగా, చమే అన్న పదం మరల మరల వచ్చే భాగం చమకంగా ప్రసిద్ధి చెందాయి.

నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః

నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ముతతేనమః

యా త ఇషు శ్శివతమా శివం బభూవ తేధనుః శివా శరవ్యాయా తవ తయానో రుద్ర మృడయ... అంటూ సాగే నమకంలో పదకొండు అనువాకాలుంటాయి. తిరిగి ఒక్కో అనువాకంలో పదమూడు నుంచి పందొమ్మిది వరకు మంత్రాలుంటాయి. శివుని రౌద్ర రూపాన్ని చూసి చలించిన భక్తులు పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేసే ప్రార్థన ఇది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన విషయాలు దాగి ఉన్నాయి. ఉదాత్త, అనుదాత్త, స్వరితాలతో స్వరయుక్తంగా వీటిని ఉచ్చారణ చేయాలి. ఇవి. వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనవి.

* నమో భవాయ చ రుద్రాయచ..
నమశ్శర్వాయ చ పశుపతయే చ.....అంటూ సాగుతుంది చమకం. మ అనే బీజాక్షరం మృత్యువుకు అతీతంగా ఉండే తత్త్వాన్ని సూచిస్తుంది. భక్తుడు తనను తానే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని చేసే ప్రార్థన చమకం. మరణాన్ని కూడా శాసించగలిగే శక్తి యజుర్వేదంలో భాగమైన ఈ నమకచమకాలకు ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే రుద్రాభిషేకం ఆయురారోగ్యభాగ్యాల సంచితమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.