ETV Bharat / city

Repalle Rape Case: 'రాజకీయ కోణం ఏంలేదు.. ముగ్గురిని అరెస్ట్ చేశాం'

author img

By

Published : May 1, 2022, 3:34 PM IST

Repalle Rape Case: ఏపీ రేపల్లె అత్యాచార కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు అత్యాచార ఘటన జరిగినట్లు ఆయన వెల్లడించారు.

Repalle
Repalle

Repalle Rape Case: ఏపీ బాపట్ల జిల్లా రేపల్లె అత్యాచార కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని.. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఘటన జరిగిందని చెప్పారు. టైమ్ అడిగి బాధితురాలి భర్తతో నిందితులు విజయకృష్ణ, నిఖిల్​తో పాటు మరో బాలుడు వివాదం పెట్టుకున్నారన్నారు. వాచీ లేదనటంతో ఆమె భర్తను కొట్టి డబ్బులు లాక్కొన్నారన్నారు. అనంతరం బాధితురాలిని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారని వెల్లడించారు. బాధితురాలి భర్త పోలీస్‌స్టేషన్‌కు రాగానే.. పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్‌కు వెళ్లారన్నారు. నిందితుడు చొక్కా మార్చుకున్న ప్రదేశాన్ని బట్టి.. దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను గుర్తించామన్నారు.

"అర్ధరాత్రి ఒంటిగంటకు అత్యాచార ఘటన జరిగింది. టైమ్‌ అడిగి బాధితురాలి భర్తతో వివాదం పెట్టుకున్నారు. వాచీ లేదనడంతో ఆమె భర్తను కొట్టి రూ.750 లాక్కున్నారు. బాధితురాలిని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారు. స్థానికుల సాయంతో ఆమె భర్త రేపల్లె పోలీసులను ఆశ్రయించారు. పోలీసు జాగిలం, ఇతర ఆధారాల ద్వారా నిందితులను గుర్తించాం. నిందితులపై సెక్షన్ 376(d), 394, 307, R/w 34 కింద కేసు నమోదు చేశాం. కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం."

-ఎస్పీ వకుల్ జిందాల్

ఏం జరిగిందంటే: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో అర్థరాత్రి దారుణం జరిగింది. ఓ వలస కూలీ మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భర్తను కొట్టి ముగ్గురు నిందితులు కలిసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపారు. భర్త వద్దనున్న కొంత నగదును లాక్కెళ్లినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత దంపతుల నుంచి వివరాలు సేకరించారు. బాధితురాలిని రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రేపల్లె ఘటన అత్యంత బాధాక‌రం: రేప‌ల్లెలో మ‌హిళ‌పై అత్యాచారం ఘటన అత్యంత బాధాక‌రమని.. మంత్రి రజని అన్నారు. ఘటనపై.. సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డేవ‌ర‌కు ప్రభుత్వం వ‌దిలిపెట్టదన్న మంత్రి.. ఇప్పటికే ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఘటనపై జిల్లా ఎస్పీ, ఆస్పత్రి అధికారుల‌తో మాట్లాడినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుందని మంత్రి రజని స్పష్టం చేశారు. ఘటన జరిగిన 5 నిమిషాల్లోనే పోలీసులు స్పందించారని మరో మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. అత్యాచార ఘటన బాధకరమన్న ఆయన..బాధితులకు ప్రభుత్వం రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసిందన్నారు. నిందితులను వదిలేది లేదని స్పష్టం చేసిన మంత్రి.. బాధితురాలికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

నిందితులను శిక్షించాలి: రేపల్లెలో జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైల్వేస్టేషన్‌లో మహిళల భద్రతకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. బాధితురాలిని అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.