ETV Bharat / city

గుప్త నిధుల కోసం దుర్గం కనిగిరి దుర్గంలో తవ్వకాలు

author img

By

Published : Jun 19, 2021, 11:02 AM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి దుర్గానికి ఒక చరిత్ర ఉంది. ఇదీ ఎందరో రాజులు ఏలిన ప్రాంతం. ఈ ప్రాంతం అంతా సిరిసంపదలతో వెలిసిందని ప్రతీతి. ఆ నాటి తీపిగుర్తుల ఆనవాళ్లు మాత్రమే నేటికీ మిగిలి ఉన్నాయి. అయితే చరిత్ర కట్టడాలను పరిరక్షించే అధికారులు, అటవీశాఖ సిబ్బంది ఇటువైపుగా చూడట్లేదు. దీంతో స్థానిక కట్టడాలు, సమాధులు, బురుజులపై గుప్తనిధుల వేటగాళ్ల కన్ను పడింది. వారం రోజులుగా దుర్గం దట్టమైన కొండ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్న ఆనవాళ్లు ఎన్నో కనిపిస్తున్నాయి.

Breaking News

ప్రకాశం జిల్లా కనిగిరి దుర్గం వద్ద గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు చేపట్టడం కలకలం రేపుతోంది. ఈ దుర్గంతో పాటు, సమీపంలోని గొల్లభామ చెరువు, పనస వాగు, ఏనుగుల వాగు, చాకలి కుంట, దొంగల బావి తదితర ప్రాంతాల్లో రాజులు కట్టించిన కట్టడాలే కాకుండా వారి కాలంలో నిర్మించిన రాక్షస గూళ్లు (సామూహిక సమాధులు) ఉన్నాయి. నాడు ఈ ప్రాంతాలను కాటమరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, కాకతీయులు పాలించిన చరిత్ర ఉంది.

గుర్తుతెలియని వ్యక్తులు వివిధ కట్టడాలు ఉండే ఈశాన్య మూలల్లో తవ్వకాలు చేపట్టారు. పొక్లెయిన్‌తో తవ్వి గుంతలమయం చేశారు. చారిత్రక ఆనవాళ్లు లేకుండా చేశారు. పూజలు చేసినట్లుగా గురుతులు ఉన్నాయి. ఔత్సాహిక పరిశోధకులు, ఉపాధ్యాయులు కొండ్రెడ్డి భాస్కర్‌రెడ్డి, కేవీ రమణారెడ్డి, టి.శ్రీనివాసులరెడ్డి, ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఆ ప్రాంతాలను పరిశీలించారు. తవ్వకాల్లో దుండగులు పడవేసిన పురాతన కుండలు, ఇటుక, ఇతర మట్టి, వంట పాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

వాటిని సంబంధిత అధికారులకు అప్పగించనున్నట్లు వారు తెలిపారు. అటవీశాఖ అధికారి రామిరెడ్డి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా గుప్త నిధుల పేరుతో పురాతన కట్టడాలు, సమాధులు, చారిత్రక ఆధారాలు తవ్వితే నేరమని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అటవీ శాఖ పరిధిలో ఇటువంటివి చోటుచేసుకుంటే సమాచారం ఇవ్వాలని.. తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చదవండి: ఎదురెదురుగా రెండు కార్లు ఢీ... నలుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.